చంద్రబాబు ఉచ్చులో అమాయకుడైన వంగవీటి రాధా పడ్డారు: పేర్ని నాని

వైసీపీకి వంగవీటి రాధా రాజీనామా చేయడం, ఆ పార్టీపై విమర్శలు గుప్పించడం ఏపీలో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో వైసీపీ నేత పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు ట్రాప్ లో అమాయకుడైన వంగవీటి రాధా పడ్డారని అన్నారు. చంద్రబాబు మాటలను నమ్మి 1996లో రాధా తల్లి రత్నకుమారి కూడా మోసపోయారని చెప్పారు. రంగా ఆశయాలను చంద్రబాబు నెరవేరుస్తారని నమ్మడం రాధా అమాయకత్వాన్ని తెలియజేస్తోందని అన్నారు. రంగా హత్యకు, టీడీపీకి సంబంధం లేదని రాధా చెప్పడంతో… రంగా అభిమానులు బాధపడుతున్నారని చెప్పారు. రాధాకు విలువ ఇవ్వడం వల్లే గతంలో దేవినేని నెహ్రూను వైసీపీలో చేర్చుకోలేదని అన్నారు. రాధాని బయటకు పంపాలని అనుకుని ఉంటే… నెహ్రూను ఎప్పుడో పార్టీలో చేర్చుకునేవాళ్లమని తెలిపారు.