చెన్నై తాగునీటికి రెండు టీఎంసీలు

చెన్నై తాగునీటికి రెండు టీఎంసీలు

చెన్నై తాగునీటి అవసరాల కోసం కృష్ణాజలాల నుంచి రెండు టీఎంసీలు సరఫరా చేసేందుకు ఆం ధ్రప్రదేశ్ ఎట్టకేలకు అంగీకరించింది. బచావత్ ట్రిబ్యునల్ ప్రకా రం చెన్నై తాగునీటి కోసం కృష్ణా బేసిన్‌లోని రాష్ర్టాలు ఏటా 15 టీఎంసీలు ఇవ్వాల్సి ఉండగా.. నాలుగైదు టీఎంసీలతోనే సరిపెడుతున్నాయంటూ తమిళనాడు ఆవేదన వ్యక్తంచేసింది. ఈ విషయంపై పదేపదే మొరపెట్టుకోవడంతో సమస్య పరిష్కారానికి చొరువచూపిన కేంద్రం.. కృష్ణాబోర్డును పురమాయించింది. ఈ నేపథ్యంలో బుధవారం హైదరాబాద్ జలసౌధలోని కృష్ణాబోర్డు కార్యాలయంలో బోర్డు చైర్మన్ జైన్ అధ్యక్షతన సమావేశం కొనసాగింది. ఈ భేటీకి కర్ణాటక డుమ్మాకొట్టింది. తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర తమ అభిప్రాయాలు తెలిపాయి. చెన్నై తాగునీటి కోసం రా వాటర్ (ముడి నీరు)ను సేకరించే పూండి జలాశయం వద్దకు ఈ ఏడాది 1.76 టీఎంసీలు మాత్రమే వచ్చాయని తమిళనాడు జలవనరులశాఖ ఈఎన్సీ భక్తవత్సలం ఆవేదన వ్యక్తంచేశారు.
బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం తమకు ఏడాదికి 15 టీఎంసీలు రావాలని, అందులో కర్ణాటక, ఉమ్మడి ఏపీ, మహారాష్ట్ర ఐదు టీఎంసీల చొప్పున ఇవ్వాల్సి ఉన్నదని చెప్పారు. ట్రిబ్యునల్ ప్రకారం ఉమ్మడి ఏపీ వాటా ఐదు టీఎంసీలు కాగా.. అందులో తెలంగాణకు సంబంధించి సుమారు 1.67 టీఎంసీల వాటా ఉన్నదని పేర్కొన్నారు. ఇప్పటికే చెన్నై తాగునీటి కింద తమవాటా నుంచి 0.471 టీఎంసీలు మినహాయించారని, మిగిలిన నీటిని కూడా సరఫరాచేసి తమ వాటాలో నుంచి మినహాయించుకోవచ్చని స్పష్టంచేశారు. మహారాష్ట్ర మాత్రం బచావత్ ట్రిబ్యునల్‌లో చెన్నై తాగునీటికి సంబంధించిన పేరా లోపభూయిష్టంగా ఉన్ననదని పేర్కొన్నది. మిగులుజలాలు ఉన్నపుడే ఐదు టీఎంసీలు ఇవ్వాలని బచావత్ ట్రిబ్యునల్‌లో ఉన్నదని, నీటి కొరత (డెఫిసిటీ) సమయంలో ఇవ్వాలని లేదంటూ ఆ రాష్ట్ర చీఫ్ ఇంజినీర్ ముండే తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో నీటిని ఇవ్వలేమంటూ చేతులెత్తేశారు.

మా సీఎం ఇవ్వొద్దన్నారు: ఏపీ ఈఎన్సీ
శ్రీశైలం నుంచి తెలుగుగంగ ద్వారా చెన్నైకి నీటిని సరఫరాచేయాల్సి ఉన్నది. ప్రస్తుత పరిస్థితుల్లో తాము నీళ్లివ్వలేమని ఏపీ తరఫున హాజరైన తెలుగుగంగ ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ మురళీనాథ్‌రెడ్డి తెలిపారు. సీఎం చంద్రబాబు ఎవరికీ నీళ్లియ్యొద్దన్నారని, అసలే సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయని ఆయన వ్యా ఖ్యానించినట్టు సమాచారం. కండలేరులో ప్రస్తుతం సుమారు 7.8 టీఎంసీల నీటినిల్వ ఉన్నప్పటికీ ఇక్కడినుంచి నీటిని వదిలితే.. 150 కిలోమీటర్ల దూరంలోని పూండి (చెన్నై సమీపంలోని రిజర్వాయర్)కి వెళ్లేవరకు మధ్యలో రైతులే తమ పొలాలకు మళ్లించుకుంటారని అభిప్రాయపడ్డారు. నీటిని విడుదల చేయకపోతే చాలా ఇబ్బంది ఉంటుందని తమిళనాడు అధికారులు పేర్కొనడంతో.. బోర్డు చైర్మన్ ఏపీపై ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో మార్చి వరకు రెండు టీఎంసీలను విడుదల చేసేందుకు ఏపీ చీఫ్ ఇంజినీర్ అంగీకరించారు. సమావేశంలో బోర్డు సభ్యకార్యదర్శి పరమేశం తదితరులు పాల్గొన్నారు.