టాప్‌ 10 10AM న్యూస్‌

1. శ్రీకాకుళం జిల్లా వంశధార నదిలో 53 మంది కూలీలు చిక్కుకున్నారు. సరుబుజ్జిలి మండలం పురుషోత్తపురం వద్ద నదీ గర్భంలోని ఇసుక ర్యాంపులో ఇసుక తవ్వుతుండగా అకస్మాత్తుగా వరద ఉద్ధృతి పెరిగింది. దీంతో నదిలో మధ్యలోని ఇసుకదిబ్బపైకి చేరిన కూలీలు అక్కడ చిక్కుకుపోయారు.53 మంది కూలీలతో పాటు 2 జేసీబీలు, 20 లారీలు కూడా ఉన్నాయి. వెంటనే సమాచారం అందుకున్న అధికారులు సహాయక బృందాలను రంగంలోకి దింపారు. ఇప్పటి వరకు 48 మందిని సహాయక బృందాలు ఒడ్డుకు చేర్చాయి. మిగిలిన వారిని తీసుకొచ్చేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఒడిశాలో కురుస్తున్న వర్షాలతో వంశధార, నాగావళి నదులకు వరదనీరు పోటెత్తుతోంది.

2. అనుభవమే గెలిచింది. ఫేవరెట్‌నే విజయం వరించింది. టోర్నీ ఆద్యంతం ఆల్‌రౌండ్‌ ప్రదర్శన చేసిన జట్టుకే టైటిల్‌ సొంతమైంది. మాజీ ఛాంపియన్‌ ఫ్రాన్స్‌.. మళ్లీ విశ్వ విజేతగా నిలిచింది. ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ను రెండోసారి ఎగరేసుకుపోయింది. గ్రూప్‌ దశలో ఆధిపత్యం చలాయించి.. ఆపై అర్జెంటీనాను మట్టికరిపించి.. ఉరుగ్వేను ఇంటిముఖం పట్టించి.. బెల్జియం కథ ముగించి.. ఫైనల్‌ చేరిన ఫ్రెంచ్‌ జట్టు.. తుది పోరులోనూ చెలరేగింది. ప్రత్యర్థితో పోలిస్తే బంతిని నియంత్రించడంలో వెనుకబడితేనేమి.. అందివచ్చిన అవకాశాల్ని అద్భుతంగా ఉపయోగించుకుంది. అదృష్టమూ కలిసొచ్చిన వేళ.. కప్పు ఆ జట్టుకే సొంతమైంది. ఆదివారం రాత్రి ఫుల్‌బాల్‌ ప్రేమికుల్ని ఉర్రూతలూగిస్తూ సాగిన ఫైనల్లో ఫ్రాన్స్‌ 4-2 తేడాతో క్రొయేషియాను ఓడించింది.

3. విభజన చట్టంలోని అంశాలు, ప్రత్యేక హోదా సహా రాష్ట్రానికి ఇచ్చిన హామీల్ని అమలు చేయకుండా కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు చేస్తున్న అన్యాయానికి నిరసనగా.. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో అవిశ్వాస తీర్మానం పెట్టాలని తెదేపా పార్లమెంటరీ పార్టీ నిర్ణయించిందని, దీనికి మద్దతివ్వాలని భాజపాయేతర, కాంగ్రెసేతర పార్టీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. పార్లమెంటులో తాము చేస్తున్న పోరాటానికి మద్దతు కూడగట్టేందుకు తెదేపా ఎంపీలు ఆయా పార్టీల నాయకుల్ని కలసి ముఖ్యమంత్రి లేఖను అందజేస్తున్నారు.

4. లాస్‌వెగాస్‌లో అట్టహాసంగా నిర్వహించిన ‘ప్రపంచ పోకర్‌ సిరీస్‌’ విజేతగా ఇండియానాకు చెందిన జాన్‌ సిన్‌(33) ఆవిర్భవించాడు. ఫ్లోరిడాకు చెందిన టోనీ మైల్స్‌(32)తో నువ్వా-నేనా అనే రీతిలో శనివారంరాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు నిర్విరామంగా సాగిన జూదంలో రూ.60 కోట్లు కైవసం చేసుకున్నాడు. ఓడిపోయిన టోనీ రూ.34 కోట్లతో సరిపెట్టుకున్నాడు. మూడోస్థానంలో నిలిచిన మైకేల్‌ డయర్‌ ఆట మొదలైన మొదటి అరగంటలోనే రూ.25 కోట్లతో నిష్క్రమించాడు. ఈ ప్రపంచ సిరీస్‌లో చేతులు కాల్చుకోవడానికి 7874 మంది రూ.6,85,000 చొప్పున సభ్యత్వరుసుముగా మొత్తం రూ.539 కోట్లు చెల్లించడం గమనార్హం.

5. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ టిక్కెట్‌పై సికింద్రాబాద్‌ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్టు ప్రముఖ క్రికెట్‌ క్రీడాకారుడు అజహరుద్దీన్‌ వెల్లడించారు. 2009లో ఉత్తర్‌ప్రదేశ్‌లోని మొరాదాబాద్‌ నుంచి లోక్‌సభకు ఆయన ఎన్నికయ్యారు. 2014లో రాజస్థాన్‌లోని టోంక్‌-సవాయ్‌ మాధోపూర్‌ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఓ వార్తా సంస్థతో ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తాను సొంత రాష్ట్రం నుంచి పోటీ చేస్తే బాగుంటుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారని అన్నారు.

6. సేలం- చెన్నై మధ్య కేంద్రం చేపట్టనున్న హరిత రహదారి దేశాభివృద్ధికి అవసరమని ప్రముఖ సినీ నటుడు రజనీకాంత్‌ అన్నారు. చెన్నై పోయెస్‌గార్డెన్‌లోని తన నివాసంలో ఆయన మాట్లాడుతూ… కామరాజర్‌ వంటి ఉత్తమ రాజకీయ నేతలు ఆవిర్భవించాలనే ఆకాంక్ష తమిళనాడు ప్రజలతోపాటు తనకూ ఉందన్నారు. తమిళనాడులోని విద్యాభివృద్ధిని ఇతర రాష్ట్రాలతో పోల్చి చూడాలని, ఇక్కడ విద్యాభివృద్ధి అవసరం ఇంకా ఉందని తెలిపారు. జమిలి ఎన్నికలు నిర్వహిస్తే మంచిదేనన్నారు. దీనివల్ల డబ్బు, సమయం ఆదా అవుతాయని తెలిపారు.

7. ఆంధ్రప్రదేశ్‌ ఆర్టీసీ కార్మికులకు యాజమాన్యం 19% మధ్యంతర భృతి (ఐఆర్‌) ప్రకటించింది. ఆగస్టు 1న అందుకోబోయే జులై నెల వేతనం నుంచి ఇది అమల్లోకి వస్తుంది. దీంతో సంస్థకు ఏడాదికి రూ.250 కోట్ల మేర అదనపు వ్యయం కానుంది. మొత్తం 54,500 మంది కార్మికులకు ప్రయోజనం చేకూరనుంది. రవాణాశాఖ మంత్రి అచ్చెన్నాయుడు వీడియో సందేశంలో, సంస్థ ఛైర్మన్‌ వర్ల రామయ్య విజయవాడ ఆర్టీసీ హౌస్‌లో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. మరింత సమాచారం కోసం..

8. అవినీతి అభియోగాలపై అరెస్టై కారాగారంలో ఉన్న పాకిస్థాన్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌, ఆయన కుటుంబీకులు ఆ శిక్షపై న్యాయస్థానంలో సవాల్‌ చేయనున్నారు. అడియాలా కారాగారంలో ఉన్న షరీఫ్‌ను న్యాయవాదులు కలిసి కొన్ని పత్రాలపై సంతకాలు తీసుకున్నారని ‘డాన్‌’ దినపత్రిక తెలిపింది.

9. రెండో పర్యాయం కూడా అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని డొనాల్డ్‌ ట్రంప్‌ భావిస్తున్నారు. 2020 ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని ఆయన స్పష్టం చేశారు. బ్రిటన్‌ పర్యటనలో ఉన్న ఆయన మెయిల్‌ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం చెప్పారు. ‘ఔను, నేను పోటీ చేయాలనే అనుకుంటున్నాను. అందరూ నన్నే కోరుకుంటున్నట్టు కనిపిస్తోంది’ అన్నారు. మరింత సమాచారం కోసం..

10. కాంగ్రెస్‌..ముస్లిం పురుషుల పార్టీ అని ప్రధాని మోదీ అభివర్ణించడాన్ని ఆ పార్టీ సీనియర్‌ అధికార ప్రతినిధి ఆనంద్‌ శర్మ తప్పుపట్టారు. ఇది మోదీ రోగగ్రస్థ మనస్థత్వం, వక్రీకరించే బుద్ధికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ ఇలాంటి వ్యాఖ్యలతో మోదీ ప్రధాని పదవి గౌరవానికి భంగం కలిగిస్తున్నారన్నారు. దేశ స్వాతంత్య్రోద్యమాన్ని నడిపిన పార్టీపై ఇలాంటి విమర్శలు చేయడం ప్రధాని హోదాకు తగదని చెప్పారు. సమాజాన్ని విడదీయడానికి ఆయన ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.