జయరాం హత్యకేసులో ముగ్గురు ఖాకీలపై వేటు

  • ముగ్గురు అధికారుల్ని సస్పెండ్ చేస్తూ డీజీపీ నిర్ణయం
  • సస్పెండైనవారిలో ఏసీపీ మల్లారెడ్డి.. ఇద్దరు సీఐలు
  • ముగ్గురు అధికారులకు రాకేష్‌రెడ్డితో లావాదేవీలు
తెలుగు రాష్ట్రాల్లో సంచలనంరేపిన కోస్టల్ బ్యాంకు అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త జయరాం హత్యకేసులో ముగ్గురు ఖాకీలపై వేటు పడింది. ఈ హత్య కేసుతో సంబంధం ఉన్న ముగ్గురు అధికారుల్ని సస్పెండ్ చేస్తూ డీజీపీ మహేందర్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఏసీపీ మల్లారెడ్డి, సీఐలు శ్రీనివాస్, రాంబాబులను సస్పెండ్ చేస్తూ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు.
జనవరి 31న రాత్రి కృష్ణాజిల్లా నందిగామ సమీపంలో కారులో జయరామ్ మృతిచెందినట్లు పోలీసులు గుర్తించారు. ముందు ఆత్మహత్యగా భావించినా.. తర్వాత విచారణలో హత్యగా తేలింది. ఈ కేసులో జయరాం మేనకోడలు  శిఖా చౌదరి  ప్రియుడు రాకేష్‌రెడ్డి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. దర్యాప్తులో రాకేష్‌రెడ్డి కీలక విషయాలను వెల్లడించాడు. ముగ్గురు పోలీసులతో సంబంధాలు ఉన్నట్లు తేలింది. ఈ ముగ్గురు పోలీసు అధికారులు జయరాం హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలని రాకేష్ రెడ్డికి సలహా ఇచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన పోలీస్ బాస్‌లు.. ఆరోపణలపై పూర్తి ఆధారాలు లభ్యమయ్యాయట. ఈ ముగ్గురికి రాకేష్‌రెడ్డితో ఆర్థిక లావాదేవీలు ఉన్నట్లు తెలుస్తోంది. రాకేష్‌తో కలిసి భూదందాలు కూడా చేసినట్లు తేలిందట. దీంతో ముగ్గుర్ని సస్పెండ్ చేశారు.