టాప్‌ 10 న్యూస్‌

1. గుజరాత్ లోని పంచమహల్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. 10 మందితో కిక్కిరిసి ప్రయాణిస్తున్న ఓ కారు అదుపుతప్పి కాల్వలో బోల్తాపడింది. ఈ ఘటనలో ఏడుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

2. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ రెండు రోజుల పర్యటన నిమిత్తం హైదరాబాద్‌ రానున్నారు. ఈరోజు, రేపు కాంగ్రెస్‌ పార్టీకి చెందిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడి హోదాలో తొలిసారి రాష్ట్రానికి వస్తున్న రాహుల్‌గాంధీకి ఘన స్వాగతం పలికేందుకు కాంగ్రెస్‌ శ్రేణులు ఏర్పాటు చేసుకున్నాయి. గతేడాది జూన్‌లో ప్రజాగర్జనలో పాల్గొన్న తర్వాత ఇప్పుడే నగరానికి వస్తున్నారు. రానున్న ఎన్నికలే లక్ష్యంగా హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్ల్లాలో రాహుల్‌ కార్యక్రమాలను రూపొందించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ బస్సు యాత్ర కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే రాహుల్‌ పర్యటన ఖరారైంది.

3. వచ్చే ఎన్నికలకు పార్టీని సన్నద్ధం చేసే లక్ష్యంతో సోమవారం తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్రకార్యవర్గ సమావేశాన్ని అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం మూడు గంటలకు తెలంగాణభవన్‌లో జరిగే ఈ సమావేశంలో పార్టీ శ్రేణులను సీఎం సమాయత్తం చేయనున్నారు. పార్టీ నిర్వహించిన సర్వే ఫలితాల ఆధారంగా ప్రజాప్రతినిధులను అప్రమత్తం చేయడంతో పాటు పార్టీ ప్రతిష్ఠాత్మక కార్యక్రమాల నిర్వహణ, విస్తృత స్థాయి ప్రచారం లక్ష్యంగా ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ముందస్తు అయినా, గడువు మేరకు అయినా ఎన్నికలెప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని ఇప్పటికే సీఎం పార్టీ నేతలను ఆదేశించారు.

4. ‘మనలో ఎవరికైనా ఏదైనా నొప్పి వస్తే, ఆ నొప్పి నివారణకు ఔషధం వాడతాం. అదే సమాజంలో ఉండే నొప్పి, బాధ పోవాలంటే సత్యసాయి బోధించిన సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస అనే పంచ సూత్రాలే ఔషధాలు’ అని ఉమ్మడి తెలుగు రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టీబీ రాధాకృష్ణన్‌ పేర్కొన్నారు. న్యాయమూర్తి సత్యాన్ని మాట్లాడటమే కాదు… దానిని ఆచరిస్తే దేశం, సమాజం బాగుపడుతుందని అన్నారు. పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో జరుగుతున్న జాతీయ న్యాయసదస్సులో భాగంగా ఆదివారం జరిగిన చర్చా కార్యక్రమంలో జస్టిస్‌ రాధాకృష్ణన్‌ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

5. శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ వైదిక కార్యక్రమాలు ఆదివారం శాస్త్రోక్తంగా ఆరంభమయ్యాయి. ఉదయం 6 గంటలకు శ్రీవారి సన్నిధిలోని యాగశాలలో రుత్వికులు హోమగుండాన్ని వెలిగించి పుణ్యాహవచనం, పంచగవ్యారాధన, వాస్తుహోమం, రక్షాబంధనం చేపట్టారు. అంతకుముందు రుత్వికులు అర్చక భవనం నుంచి పసుపు వస్త్రాలు ధరించి ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. మరో 150 మంది వేద పండితులు కూడా మరో బృందంగా ఆలయ మర్యాదలతో వేంచేశారు. రాత్రి 7 నుంచి 9 గంటల మధ్య కళాకర్షణ కార్యక్రమంలో భాగంగా గర్భాలయంలోని శ్రీవారి మూలవర్లతో పాటు ఉప ఆలయాల్లోని దేవతామూర్తుల శక్తిని కుంభాల(కలశాల)లోకి ఆవాహన చేశారు.

6. గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ భారతీయ జనతా పార్టీ(భాజపా)కి రాజీనామా చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌కు ఈ మేరకు లేఖను పంపించారు. తాను చేసే పోరాటం కారణంగా పార్టీ బద్నాం కావొద్దనే ఉద్దేశంతోనే భాజపాకు రాజీనామా చేస్తూ నాలుగురోజుల క్రితం లేఖ పంపానని రాజాసింగ్‌ వెల్లడించారు. రాజీనామా విషయాన్ని రాజాసింగ్‌ ఆదివారం హైదరాబాద్‌లో విలేకరుల సమావేశంలో వెల్లడించారు. తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో గోవధ పెరిగిపోయిందని.. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ప్రభుత్వం హిందువుల మనోభావాల్ని దెబ్బతీస్తోందని ఆరోపించారు. గోరక్షణ కోసం దేనికైనా సిద్ధమని, ప్రభుత్వం స్పందించకపోతే సోమవారం నుంచి ఆవుల తరలింపును అడ్డుకుంటామని.. ఏదైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని రాజాసింగ్‌ హెచ్చరించారు.

7. జలప్రళయంతో విలవిలలాడుతున్న కేరళకు రూ.100 కోట్ల తక్షణ సాయాన్ని కేంద్రప్రభుత్వం ఆదివారం ప్రకటించింది. కేరళలో వరద పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉందని.. స్వాతంత్య్రానంతరం ఈ రాష్ట్రంలో అసలు ఇంతటి భారీ వర్షాలు ఇంతవరకూ ఎన్నడూ కురిసిన దాఖలాలు లేవని కేంద్రహోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ పేర్కొన్నారు. కేరళలో వరద బీభత్సంతో అతలాకుతలమైన ప్రాంతాలను రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆదివారం హెలికాప్టర్‌ నుంచి పరిశీలించారు.

8. వలసవాదం, రాజకీయాలు, మతచాందసవాదాలపై ఎలుగెత్తిన ఓ కలం ఆగిపోయింది. సామాన్యుడే కథా వస్తువుగా కదిలి నోబెల్‌ కిరీటాన్ని ధరించిన ప్రఖ్యాత రచయిత వీఎస్‌ నైపాల్‌ (85) కన్నుమూశారు. భారత సంతతికి చెందిన ఆయన శనివారం రాత్రి తుదిశ్వాస విడిచినట్లు ఆయన సతీమణి నదీరా నైపాల్‌ తెలిపారు.

9. పన్నెండేళ్లలోపు బాలికలపై అత్యాచారం చేసే వారికి మరణశిక్ష సహా ఇతర కఠిన శిక్షలు విధించడానికి ఉద్దేశించిన క్రిమినల్‌ లా (సవరణ) చట్టం-2018కు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదం తెలిపారు. ఇది ఈ ఏడాది ఏప్రిల్‌ 21 నుంచే అమల్లోకి వచ్చినట్టుగా గెజిట్‌లో ప్రకటించారు. కశ్మీర్‌లోని కథువాలో ఓ మైనర్‌ బాలిక, యూపీలోని ఉన్నావ్‌లో ఓ మహిళపై అత్యాచారాలు జరిగిన అనంతరం నిందితులకు కఠిన శిక్షలు విధించేలా కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్‌ 21న అత్యవసరాదేశం (ఆర్డినెన్స్‌) జారీ చేసింది. దానికి గత వారమే పార్లమెంటు ఆమోదం తెలిపింది.

10. ‘అందరూ సమష్టిగా ఉండాలని జనసేన పిడికిలి చూపిస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు వేళ్లు చూపిస్తారు.. అంటే ఒకటి తాను బాగుండాలని, రెండోది తన కుమారుడు లోకేష్‌ బాగుండాలని దాని అర్థం. మిగతా వేళ్లు వారి ఎమ్మెల్యేలు, ఎంపీలు, స్నేహితులు, బంధువులు బాగుండాలని తప్ప ప్రజల బాగును ఎప్పుడూ కోరుకో’రని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. ఆదివారం రాత్రి పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ప్రజాపోరాట యాత్ర సభలో ఆయన మాట్లాడారు. ‘వైకాపా అధినేత జగన్‌ రూ.లక్ష కోట్లు దోచారని తెదేపా ఆరోపిస్తుంటే, వైకాపా వాళ్లు చంద్రబాబు రూ.లక్షన్నర కోట్లు దోచారని విమర్మిస్తున్నారు తప్ప ఏమీ దోచుకోలేదని ఎవరూ చెప్పడం లే’దని ఎద్దేవా చేశారు.