టాప్‌-10 న్యూస్‌ @ 5PM

1. పాకిస్థాన్‌ ప్రధానమంత్రిగా ఆగస్టు 11న ప్రమాణస్వీకారం చేస్తానని పాకిస్థాన్‌ తెహ్రీకే ఇన్సాఫ్‌(పీటీఐ) అధినేత ఇమ్రాన్‌ఖాన్‌ వెల్లడించారు. ఈ నెల 25న జరిగిన పాక్‌ జాతీయ ఎన్నికల్లో పీటీఐ 116 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ రాకపోవడంతో ఇమ్రాన్‌ఖాన్‌ ప్రధానిగా బాధ్యతలు చేపట్టడంపై సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలో చిన్న పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు చర్చలు జరుపుతున్నామని.. వచ్చే నెల 11న ప్రధానిగా ప్రమాణస్వీకారం చేస్తానని ఇమ్రాన్‌ఖాన్‌ చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. రైల్వే జోన్ అసాధ్యమని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు నివేదిక ఇచ్చినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఏపీలో రైల్వేజోన్ ఏర్పాటుపై అధికారుల కమిటీ సంప్రదింపులు జరుపుతోందన్న విషయాన్ని.. సుప్రీంకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్లో కేంద్రం స్పష్టంగా చెప్పిందన్నారు. అలాగే ఇటీవల పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం సందర్భంగా జరిగిన చర్చలోనూ హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రైల్వేజోన్ ఇస్తామని చెప్పిన విషయాన్ని కన్నా గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తన వైఫల్యాల్ని కప్పిపుచ్చుకునేందుకు భాజపా, కేంద్రంపై బురద జల్లుతోందని ఆరోపించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. రాజధాని అమరావతిని అడ్డుకునేందుకు వైకాపా – జనసేన కలిసి కుట్రలు చేస్తున్నాయని మంత్రి ప్రత్రిపాటి పుల్లారావు ఆరోపించారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటివరకూ వైకాపా కేసులతో రాజధాని నిర్మాణాన్ని అడ్డుకుంటే.. ఇప్పుడు పవన్‌కల్యాణ్ రైతులను రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై నమ్మకంతో ప్రపంచంలో ఎక్కడా లేని రీతిలో రైతులు వేల ఎకరాలు సమీకరణ కోసం ఇచ్చారని.. ఇప్పుడు ఆ నమ్మకాన్ని చెడగొట్టేందుకు చేసే ప్రయత్నాలు ఫలించవని అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. రాష్ట్రంలో ఐదు కోట్ల ప్రజల ఆశలన్నీ పార్లమెంట్‌పైనే ఉన్నందున… ఎంపీలంతా హక్కుల సాధన కోసం ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు. అన్నివైపుల నుంచి కేంద్రంపై ఒత్తిడి పెంచాలని సూచించారు. కాపు రిజర్వేషన్ల చట్టం కేంద్రం వద్ద 9 నెలలుగా పెండింగ్‌లో ఉన్నందున.. రిజర్వేషన్లను షెడ్యూల్-9లో చేర్చే అంశంపై ఒత్తిడి పెంచాలని దిశానిర్దేశం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కస్టమర్లకు శుభవార్త. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై బ్యాంకు వడ్డీరేటును పెంచింది. డిపాజిట్లపై 5 నుంచి 10 బేసిస్‌ పాయింట్ల వరకు పెంచింది. కొత్త వడ్డీ రేట్లు సోమవారం నుంచే అమలవుతాయి. వివిధ కాలపరిమితులతో సాధారణ, వయో వృద్ధులు చేసే ఫిక్స్‌డ్‌ డిపాజిట్లకు ఇచ్చే వడ్డీ రేట్లలో చేసిన మార్పులను ఎస్‌బీఐ తన వెబ్‌సైట్‌లో ఉంచింది. ఏడాది నుంచి పదేళ్ల కాలపరిమితికి రూ. కోటి కంటే తక్కువ చేసిన డిపాజిట్లపై వడ్డీని 5 నుంచి 10 బేసిస్‌ పాయింట్ల మధ్య పెంచింది. అంటే 0.05శాతం నుంచి 0.1శాతం పెరుగుతుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. జాతీయ పౌర రిజిస్టార్‌ విడుదల చేసిన ముసాయిదాపై పశ్చిమ్‌బంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. అసోంలోని భారత పౌరులకు సంబంధించి జాతీయ పౌర రిజిస్టార్‌ ముసాయిదాను రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు విడుదల చేసిన సంగతి తెలిసిందే. అసోంలో మొత్తం 3.29 కోట్ల మంది ఉండగా, 2.89కోట్ల మందిని ఈ ముసాయిదాలో చేర్చారు. ఇంకా దాదాపు 40లక్షల మంది పేర్లు ఈ జాబితాలో లేవు. దీంతో మమతా బెనర్జీ కేంద్రంపై విమర్శలు చేశారు. భారత పౌరులు సొంత దేశంలోనే శరణార్థులుగా మారారని ధ్వజమెత్తారు. కేంద్రం ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. దేశీయ మార్కెట్లు రికార్డుల జడివానలో తడిసి ముద్దవుతున్నాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ద్రవ్య పరపతి సమీక్షకు ముందు లాభాల్లో దూసుకెళ్లిన సూచీలు.. వరుసగా ఆరో రోజు కొత్త రికార్డులను నమోదు చేశాయి. అంతర్జాతీయ సానుకూల పరిణామాలు, కొనుగోళ్లు వెల్లువెత్తడంతో సూచీలు సోమవారం లాభాల్లో పరుగులు తీశాయి. సెన్సెక్స్‌ 157 పాయింట్లు ఎగబాకి 37,494 వద్ద సరికొత్త జీవనకాల గరిష్ఠస్థాయిలో స్థిరపడింది. అటు నిఫ్టీ కూడా 41 పాయింట్ల లాభంతో 11,319 వద్ద ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 68.65గా కొనసాగుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమగ్ర కుటుంబ సర్వే ఫలితాలు ఉండగా ఇప్పుడు బీసీ గణన ఎందుకుని ప్రశ్నించారు. అధికారులకు పదవీ కాలాన్ని పొడిగిస్తున్న కేసీఆర్‌.. సర్పంచులకు ఇంఛార్జి ఎందుకివ్వడం లేదని ప్రశ్నించారు. ప్రత్యేకాధికారులపై సర్పంచులు తిరగబడాలని, వారికి కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందన్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఓటమి తప్పదన్న ఆందోళనతోనే ప్రభుత్వం ఎన్నికలను వాయిదా వేస్తోందని ఆరోపించారు. సర్పంచులను కేసీఆర్‌ ప్రభుత్వం అవమానిస్తోందని ఆక్షేపించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. జమ్ముకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ మరోసారి భాజపాపై విమర్శలు గుప్పించారు. భాజపాతో పొత్తు పెట్టుకోవడమనేది విషం తాగడంతో సమానమని ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘వాజ్‌పేయీ హయాంలో భాజపాతో మంచి సంబంధాలు ఉన్నాయి. అందుకే మళ్లీ ఆ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు అంగీకరించాం. కానీ ఇప్పుడు ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడమనేది చాలా కష్టమైన నిర్ణయం. ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడమనేది విషం తాగడతంతో సమానం. నేను రెండు సంవత్సరాల రెండు నెలల పాటు ఆ బాధను భరించాను’ అని ముఫ్తీ అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. చరిత్రలో ఎవరూ ఊహించనంతగా తెలంగాణ రాష్ట్రప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిందని, ప్రజా సంక్షేమానికే ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. సిరిసిల్ల జిల్లా పర్యటనలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 12, 751 గ్రామపంచాయతీల్లో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. ‘‘వృద్ధులు, బీడీ కార్మికులు, ఒంటరి, వితంతువులు, గీతన్నకు, నేతన్నకు, బోధకాలు బాధితులకు పింఛన్లు ఇస్తున్నాం. గత ప్రభుత్వ హయాంలో 29 లక్షల మందికి పింఛన్లు ఇచ్చారు. ప్రస్తుతం 42 లక్షల మందికి అందిస్తున్నాం. షాదీముబారక్‌, కల్యాణ లక్ష్మి ద్వారా ప్రతి పేదింటి ఆడబిడ్డకు ఆర్థిక సాయం చేస్తున్నాం. పుట్టిన ప్రతిబిడ్డకు కేసీఆర్‌ కిట్టు ద్వారా సాయం అందిస్తున్నాం. ఆడబిడ్డ పుడితే రూ.13వేలు ఇస్తున్నాం’’ అని అన్నారు. రాష్ట్రంలో ప్రతి పేదవాడి కడుపునిండాలనే ఉద్దేశంతోనే సన్న బియ్యం అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు.