టిట్లీ అప్‌డేట్స్‌ : తుపాను ధాటికి ఎనిమిది మంది మృతి

ఉత్తరాంధ్రను వణికిస్తున్న ‘టిట్లీ’ తుపాను శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం పల్లెసారథి వద్ద ఈరోజు ఉదయం తీరాన్ని దాటింది. తీరం దాటిన సమయంలో పెనుగాలులు భీభత్సం సృష్టించాయి. గంటకు 110 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి. తుపాను తీరాన్ని దాటినప్పటికీ వజ్రపుకొత్తూరు, సోంపేట, తదితర మండలాల్లో గాలులు, వర్షభీభత్సం కొనసాగుతోంది. పలు ప్రాంతాలలో ఇళ్ల పైకప్పులు ఎగిరిపడ్డాయి. బలమైన గాలులు వీచడంతో చెట్లు, పూరిగుడిసెలు, ఇళ్లు నేలమట్టమవుతున్నాయి. కుండపోతగా వర్షం కురుస్తుండటంతో పాటు గంటకు 120 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. అనేక చోట్ల విద్యుత్‌ అంతరాయం ఏర్పడింది. పెనుగాలు కారణంగా శ్రీకాకుళం జిల్లాలో చాలాచోట్ల విద్యుత్‌, కమ్యూనికేషన్‌ వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైంది. దీంతో అనేక ప్రాంతాల్లో చిమ్మచీకట్లు అలుముకున్నాయి.

తుపాను ధాటికి ఇప్పటి వరకూ ఎనిమిది మృతి చెందారు.వీరిలో శ్రీకాకుళం జిల్లాకి చెందిన ఐదుగురు, విజయనగరం జిల్లాకి చెందిన ముగ్గురు ఉన్నారు.సముద్ర వేటకి వెళ్లి ఆరుగురు చనిపోగా, ఇల్లు కూలి ఒకరు, చెట్లు కూలి మరొకరు చనిపోయారని అధికారులు ధృవీకరించారు.

శ్రీకాకులం జిల్లా సంతబొమ్మాళి మండలం వడ్డితాండ్ర గ్రామానికి చెందిని కుత్తుము అప్పలస్వామి అనే వ్యక్తి తన ఆవును పశువు శాల నుంచి రక్షించబోతుండగా దూలం విరిగి మీదపడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సరిబుజ్జిలి మండలంలో ఇద్దరు, టెక్కిలి మండలంలో ఇద్దరు, పాలకొండ మండలంలో మరొకరు మృతి చెందినట్లు సమాచారం. విజయనగరానికి చెందిన మరో ముగ్గురు కూడా మృతి చెందారని అధికారులు తెలిపారు.
తుపాను కారణంగా విశాఖ ఎయిర్‌పోర్ట్‌కి రావాల్సిన ఇండిగో సర్వీసులను రద్దు చేస్తున్నట్లు విమానాయన శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. కనుక సుదీర్ఘ దూర ప్రాంతాలకు వెళ్లవలసిన ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించగలరని ఎయిర్‌పోర్ట్‌ డైరెక్టర్ పేర్కొన్నారు .

విజయనగరం జిల్లాని పారాదీప్‌ సమీపంలో వేటకు వెళ్లిన ఎనిమిది మంది మత్య్సకారుల రెండు పడవలు బోల్తా పడ్డాయి. దీంతో ముగ్గురు మత్య్సకారులు గల్లంతు కాగా , ఐదుగురు సరక్షితంగా బయటపడ్డారు. పదిరోజుల క్రితం వేటకు వెళ్లిన మత్య్సకారులు తుపాను నేపథ్యం తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. గల్లంతైన మత్య్సకారులు పూసపాటిగేర మండలం పతివాడ బర్రిపేట గ్రామానికి చెందిన సూరాడ రాము(20), వాసుపల్లి లక్ష్మణరావు (30) బడి సత్తయ్య(35)లుగా గుర్తించారు.

తుపాను ప్రభావానికి శ్రీకాకుళంలోని 8మండలాలు సర్వనాశనమయ్యాయి.వలస కోటబొమ్మాలి, గారా, సోంపేటలో ఇళ్లపైకప్పులు ఎగిరిపోయాయి. ఇచ్చాపురం, సోంపేట, కవిటి, మందస, వజ్రపుకొత్తురు, సంతబొమ్మాలి మండలాలలో జీడి, మామిడి పంటలకు తీవ్రనష్టం జరిగింది.
పలు లోతట్లు ప్రాంతాలు మునిగిపోయాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వం కాల్‌ సెంటర్లు ఏర్పాటు చేసి సహాయక చర్యలను ముమ్మురం చేసింది.

కాల్‌సెంటర్‌ నంబర్లు : ఈపీడీసీఎల్‌ పరిధిలో 1912, కార్పొరేట్‌ ఆఫీస్‌ పరిదిలో 83310 18762, శ్రీకాకుళం – 94906 12633, 08492-227361, విజయనగరం- 94906 10102, 08922-222942, విశాఖ-72822 99975, 0891-2583611
టిట్లీ తుపాను ప్రభావంతో పలు రైళ్లను రద్దు చేశారు. విశాఖ-పలాస ప్యాసింజర్‌, ఎర్నాకులం-హుతియ ఎక్స్‌ప్రెస్‌ లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు. విశాఖ-న్యూపలాస రైళును మాత్రం విజయనగరం వరకు ప్రయాణిస్తుందని పేర్కొన్నారు.

తుపాను నేపథ్యంలో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో నేడు, రేపు జరగాల్సిన ఇంటర్‌ హాఫ్‌ఇయర్లీ పరీక్షలు వాయిదా వేసిననట్లు ఇంటర్‌ బోర్డ్‌ కార్యదర్శి ఉదయలక్ష్మీ ప్రకటించారు.
దువ్వాడ, విజయనగరం, ఖుర్దా స్టేషన్లలో రైళ్లు నిలిపివేశారు. పలు రైళ్లను రద్దు చేశారు. మరికొన్ని రైళ్లను దారి మళ్లించారు.
కళింగపట్నం,భీమునిపట్నంలో 10వ నంబర్‌ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.
విశాఖ, గంగవరం పోర్టుల్లో 8వ నంబర్‌ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.