టీబీఎస్‌ అక్రమాలపై విచారించండి

  • 4 వారాల్లో నివేదిక సమర్పించండి
  • ఏపీ అనిశాకు ఉమ్మడి హైకోర్టు ఆదేశం
  • గ్లూకోమీటరు ఖరీదు రూ.5 లక్షలుగా చూపారు
  • ఇవీ టీబీఎస్‌ అవకతవకలంటూ పిల్‌లో పేర్కొన్న ఫిర్యాదుదారు

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో బయో మెడికల్‌ పరికరాల నిర్వహణలో అక్రమాలు జరిగాయంటూ ఇచ్చిన ఫిర్యాదుపై ప్రాథమిక దర్యాప్తు చేపట్టని అవినీతి నిరోధక శాఖ(అనిశా) తీరుపై గురువారం ఉమ్మడి హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. నిర్వహణ కాంట్రాక్టు పొందిన టీబీఎస్‌ టెలిమాటిక్‌ అండ్‌ బయోమెడికల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ అక్రమాలపై ఫిర్యాదు అందితే ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేసి దర్యాప్తు చేయడం కంటే ముందు కనీసం ప్రాథమిక దర్యాప్తు కూడా చేపట్టని అనిశాను నిలదీసింది. గత ఏడాది డిసెంబరులో ఫిర్యాదు ఇస్తే ఇప్పటివరకు స్పందించకపోవడం సరికాదంది. టీబీఎస్‌ అక్రమాలపై నాలుగు వారాల్లో దర్యాప్తు చేపట్టి నివేదిక సమర్పించాలని అనిశాను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

రూ.51 కోట్ల దుర్వినియోగం
జాతీయ హెల్త్‌ మిషన్‌ కింద రాష్ట్రంలో బయో మెడికల్‌ పరికరాల నిర్వహణ కాంట్రాక్ట్‌ పొందిన టీబీఎస్‌ టెలిమాటిక్‌ అండ్‌ బయో మెడికల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ అక్రమాలకు పాల్పడిందని, రూ.50.93 కోట్ల దుర్వినియోగం జరిగిందంటూ అనిశాకు ఫిర్యాదు ఇచ్చినా స్పందించకపోవడాన్ని సవాలు చేస్తూ తూర్పుగోదావరి జిల్లా అవిడి గ్రామానికి చెందిన ఇందుకూరి వెంకటరామరాజు ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్‌) దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టీబీఎన్‌ రాధాకృష్ణన్‌, జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది పి.గంగయ్యనాయుడు వాదనలు వినిపిస్తూ పీహెచ్‌సీ, సీహెచ్‌సీల్లో బయోమెట్రిక్‌ నిర్వహణ కాంట్రాక్ట్‌ పొందిన టీబీఎస్‌ అక్రమాలకు పాల్పడిందని, దీనిపై ఆధారాలతో సహా గత ఏడాది డిసెంబరు 18న అనిశా డీజీకి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. నిర్వహణ సామాగ్రి కొనుగోలు ధరపై 7.4 శాతం సర్వీసు ఛార్జీ ఉంటుందని అందువల్ల వాటి ధరను అధికారుల సాయంతో కాంట్రాక్టరు ఎక్కువగా చూపారన్నారు. రూ.840 విలువ చేసే గ్లూకోమీటరును కంపెనీ ధర రూ.5.08 లక్షలుగా చూపి నిర్వహణ ఛార్జీలు పొందిందని చెప్పారు. 12 గ్లూకోమీటర్లకుగాను రూ.60.96 లక్షలను క్లెయిం చేసిందన్నారు. అంతేగాకుండా గ్లూకోమీటరు మరమ్మతుకు రూ.37,642 ఛార్జీ చేస్తోందని, ఒక్క గ్లూకోమీటరుకు పెట్టే మరమ్మతు ఖర్చుతో 44 కొత్త గ్లూకోమీటర్లు కొనుగోలు చేయవచ్చన్నారు. కర్నూలు జీజీహెచ్‌లో రూ.1.70 కోట్ల విలువ చేసే ఎంఆర్‌ఐ మిషన్‌ నిర్వహణకు రూ.3.5 కోట్లు ఛార్జీ చేసిందని చెప్పారు. రూ.5 వేల విలువ చేసే మైక్రోటెక్‌ స్కానర్‌ను రూ.2.48 కోట్లుగా చూపి నిర్వహణ ఛార్జీలు వసూలు చేసిందన్నారు.

సూపరింటెండెంట్‌ సంతకంలేకున్నా…
కంపెనీ చేసిన బిల్లులు చెల్లించాలంటే ఆస్పత్రి సూపరింటెండెంట్‌ సంతకంతో కూడిన ధ్రువీకరణ పత్రం అవసరముండగా, దానితో సంబంధం లేకుండా సొంతంగా బిల్లులు తయారు చేసి సొమ్ము వసూలు చేసిందన్నారు. ఉన్నతాధికారుల మద్దతుతోనే అవినీతి జరిగిందని, దీనిపై ఫిర్యాదు చేసినా అనిశా పట్టించుకోలేదన్నారు. దీనిపై ఏసీబీ వివరణ కోరగా ఫిర్యాదు అందిన మాట వాస్తవమేనని, పరిశీలనలో ఉందని, ఇంకా దర్యాప్తు ప్రారంభించలేదనడంతో ఫిర్యాదు అందితే కనీసం ప్రాథమిక దర్యాప్తు కూడా చేయరా? అంటూ ధర్మాసనం నిలదీసింది. వైద్యఆరోగ్య శాఖ తరఫున ప్రభుత్వ న్యాయవాది బి.దేవానంద్‌ జోక్యం చేసుకుంటూ అక్రమాలపై విచారణ జరిగిందంటూ వివరాలను సమర్పించారు. వీటిని పరిశీలించిన ధర్మాసనం ప్రభుత్వ విచారణను అనిశా విచారణగా ఎలా చెబుతారని ప్రశ్నించింది. పిటిషనర్‌ ఇచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు చేసి 4 వారాల్లో నివేదిక సమర్పించాలంటూ అనిశాను ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.