చంద్రబాబు నెక్ట్స్ స్టెప్... నేడు కోల్ కతాకు!

చంద్రబాబు నెక్ట్స్ స్టెప్… నేడు కోల్ కతాకు!

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తూ, ప్రధాని నరేంద్ర మోదీని, ఎన్డీయే సర్కారును గద్దె దింపడమే లక్ష్యంగా అడుగులేస్తూ, దీర్ఘకాల ప్రత్యర్థి కాంగ్రెస్ తో జతకట్టిన చంద్రబాబు, తన తదుపరి వ్యూహానికి పదును పెడుతున్నారు. ఈ క్రమంలో నేడు ఆయన పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాకు వెళ్లి, సీఎం మమతా బెనర్జీతో సమావేశం కానున్నారు.

ఈ మధ్యాహ్నం ఒంటిగంటకు చంద్రబాబు ప్రత్యేక విమానంలో కోల్ కతాకు వెళ్లనుండగా, ఆయనతో పాటు మంత్రులు యనమల రామకృష్ణుడు, కళా వెంకట్రావు వెళ్లనున్నారు. సాయంత్రం 4 గంటలకు మమతా బెనర్జీతో సమావేశమయ్యే చంద్రబాబు, రానున్న లోక్ సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. సీబీఐని నిలువరించేందుకు రాష్ట్రాలకు అనుకూలంగా ఉన్న చట్టాలపైనా వీరిద్దరి మధ్యా చర్చ సాగనున్నట్టు తెలుస్తోంది. ఆపై రాత్రికి ఆయన తిరుగు ప్రయాణం కానున్నారు. కాగా, ఈ నెల 22న ఢిల్లీకి వెళ్లనున్న చంద్రబాబు, పలు బీజేపీయేతర జాతీయ, ప్రాంతీయ పార్టీ నేతలను కలిసి, కూటమి ఏర్పాటుపై చర్చించనున్నారు.