చిన్నప్పటి నుంచే నన్ను హార్మోన్ల సమస్య వెంటాడుతోంది: విద్యాబాలన్

చిన్నప్పటి నుంచే నన్ను హార్మోన్ల సమస్య వెంటాడుతోంది: విద్యాబాలన్

విభిన్నమైన .. బరువైన పాత్రలను పోషిస్తూ విద్యాబాలన్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. ప్రతిష్టాత్మక మహిళా పాత్రల్లో నటించాలంటే ముందుగా ఆమె పేరునే పరిశీలించేంతగా ఆమె తన ప్రభావం చూపుతున్నారు. పాత్రకి నిండుదనాన్ని తీసుకొచ్చే విద్యాబాలన్ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తన బరువుకు సంబంధించిన విషయాలను గురించి ప్రస్తావించారు.

“బాల్యం నుంచే నన్ను హార్మోన్ల సమస్య వెంటాడుతోంది. ఫలితంగా బరువు పెరిగిపోవడం .. తగ్గుతుండటం జరుగుతూ ఉంటుంది. ఈ కారణంగా నేను చాలా ఇబ్బంది పడుతుంటాను. కెరియర్ ఆరంభంలో ‘మీ ఫేస్ చాలా అందంగా ఉంటుంది .. కాస్త ఒళ్లు తగ్గొచ్చుగదా’ అని చాలామంది సలహాలు ఇచ్చేవాళ్లు. కానీ నా సమస్య వాళ్లకి చెప్పడం ఇష్టం ఉండేది కాదు. అందుకే ‘నా బరువు గురించి మాట్లాడటం మీకు సరికాదు’ అని సున్నితంగా చెప్పేదానిని. బరువు తగ్గడానికి నేనెంతగా కష్టపడుతున్నానో నాకే తెలుసు” అని చెప్పుకొచ్చారు.