చలో.. సూర్యుడి చెంతకు నింగిలోకి పార్కర్‌ ప్రోబ్‌

సూర్యుడికి ‘‘అత్యంత సమీపం’’లోకి చేరుకునేందుకు ‘‘పార్కర్‌ సోలార్‌ ప్రోబ్‌’’ నింగిలోకి దూసుకెళ్లింది. తొలిసారిగా భానుడి బాహ్య వాతావరణంలో అడుగిడబోతున్న ఈ చరిత్రాత్మక వ్యోమనౌకను అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) ఆదివారం ప్రయోగించింది. అక్కడి గుట్టుమట్లను విప్పేందుకు ఇది ఏడేళ్ల సుదీర్ఘ ప్రయాణం చేయనుంది. సౌర బాహ్యపొర కరోనా, అంతరిక్షంపై అది చూపుతున్న ప్రభావం మీద ప్రధానంగా ఇది దృష్టి కేంద్రీకరించనుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.01 గంటలకు కేప్‌ కెనావెరాల్‌ వైమానిక కేంద్రం నుంచి ఈ ప్రయోగం జరిగింది. భారీ డెల్టా-4 రాకెట్‌ సాయంతో పార్కర్‌ ప్రోబ్‌ నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రయోగం శనివారమే జరగాల్సి ఉంది. అయితే హీలియం అలారం మోగడంతో చివరి నిమిషంలో వాయిదా పడింది.

అంతా సాఫీగానే: ‘‘అద్భుతరీతిలో వ్యోమనౌక స్వతంత్రంగా పనిచేస్తోంది. సూర్యుడిని ‘ముద్దాడేందుకు’ ఇప్పుడే ప్రయాణాన్ని మొదలుపెట్టింది’’అని ప్రయోగమైన రెండు గంటలకు నాసా తెలిపింది. రూ.10,364 కోట్లు (1.5 బిలియన్ల డాలర్లు) వ్యయంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టుకు 91ఏళ్ల ప్రముఖ శాస్త్రవేత్త యూజీన్‌ న్యూమన్‌ పార్కర్‌ పేరు పెట్టారు. సౌర గాలుల ఉనికిని 1958లో తొలిసారిగా గుర్తించింది ఈయనే. జీవిస్తున్న వ్యక్తిపేరు వ్యోమనౌకకు పెట్టడం ఇదే తొలిసారి. కెన్నడీ అంతరిక్ష కేంద్రం నుంచి ఈయన ప్రయోగాన్ని వీక్షించారు. ఆయనకు ఈ ప్రోబ్‌ను అంకితమిస్తూ సిద్ధంచేసిన ఫలకాన్ని గత మేలోనే వ్యోమనౌకలో నిక్షిప్తంచేశారు.‘‘భవిష్యత్తును దర్శిద్దాం పదండి’’అని ఆయన చేసిన వ్యాఖ్యలనూ ఫలకంపై రాశారు. ఈ ప్రోబ్‌లో ఓ మెమరీ కార్డులో 11 లక్షల మంది పేర్లు రాశారు.

అంతరిక్ష పరిణామాలపై మెరుగైన అవగాహన: ‘‘సౌర తుపానులతో ఉపగ్రహాలు దెబ్బతింటాయి. కక్ష్యలోని వ్యోమగాముల ప్రాణాలకూ వీటితో ముప్పు పొంచివుంది. రేడియో కమ్యూనికేషన్‌ వ్యవస్థలు, పవర్‌ గ్రిడ్‌లనూ ఇవి ధ్వంసం చేయగలవు. తాజా ప్రోబ్‌తో ఈ ముప్పులను మెరుగ్గా అంచనా వేసేందుకు వీలుపడుతుంది’’అని నాసా తెలిపింది. ‘‘సూర్యుడి ఉపరితలంలో అడుగుపెట్టబోతున్న తొలి వ్యోమనౌక ఇదే. భూమిపై సంభవించే పరిణామాలతోపాటు విశ్వాన్ని మెరుగ్గా అర్థం చేసుకొనేందుకు ఈప్రయోగం తోడ్పడుతుంది’’అని నాసా అధికారి థామస్‌ జ్యూర్బెచెన్‌ చెప్పారు. ‘‘దశాబ్దాలుగా కాల్పనిక సైన్స్‌ సాహిత్యంలో మాత్రమే సాధ్యపడుతున్న కలను నేడు మేం సాకారంచేశాం’’అని ఆయన వివరించారు. తొలి వారంలో ఈ వ్యోమనౌకలోని యాంటెన్నా, మ్యాగ్నెటోమీటర్‌ పని మొదలుపెడతాయి. దీనిలోని మిగతా పరికరాల పనితీరును సెప్టెంబరు ప్రథమార్థంలో పరీక్షిస్తారు. ఈ పరీక్షలు నాలుగు వారాలపాటు సాగుతాయి. అనంతరం సైన్స్‌ పరిశోధనలను పార్కర్‌ ప్రోబ్‌ ఆరంభిస్తుంది.

