cm jagan,assembly,council,sharif

జగన్ తుగ్లక్‌ పాలన:ఆరెస్సెస్ పత్రిక ఆర్గనైజర్‌ సంచలనం:

ఏపీ ప్రజల భవిష్యత్తుతో ముఖ్యమంత్రి జగన్ ఆటలు ఆడుతున్నారని ఆరెస్సెస్ పత్రిక ప్రచురించిన కధనం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తుగ్లక్‌ పాలన సాగిస్తున్నారని రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ అధికార పత్రిక ఆర్గనైజర్‌ లో ప్రచురితమైన వ్యాసం సంచలనం సృష్టిస్తోంది. రాష్ట్ర భవిష్యత్‌ను నాశనం చేసేలా తుగ్లక్‌ నిర్ణయాలు తీసుకుంటున్నారని దుగ్గరాజు శ్రీనివాసరావు అనే రచయిత ఆ వ్యాసంలో ధ్వజమెత్తారు. చంద్రబాబుపై వ్యక్తిగత కక్షతోనే రాజధానిని అమరావతి నుంచి తరలించి మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని నిర్ణయించారని దుయ్యబట్టారు. కేంద్రం తక్షణం జోక్యం చేసుకోవాలని ఆ వ్యాసంలో సూచన చేసారు. అదే సమయంలో బీజేపీ బలోపేతానికదే ఛాన్స్ అంటూ మరో ఆసక్తి కర అంశాన్ని అందులో పేర్కొనటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

 ప్రజల కోణంలో తుగ్లక్ పాలన..

రాజధానులు మార్చడంలో జగన్‌ తుగ్లక్‌లా వ్యవహరించారనే భావన ఏపీ ప్రజల్లో నెలకొని ఉందంటూ ఆ పత్రిక వ్యాసంలో పేర్కొన్నారు. రాజధానిగా అమరావతికి రాష్ట్రపతితో ఆమోద ముద్ర వేయించలేదని… దీనిని సాంకేతిక సాకుగా చూపుతూ.. చంద్రబాబుపై రాజకీయ కక్షతో ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్‌ మూడు రాజధానులను తెరపైకి తెచ్చారని కధనంలో పేర్కొన్నారు. ఈ ప్రయోగం విఫలమవుతుందని రాజకీయ పక్షాలన్నీ స్పష్టం చేస్తున్నా జగన్‌ బుల్‌డోజ్‌ చేసుకుంటూ పోతున్నారని చెప్పుకొచ్చారు. రాజధాని నగర నిర్మాణం కోసం 30 వేల ఎకరాల భూములిచ్చిన రైతులు ఆందోళన చేస్తున్నా పట్టించుకోవడం లేదుని ప్రస్తావించారు. జగన్‌ నిర్ణయం మేరకు శాసనసభలో సీఆర్‌డీఏ రద్దు, పాలనా వికేంద్రీకరణ బిల్లులను ఆమోదించారుని… కానీ శాసనమండలి ఆమోదించకుండా సెలెక్ట్‌ కమిటీకి పంపిందని గుర్తు చేసారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మండలిని రద్దు చేస్తూ శాసనసభలో తీర్మానం చేశారని కధనంలో విశ్లేషించారు.

కక్ష్య సాధింపులో భాగంగానే..

అమరావతిలో మౌలిక వసతుల నిర్మాణానికి రూ.10 వేల కోట్లు ఖర్చయ్యాయని వివరిస్తూ.. మరో రూ.5 వేల కోట్లు ఖర్చుచేస్తే అమరావతికి రాజధాని రూపం వస్తుందని ఓ అంచనా గా పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో జగన్‌ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని… మూడు చోట్లా మౌలిక వసతులకు రూ.3 వేల కోట్లకుపైగా ఖర్చవుతాయని… దీనిని అన్ని వర్గాల ప్రజలూ ప్రశ్నిస్తున్నారని విశ్లేషించారు. ఇప్పటికే రాష్ట్రం రూ.2.56 లక్షల కోట్ల అప్పుల ఊబిలో కూరుకుపోయిన విషయాన్ని కధనంలో ప్రస్తావించారు. ఆరేళ్లుగా రెవెన్యూ లోటులో కొనసాగుతోందని… జగన్‌ ప్రభుత్వం ఆర్థికంగా దినదినగండంగా నెట్టుకొస్తోందని.. ఇలాంటి పరిస్థితుల్లో ఏ సీఎం అయినా ఆదాయ వనరుల పెంపు ప్రధానంగా భావిస్తారని అభిప్రాయం వ్యక్తం చేసారు. ఇలాంటివేమీ చేయకుండా జగన్‌ కక్షసాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నారంటూ విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాల కంటే చంద్రబాబుతో వ్యక్తిగత పోరుకు అధిక ప్రాధాన్యమిస్తున్నారనే అభిప్రాయం కధనంలో వ్యక్తం అయింది. రాజధాని మార్చుతానని ఆయన తన మేనిఫెస్టోలో హామీ ఇవ్వలేదని గుర్తు చేస్తూ,… రాజధాని మార్చుతారన్న వదంతులు వచ్చినప్పుడు.. అమరావతే కొనసాగుతుందని స్పష్టంగా చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. ఇప్పుడు 3 రాజధానుల నిర్ణయం తీసుకుని తమను వంచించారని ప్రజలు భావిస్తున్నారని కధనంలో పేర్కొన్నారు.

 

కేంద్రం జోక్యం..బీజేపీకి అవకాశం..

ఇదే కధనంలో మరో ఆసక్తి కర అంశాన్ని ప్రస్తావించారు. స్థానిక రాజకీయాలను పక్కనపెడితే.. ఈ మొత్తం వ్యవహారంలో కేంద్రం జోక్యం చేసుకోవలసిన తరుణం ఆసన్నమైందనే అభిప్రాయం వ్యక్తం చేసారు. మంచి సలహాలిచ్చి జగన్‌ను దారికి తేవాలనే సూచన కధనంలో కనిపించింది. అంతేకాదు.. ప్రస్తుత పరిస్థితులు రాష్ట్రంలో బీజేపీ బలం పెంచుకోవడానికి అద్భుత అవకాశం కూడా అంటూ ఆరెస్సెస్ పత్రిక బీజేపీ అధినాయకత్వానికి సూచన చేసింది. కొద్ది రోజులుగా జాతీయ దిన పత్రికల్లో జగన్ పాలన పైన ఎడిటోరియల్స్ వ్యతిరేకంగా వస్తున్నాయి. ఇప్పుడు ఏకంగా ఆరెస్సెస్ అధికారిక పత్రికలో ఇటువంటి కధనం రావటం ద్వారా..ఈ అంశం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. మరి..దీని పైన ఇప్పుడు వైసీపీ శ్రేణుల స్పందన ఏంటనేది చూడాల్సి ఉంది.