చంద్రబాబు, లోకేశ్ ఆస్తులపై దర్యాప్తుకు ఆదేశించండి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు, ఏపీ మంత్రి నారా లోకేశ్ గత నాలుగేండ్లలో సంపాదించిన ఆస్తులపై సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)లతో దర్యాప్తు జరిపించేలా ఆదేశాలు జారీచేయాలంటూ ఉమ్మడి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఏపీలో ఐటీరంగం అభివృద్ధి, నూతన కంపెనీల ఏర్పాటు, నిరుద్యోగ యువతకు నైపుణ్యశిక్షణ, ఉపాధి కల్పన, పరిశ్రమల పేరిట వేల ఎకరాలను ధారాదత్తం చేసి చంద్రబాబు, లోకేశ్ సుమారు రూ.25 వేల కోట్ల అక్రమ ఆస్తులను కూడబెట్టారంటూ మాజీ న్యాయాధికారి, ముందడుగు ప్రజాపార్టీ అధ్యక్షుడు జే శ్రవణ్‌కుమార్ వ్యాజ్యం దాఖలుచేశారు. ప్రతివాదులుగా చంద్రబాబునాయుడు, లోకేశ్, ఏపీఎన్నార్టీ సొసైటీ చైర్మన్ వేమూరి రవికుమార్, పల్లె రఘునాథ్‌రెడ్డి తదితరులను పేర్కొన్నారు.
లోకేశ్ ఐటీశాఖ మంత్రి అయిన తర్వాత తమ సమీప బంధువు వేమూరి రవికుమార్‌ను ఐటీశాఖ ముఖ్య సలహాదారుగా, ఏపీఎన్నార్టీ చైర్మన్‌గా నియమించారని పిటిషనర్ పేర్కొన్నారు. పరిశ్రమల స్థాపకులకు సహాయం అందించే బాధ్యతను ఏపీఎన్నార్టీకి అప్పగించారని, కంపెనీల నుంచి ప్రయోజనాలు పొందేందుకు (క్విడ్ ప్రోకో) చంద్రబాబు, లోకేశ్.. రవికుమార్‌ను ఉపయోగించుకుంటున్నారని పిటిషనర్ ఆరోపించారు. వివిధ కంపెనీలకు కేటాయించిన 57,836 ఎకరాల భూముల్లో జరిగిన కొన్ని అక్రమాలను పిటిషన్‌లో వివరించారు. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంస్థ, ఇన్నోవా సొల్యూషన్స్‌కు ఏడేండ్లలో 2,500 మందికి ఉద్యోగాలు కల్పించాలనే షరతుపై విశాఖపట్టణంలోని సుమారు రూ.500 కోట్ల విలువజేసే 40 ఎకరాల భూమిని నామామాత్రపు ధరకే కేటాయించడం విడ్డూరంగా ఉన్నదని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ కంపెనీలు, పరిశ్రమలకు 57,836 ఎకరాల భూమిని కేటాయించినట్లు ఏపీఐఐసీ నివేదికలు చెప్తున్నాయని.. అయితే ఏ కంపెనీకి ఎక్కడ, ఎంత స్థలం కేటాయించారన్నది పేర్కొనలేదని తెలిపారు.

కనీసం ఆర్టీఐ కింద దరఖాస్తు చేసినా సమాచారం ఇవ్వలేదని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. కొత్తగా స్థాపించే ఐటీ కంపెనీల్లో ఏపీకి చెందిన యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు నైపుణ్య శిక్షణ పేరిట ఒక్కొక్కరికి రూ.లక్ష ఖర్చు చేస్తున్నట్టుగా ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెప్తున్నదని.. ఈ మొత్తం వ్యవహారాల్లో చంద్రబాబు, లోకేశ్ భారీగా అక్రమార్జనకు పాల్పడతున్నారని ఆరోపించారు. లోకేశ్ తాను ఎమ్మెల్సీగా ఎన్నికైన సందర్భంలో సమర్పించిన ఆస్తుల వివరాల్లో (2015-16) తన ఆదా యం రూ.71.19 లక్షలు, తన భార్య ఆదాయం రూ.4.33 కోట్లు, తన కుమారుడి ఆస్తులు రూ.11 లక్షలని పేర్కొన్నారని.. మరుసటి ఏడాది సమర్పించిన వివరాల్లో తన ఆదాయం రూ. 71.19 లక్షల నుంచి రూ 303.36 కోట్లకు, తన భార్య ఆదాయం రూ.4.3 కోట్ల నుంచి రూ.27 కోట్లకు, తన కుమారుడి ఆదాయం రూ.11 లక్షల నుంచి రూ.11 కోట్లకు చేరిందని చెప్పారని తెలిపారు. ఒక్క ఏడాదిలో ఇంత భారీ సంపాదన ఎలా సాధ్యమైందని ప్రశ్నించారు.