జగన్ పదేపదే అలా అంటుంటే తట్టుకోలేకపోయా: వంగవీటి రాధ

తనకు విజయవాడలో పార్టీలకు అతీతంగా అభిమానులు ఉన్నారని, తానేదైనా పిలుపునిస్తే, తెలుగుదేశం, జనసేన, కాంగ్రెస్, వైసీపీ వాళ్లంతా వస్తారని వంగవీటి రాధా వ్యాఖ్యానించారు. కొందరు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి, వంగవీటి రంగా విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ, తనను ఆహ్వానించిన వేళ, ఆ కార్యక్రమానికి హాజరైతే, వైకాపా అధినేత జగన్ నుంచి తీరని అవమానం ఎదురైందని చెప్పారు.

తనను పిలిపించిన ఆయన ఎవరిని అడిగి వెళ్లావని ప్రశ్నించారని, వైసీపీ నియోజకవర్గ ఇన్ చార్జ్ కి ఎందుకు సమాచారం ఇవ్వలేదని అడిగారని, తండ్రిలేని వాడివని జాలిని చూపిస్తూ, పార్టీలో ఉండనిస్తున్నానని, ఇది తన పార్టీ అని చెప్పారని ఆరోపించారు. ఇలా జరగడం ఒకసారి కాదని, పదే పదే తనపై జాలిని చూపిస్తున్నానని ఆయన అంటుంటే ఎలా తట్టుకోగలనని ప్రశ్నించారు.

వైసీపీ జగన్ పార్టీయేనన్న విషయాన్ని తాను కూడా అంగీకరిస్తున్నానని, ఆయన ఒక్కరే పార్టీని ఏలుకోవచ్చని విమర్శలు చేశారు. వైసీపీలో తనకు జరిగిన అన్యాయం మరెవరికీ జరగకూడదని తాను కోరుకుంటున్నానని చెప్పారు. తన తండ్రి విగ్రహావిష్కరణకు వెళ్లాలంటే, తాను ఎవరి అనుమతీ తీసుకోనక్కర్లేదని, అలా తీసుకోవాల్సి వస్తే, అసలు ఆ పార్టీయే తనకు అవసరం లేదని రాధా అన్నారు.