చిక్కుల్లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.. నిందితులుగా సీఎం, డిప్యూటీ సీఎం!

  • ఐఏఎస్ అధికారి అన్షు ప్రకాశ్‌పై దాడి కేసు
  • సీఎం, డిప్యూటీ సీఎంలను నిందితులుగా చేర్చిన పోలీసులు
  • సీఎం సమక్షంలోనే ఐఏఎస్ అధికారిపై దాడి

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాలు చిక్కుల్లో పడ్డారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో సీఎం నివాసంలో జరిగిన సమావేశంలో తనపై దాడి జరిగిందని ఆరోపిస్తూ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అన్షుప్రకాశ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై దాడి జరిగిన సందర్భంగా కేజ్రీవాల్ మాజీ సలహాదారు వీకే జైన్ కూడా అక్కడే ఉన్నారని అన్షు ప్రకాశ్ పేర్కొన్నారు. ఇప్పుడీ కేసులో సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాల పేర్లను పోలీసులు నిందితులుగా చేర్చారు.

మూడేళ్ల ‘ఆప్’ పాలనపై రూపొందించిన ప్రచార కార్యక్రమాన్ని విడుదల చేయడం ఎందుకు ఆలస్యమవుతోందంటూ సీఎం తనను ప్రశ్నించారని ప్రకాశ్ పేర్కొన్నారు. ఆ వెంటనే ఎమ్మెల్యేలు అరుస్తూ తనపై దాడి చేశారని అధికారి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రచార కార్యక్రమాన్ని వెంటనే విడుదల చేయకుంటే రాత్రంతా ఇక్కడే బంధిస్తామని ఓ ఎమ్మెల్యే బెదిరించారని, అమాతుల్లా ఖాన్‌, ప్రకాశ్‌ జార్వాల్‌లు తనపై దాడి చేశారని అన్షు ప్రకాశ్ ఆరోపించారు. కాగా, ఈ కేసులో ఇప్పటికే అమాతుల్లా ఖాన్, ప్రకాశ్ జార్వాల్‌లను అరెస్ట్ చేసిన పోలీసులు వీకే జైన్‌ను ప్రశ్నించి వదిలిపెట్టారు.