జైలులో కూర్చొని వచ్చి నీతులా?: పవన్‌ కల్యాణ్‌

నేను 25 ఏళ్లు కష్టపడి పైకొచ్చి రూ.25 కోట్ల పన్ను కట్టా
జగన్‌ రెండు మూడేళ్లలోనే రూ.300 కోట్ల పన్ను ఎలా కట్టగలిగారో!
వైకాపా గూండాలను ఎదుర్కొనే ధైర్యం జనసైనికులకు ఉంది
ప్రజాధనంతో సీఎం విలాసాలు
పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలు
వేల కోట్లు దోచేసి జైలులో కూర్చొని వచ్చిన వాళ్లు కూడా నీతులు చెబుతున్నారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. తాను 25 ఏళ్లు కష్టపడి ఒక స్థాయికి వచ్చి రూ.25 కోట్ల పన్ను కడితే వైకాపా అధినేత జగన్‌ మాత్రం రెండు మూడేళ్లలో రూ.300 కోట్ల పన్ను ఎలా కట్టగలిగారో అర్థం కావడం లేదన్నారు. పైరవీకారులు, దోపిడీదారులు అధికారంలో కూర్చొంటే సామాన్యుడికి న్యాయం జరగదని, బడుగు బలహీన వర్గాల ఆకాంక్షలను నెరవేర్చేందుకు మూడో ప్రత్యామ్నాయం అవసరమని, అందుకే జనసేన పార్టీ పెట్టానని పేర్కొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో పవన్‌ బుధవారం కార్యకర్తలతో, ఆక్వా ట్రేడర్లతో సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రతిపక్ష నేత జగన్‌లపై తీవ్ర ఆరోపణలు చేశారు.

నోటికొచ్చినట్లు మాట్లాడితే ఉప్పెనలా దాడి చేస్తాం:

వైకాపాలాంటి ఫ్యాక్షన్‌ పార్టీలను ఎదుర్కోడానికి కత్తులు, బాంబులు లేకపోవచ్చని కానీ ఆ పార్టీ గూండాలను ఎదుర్కొనే దమ్ము, ధైర్యం జనసైనికులకు ఉందని పవన్‌ అన్నారు. గూండాలు, ఫ్యాక్టనిస్టులు నోటికొచ్చినట్లు మాట్లాడితే ఉప్పెనలా దాడి చేస్తామని, అలాంటి పోరాటమే కావాలనుకుంటే తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ‘‘నేను విలువలతో కూడిన రాజకీయం చేయడానికి వచ్చా. ఎలాంటి భాష ఉపయోగించాలో తెలిసినవాడిని. నేను వ్యక్తిగతంగా మాట్లాడడం మొదలు పెడితే ఫ్యాక్షనిస్టు నాయకులు ఊహించలేరు. తట్టుకోలేరు. పారిపోతారు. అయితే అలాంటి మాటలతో సమస్యలు పరిష్కారం కావు. ఇసుక మాఫియా, కుంభకోణాలు, దోపిడీలు చేసే వీళ్లకే పిచ్చిపిచ్చిగా మాట్లాడే తెగింపు ఉంటే ప్రజాసంక్షేమం కోసం నిలబడే నాకు ఎంత తెగింపు ఉండాలి? చూడ్డానికే పవన్‌ కల్యాణ్‌ మెత్తగా కనిపిస్తాడు. తేడా వస్తే తోలు తీస్తాడు. సమాజంలో మార్పు తీసుకొస్తాననే భయంతోనే తెలుగుదేశం, వైకాపా, భాజపా నేతలు అందరూ నన్ను తిడుతున్నారు. పవన్‌ ఒంటిస్తంభం మేడమీద కూర్చొనే వ్యక్తి కాదు. నేలమీద నడిచే వ్యక్తి అని గుర్తుంచుకోవాలి’’ అని అన్నారు.

చంద్రబాబు వ్యాఖ్యలు బాధించాయి:

పవన్‌ కల్యాణ్‌ కులాన్ని నమ్ముకున్న నాయకుడని చంద్రబాబు అనడం బాధ కల్గించిందని పవన్‌ అన్నారు. నిజంగా తాను కులాన్నే నమ్ముకుంటే 2014లో తెదేపాకు ఎందుకు మద్దతు పలుకుతానని ప్రశ్నించారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఎవరివల్ల తెదేపాకు 15 అసెంబ్లీ స్థానాలు వచ్చాయో తెలిసి కూడా ఆయన ఆ మాటలు అనడం బాధేసిందన్నారు. ఆ జిల్లాను తెదేపా నిర్లక్ష్యం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఖజానాకు ధర్మకర్తగా ఉండాల్సిన ముఖ్యమంత్రి విలాసాల కోసం కోట్ల రూపాయలు తగలేస్తున్నారని మండిపడ్డారు. అంతకుముందు నవయుగ జనసేన పేరుతో సేవాకార్యక్రమాలు చేస్తున్న జనసైనికులతో సమావేశమయ్యారు. ప్రతిమండలానికి 15 నుంచి 20 మంది యువతతో కమిటీ వేస్తామని గ్రామగ్రామానికి తిరిగి ప్రజల బాధలు తెలుసుకోవాలని సూచించారు.

జగన్‌ అపరిపక్వ నేత: జనసేన
జగన్‌ అపరిపక్వ రాజకీయ నేతని జనసేన నేతలు విమర్శించారు. ఆయనకు అసహనం తగ్గాలని, ఆయన నోట మంచి మాటలు రావాలని దేవుణ్ని ప్రార్థిద్దామంటూ.. ఆపార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ కన్వీనర్‌ మాదాసు గంగాధరం, మరో నాయకుడు ముత్తంశెట్టి కృష్ణారావులు అన్నారు. బుధవారం విజయవాడలో వీరు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ చట్టబద్ధంగా విడాకులు తీసుకునే వివాహం చేసుకున్నారని చెప్పారు. ఆయన వ్యక్తిగత విషయాలపై జగన్‌ విమర్శలకు దిగడం సరికాదన్నారు. అసెంబ్లీలో ఉండి పోరాడకుండా జగన్‌ పారిపోయారని పవన్‌చేసిన విమర్శలో తప్పేముందని అన్నారు.

పవన్‌పై వ్యక్తిగత విమర్శలు సరికాదు: సోమిరెడ్డి
జనసేన అధ్యక్షుడిగా పవన్‌పై ఎన్నయినా మాట్లాడవచ్చని, వ్యక్తిగత విమర్శలు మాత్రం సరికాదని.. వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. పార్లమెంటులో పోరాడలేకపోవడం, మంగళవారం నాటి బంద్‌ విఫలం నేపథ్యంలో నిరాశకు లోనైన జగన్మోహన్‌రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు.

క్షమాపణ చెప్పకపోతే తీవ్ర పరిణామాలు: కాపునాడు
పవన్‌కల్యాణ్‌కు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేకే జగన్‌ వ్యక్తిగత విమర్శలకు దిగారని రాష్ట్ర కాపునాడు అధ్యక్షులు ఈశ్వరరావు అన్నారు. పవన్‌పై జగన్‌ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని కాపు సమాజం తీవ్రంగా పరిగణిస్తోందన్నారు. జగన్‌ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని క్షమాపణ చెప్పకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని బుధవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు.