చంద్రబాబుకు శాశ్వతంగా తలుపులు మూసేశాం: అమిత్ షా

మరోసారి ఎన్డీయేలో చేరేందుకు చూస్తున్న చంద్రబాబు
ఆయన్ను చేర్చుకునే పరిస్థితి లేదు
సానుభూతి కోసం బయటకు వెళ్లి విమర్శలా?
విమర్శలు గుప్పించిన అమిత్ షా
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి ఎన్డీయే ద్వారాలు శాశ్వతంగా మూతపడ్డాయని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వ్యాఖ్యానించారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కన్నాతో కలిసి నరసరావుపేటలో జరిగిన ఎన్నికల సభలో మాట్లాడిన ఆయన, చంద్రబాబు వంటి స్వార్థపరుడు మరొకరు ఉడరని, తన స్వార్థం కోసం ఆయన ఎంతకైనా దిగజారుతారని నిప్పులు చెరిగారు. 2014 ఎన్నికలకు ముందు నరేంద్ర మోదీ హవా చూసి కూటమిలో చేరిన ఆయన, ఈ ఎన్నికల్లో సానుభూతి కోసం ఎన్డీయేను వీడి, తమపై తప్పుడు విమర్శలు చేస్తున్నారని ఆరోపించిన ఆయన, తెలంగాణలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని ఓడిపోయారని, ఆ కారణంతోనే ఏపీలో కాంగ్రెస్ తో కలిసి ఎన్నికలకు వెళ్లడం లేదని అన్నారు. తెలంగాణలో విజయం సాధించివుంటే, ఏపీలోనూ కాంగ్రెస్ తో పొత్తు ఉండేదని, ఎంతో మంది నమ్మినవారిని మోసం చేసినట్టే ఇక్కడా చేశారని అన్నారు. ఏపీ విభజన చట్టంలో ఉన్న 14 హామీల్లో 11 హామీలను తాము నెరవేర్చామని గుర్తు చేసిన ఆయన, పోలవరం కోసం రూ. 7 వేల కోట్లను ఇచ్చామని అన్నారు. మోదీ మరోసారి విజయం సాధించడం ఖాయమని, ఆ తరువాత ఎన్డీయేలో కలవాలని చంద్రబాబు చూస్తున్నారని, కానీ ఆయన్ను చేర్చుకునే పరిస్థితి లేదని అమిత్ షా స్పష్టం చేశారు.