jc brothers master, plan after, 2019 elections, ఓపెన్ థియేటర్ నిర్మాణం, సైక్లింగ్ ట్రాక్, వాకింగ్ ట్రాక్, సీనియర్ సిటిజన్ల

జేసీ సోద‌రుల వ్యూహం అదేనా… 2019లో గెలిచాక‌…!

అనంత‌పురం జిల్లాలో జేసీ సోద‌రుల వ‌ల్లే అత్య‌ధిక స్థానాలు టీడీపీకి ద‌క్కాయ‌నే భావ‌న పార్టీ వ‌ర్గాల్లో బ‌లంగా ఉంది. జిల్లాలో కీల‌క నేత‌లుగా వారు ముద్ర వేసుకున్నారు. అలాంటి నేత‌లు త‌మ మ‌న‌సులో మాట‌ బ‌య‌ట‌పెట్టారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాము పోటీ చేయ‌మ‌ని తాడిప‌త్రికి చెందిన జేసీ సోద‌రులు చెబుతూ వ‌స్తున్నారు.. అప్పుడ‌ప్ప‌డు వారు ఇలా అంటున్నా మ‌రోసారి వారు ఇదే విష‌యాన్ని ప్ర‌స్తావించ‌డం విశేషం. అయితే త‌మ వారసులు ఎన్నికల్లో పోటీచేస్తారనీ, వారికి మద్దతు ఇవ్వాలనీ కోరుతున్నారు.

వీరి వాధ‌న ఇలా ఉన్న‌ప్ప‌టికి జిల్లా టీడీపీ పెద్ద‌ల మాట వేరేలా ఉంది. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు పోటీ చేయాల‌ని ఆదేశిస్తే త‌ప్పకుండా రంగంలోకి దిగాల్సిన అవ‌స‌రం ఉంటుంద‌ని వారు అంటున్నారు. ఒక‌వేళ సీఎం చంద్ర‌బాబు పోటీ చేయాల‌ని ఆదేశిస్తే బ‌రిలోకి దిగుతామ‌ని జేసీ సోద‌రులు అంటున్నారు. అయితే వారు ఇక్క‌డే తిర‌కాసు పెట్టేలా ఉన్నారు. అదేంటంటే 2019లో ప్ర‌భుత్వం ఏర్పాట‌య్యాక రాజీనామా చేసి త‌మ వార‌సుల‌కు అవ‌కాశం క‌ల్పిస్తామ‌ని అంటున్నారు. వ‌యోభారం కార‌ణంగా జేసీ సోద‌రులు ఎన్నిక‌ల‌పై ఆస‌క్తి చూప‌డం లేద‌ని వారు అనుచ‌ర వ‌ర్గం చెబుతోంది.

ఇప్పటికే జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి అనారోగ్య స‌మస్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. అందుకే తాము వెనుక ఉండి వార‌సుల‌కు ప‌ట్టం కడ‌తామ‌ని అంటున్న‌ట్లు తెలుస్తోంది. అయితే వచ్చే ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి ఎంతో కీలకమైనవి, రాజధాని నిర్మాణం, ఇతర అభివృద్ధి పనుల విషయంలో చంద్రబాబు తన విజన్‌ని సాకారం చేసుకునే క్రమంలో కొత్త ప్రయోగాలకు ఆస్కారం ఇవ్వకపోవచ్చున్న అభిప్రాయం పార్టీ వర్గాలలో వ్యక్తమవుతోంది. ఎంపీ దివాకర్‌రెడ్డి వంటి సీనియర్‌ను పక్కనపెట్టి ఆయన కుమారుడు జేసీ పవన్‌కు అవకాశం కల్పిస్తే ఆశించిన ఫలితం రాకపోతే పరిస్థితి ఇబ్బందికరంగా మారుతుందని కొందరు టీడీపీ నేతలు అంటున్నారు.

తాడిపత్రి ఎమ్మెల్యే అభ్యర్థిగా జేసీ అస్మిత్‌కి అవకాశం ఇవ్వాలన్న అంశంపై కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జేసీ ప్రభాకర్‌రెడ్డికి ఉన్న చరిష్మాతో పోలిస్తే అస్మిత్ స్థాయి ఎలా ఉంటుందో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి తాడిపత్రిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. తద్వారా ప్రజల ఆదరణ మరింత పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నారు. తాడిపత్రిలో పెన్నా నదీతీరంలో 33 ఎకరాల్లో అధునాతన పార్క్ ఏర్పాటుచేయడానికి సన్నాహాలు మొదలుపెట్టారు. ఇందులో మూడు కోట్ల రూపాయల వ్యయంతో ఓపెన్ థియేటర్ నిర్మాణం, సైక్లింగ్ ట్రాక్, వాకింగ్ ట్రాక్, సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు వంటి అనేక పనులకు శ్రీకారం చుట్టారు.

ప్ర‌స్తుతం జరుగుతున్న ఈ ప‌రిణామాల నేప‌ధ్యంలో 2019 ఎన్నిక‌ల్లో ఎలాంటి మార్పులు ఉంటాయో… మరి జేసీ సోదరులు చెబుతున్నట్టుగా వచ్చే ఎన్నికల్లో వారు నిజంగానే పోటీచేయరా? వారి వారసులను తప్పకుండా రంగంలోకి దించుతారా? ఈ వ్యవహారంలో టీడీపీ పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? అన్న అంశాలు మాత్రం అర్దం కావ‌డం లేదు. ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో ఇప్ప‌టికే టీడీపీ నాయ‌కులు అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌ర్య‌టిస్తు ప్ర‌చారం చేస్తున్నారు. ఏది ఏమైన‌ప్ప‌టికి చేసీ సోద‌రులు పోటీ చేస్తారో లేదో మ‌రికొన్ని రోజుల్లో తేల‌నుంది.
Tags: jc brothers master, plan after, 2019 elections, ఓపెన్ థియేటర్ నిర్మాణం, సైక్లింగ్ ట్రాక్, వాకింగ్ ట్రాక్, సీనియర్ సిటిజన్ల