చైనానా మజాకా.. హీరోయిన్ కు ఏకంగా రూ.945 కోట్ల జరిమానా విధించిన ప్రభుత్వం!

ప్రముఖ చైనీస్ నటి, మోడల్, గాయని ఫ్యాన్ బింగ్ బింగ్(37)కు అక్కడి ప్రభుత్వం షాకిచ్చింది. పన్ను ఎగవేత కేసులో రూ.945 కోట్ల జరిమానా కట్టాల్సిందిగా చైనా ఉన్నతాధికారులు ఆమెను ఆదేశించారు. విచారణలో భాగంగా చైనా అధికారులు ఇప్పటికే బింగ్ బింగ్ అధికార ప్రతినిధిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఎక్స్‌ మ్యాన్‌, ఐరన్‌మ్యాన్‌, యాష్‌ ఈజ్‌ పూరెస్ట్‌ వైట్‌ సహా పలు హాలీవుడ్ సినిమాల్లో బింగ్ బింగ్ మెరిసింది. అయితే కొన్ని సినిమాలకు సంబంధించి బింగ్ భారీగా పన్ను ఎగవేతకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో దాదాపు 129 మిలియన్ డాలర్లు(రూ.945 కోట్లు) కట్టాల్సిందిగా చైనా స్టేట్ అడ్మినిస్ట్రేషన్ ట్యాక్సేషన్ నోటీసులు జారీచేసింది. ఒకవేళ నిర్దేశిత జరిమానాను చెల్లించకుంటే క్రిమినల్ విచారణును ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలని ఆదేశించింది. ఈ నోటీసుపై బింగ్ స్పందించింది.

దేశ చట్టాలకు తాను చాలా గౌరవం ఇస్తానని బింగ్ తెలిపింది. తన ప్రవర్తన, చట్టాల దుర్వినియోగంపై సిగ్గుపడుతున్నానని చెప్పింది. దీనికి దేశంలోని ప్రతి ఒక్కరినీ క్షమాపణ కోరుతున్నానని చైనా మైక్రో బ్లాగింగ్ సైట్ వైబోలో ఓ సందేశాన్ని పోస్ట్ చేసింది. చైనాలో లగ్జరీ ఎండార్స్‌మెంట్లతో, అత్యధిక పారితోషికం అందుకునే బింగ్ జూలై 1 నుంచి సడెన్ గా అదృశ్యమైంది. ప్రాణ రక్షణ కోసం బింగ్ అమెరికా పారిపోయిందనీ, చైనా అధికారులు ఆమెను నిర్బంధించారని పుకార్లు షికార్లు చేశాయి.
Tags: model bingbing,china actress,iron man heroine, Tax Evasion