తిరుమ‌ల బంగారంపై ఉన్న‌త స్థాయి విచార‌ణ‌!

చంద్ర‌బాబునాయుడి హ‌యాంలో తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానంలో జ‌రిగిన అవ‌క‌త‌వ‌క‌ల‌పై ఒక్కొక్క‌టిగా విచార‌ణ జ‌ర‌గ‌నుందా? ప‌్ర‌భుత్వంలో జ‌రుగుతున్న వ్య‌వ‌హారాలు చూస్తుంటే ఇది క‌రెక్టే అనిపిస్తున్న‌ది. ముందుగా తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం కు చెందిన బంగారం విష‌యంలో ఉన్న‌త స్థాయి విచార‌ణ‌కు ఆదేశించే అవ‌కాశం క‌నిపిస్తున్న‌ది. తమిళ‌నాడులోని తిరువ‌ళ్లూరు జిల్లా ఆవ‌డి స‌మీపంలో వేంప‌ట్టు చెక్‌పోస్టు వ‌ద్ద అనుమానాస్ప‌ద ప‌రిస్థితిలో తిరుమ‌ల శ్రీ‌వారికి చెందిన 1381 కిలోల బంగారం దొరికిన విష‌యం త‌లిసిందే. ఏప్రిల్ 17 వ తేదీన తమిళనాడులో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో పోలీసులు అన్ని వాహ‌నాలు త‌నిఖీ చేస్తున్న క్ర‌మంలో ఈ బంగారం దొరికింది. ప‌ట్టుకున్న పోలీసులే ఇదంతా టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం)కి చెందినది అని తెలియ‌డంతో ఈసీ అధికారులతో బాటు షాకయ్యారు.బంగారాన్ని తరలిస్తున్న వాహనాల్లో ఎటువంటి ఆధారాలు లేకపోవటంతో ఆ బంగారాన్ని తమిళనాడులోని పూందమల్లి తహసీల్దార్‌ కార్యాలయానికి తరలించారు.

చిట్ట‌చివ‌ర‌కు తిరుమ‌ల చేరిన బంగారం

ఈ క్రమంలో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు అధికారులు ఏప్రిల్ 18న ఈసీ అధికారులను కలిసి నగలకు సంబంధించిన ఆధారాలు చూపించారు. ఈ త‌ర్వాత‌ ఈ బంగారాన్నిఏప్రిల్ 19న టీటీడీ ఖజానాకు జమచేస్తామని పీఎన్‌బీ అధికారులు సమాచారం ఇచ్చారు. దీంతో టీటీడీ ఖజానాకు ఈ బంగారం చేరింది. బంగార‌మైతే తిరుమ‌ల‌కు చేరింది కానీ దీని వెనుక ఉన్న కార‌ణాలు బ‌హిర్గ‌తం కాలేదు. దేవ‌దేవుడైన తిరుమ‌ల శ్రీ‌వారి బంగారం విష‌యంలో నిజం నిగ్గుతేల్చేందుకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎల్ వి సుబ్ర‌హ్మ‌ణ్యం ఇప్ప‌టికే రెవెన్యూ శాఖ (ఎండోమెంట్స్ కార్య‌ద‌ర్శి)తో పూర్తి స్థాయి నివేదిక తెప్పించుకున్నారు. ఈ నివేదిక వ‌చ్చే నాటికి ఇంకా ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డ‌లేదు. అందువ‌ల్ల అప్ప‌టి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడికి ఈ రిపోర్టును త‌దుప‌రి చ‌ర్య‌ల కోసం ప్రభుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి పంపారు. అయితే ఈ రిపోర్టుపై చంద్ర‌బాబునాయుడు ఎలాంటి చ‌ర్య తీసుకోక‌పోగా విలేక‌రుల స‌మావేశంలో ఎగ‌తాళి చేస్తూ మాట్లాడారు.

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ప‌రిశీల‌న‌లో ఫైలు

అంతే కాకుండా బంగారం పోలేదు క‌దా దొరికింది క‌దా ఇందులో ఏముంది అని ఆయ‌న ప‌బ్లిక్‌గా ప్ర‌శ్నించారు. ఇప్పుడు ఆ రిపోర్టు నూత‌న ముఖ్య‌మంత్రి వై ఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి వ‌ద్ద‌కు చేరింది. ఆ రిపోర్టుపై తుది నిర్ణ‌యం తీసుకుని పూర్తి స్థాయి విచార‌ణ‌కు ఆయ‌న ఆదేశించే అవ‌కాశం ఉంది. అయితే సీనియ‌ర్ నాయ‌కుడు వై వి సుబ్బారెడ్డి తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం బోర్డు చైర్మ‌న్‌గా ప‌ద‌వీబాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌ర్వాత బోర్డు అభ్య‌ర్ధ‌న మేర‌కు చేయాలా లేక ప్ర‌భుత్వ‌మే నేరుగా నిర్ణ‌యం తీసుకోవాలా అనే అంశంపై ఆగి ఉన్న‌ది.