రెండు నెలలపాటు శుక్రుడివైపు: తదుపరి రెండు నెలలపాటు శుక్రుడి దిశగా ఈ పార్కర్‌ ప్రోబ్‌ దూసుకెళ్తుంది. అక్టోబరులో శుక్రుడి గురుత్వాకర్షణ సాయంతో దీని కక్ష్యను పెంచుకుంటూ (ఫ్లైబై).. క్రమంగా సూర్యుడివైపు మళ్లుతుంది. నవంబరునాటికి ఈ ప్రోబ్‌ సూర్యుడికి 1.5 కోట్ల మైళ్ల దూరంలోని బాహ్య వాతావరణమైన కరోనాలోకి చేరుకుంటుంది. డిసెంబరులో తొలి పరిశీలన సమాచారాన్ని భూమిపైనున్న ప్రయోగ కేంద్రానికి పంపుతుంది. ఏడేళ్లలో ఏడుసార్లు శుక్రుడి గురుత్వాకర్షణ శక్తితో ఇది కక్ష్యను పెంచుకుంటుంది. క్రమంగా ఇది సూర్యుడికి చేరువవుతుంటుంది. చివరగా భానుడి ఉపరితలం నుంచి 38లక్షల మైళ్ల ఎత్తులో ఉంటుంది. ఈ సమయంలో దీని వేగం గంటకు ఏడు లక్షల కి.మీ. ఉంటుంది. అత్యంత వేగంగా కదులుతున్న వ్యోమనౌకగా ఇది రికార్డు సృష్టించనుంది. సూర్యుడికి దగ్గరగా వెళ్లినప్పుడు ఇది 1,377 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతను ఎదుర్కొంటుంది.

సూర్యుడికి అత్యంత సమీపానికి చేరబోతున్న పార్కర్‌ ప్రోబ్‌ ప్రయోగానికి పునాది వేసినవారిలో భారత సంతతి శాస్త్రవేత్తా ఉన్నారు. ఆయనే నోబెల్‌ గ్రహీత, ఖగోళ నిపుణుడు సుబ్రమణ్యన్‌ చంద్రశేఖర్‌. ఆయన చొరవతోనే 60ఏళ్ల కిత్రం యూజీన్‌ పార్కర్‌ తన పరిశోధన పత్రాలను ప్రచురించగలిగారు. 1958లో 31ఏళ్ల పార్కర్‌ సౌర గాలులపై చేసిన పరిశోధన పత్రాలను ఎవరూ విశ్వసించలేదు. ప్రఖ్యాత ఆస్ట్రోఫిజికల్‌ జర్నల్‌ (ఏజే) అయితే ఆయన సిద్ధాంతాన్ని రెండుసార్లు తోసిపుచ్చింది. అయితే ఆనాడు ఏజే సీనియర్‌ ఎడిటర్‌గా కొనసాగిన చంద్రశేఖర్‌ ఆయనకు అవకాశం ఇచ్చారు. దీంతో ప్రచురితమైన పార్కర్‌ సిద్ధాంతం.. ఎందరిలోనే ఆలోచనలు రేకెత్తించింది.