gramasachivalayam

గ్రామ సచివాలయం పేపర్ లీక్ వార్తలు.. కథనంపై మండిపడుతున్న వైసీపీ శ్రేణులు!

    • ఏపీపీఎస్సీ ఉద్యోగుల కుటుంబాలకే టాప్ ర్యాంకులు
    • సంచలన కథనం ప్రచురించిన ఆంధ్రజ్యోతి
    • ప్రభుత్వ తీరుపై మండిపడ్డ టీడీపీ అధినేత చంద్రబాబు

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గ్రామ సచివాలయం పరీక్షల్లో గోల్ మాల్ జరిగినట్లు ‘ఆంధ్రజ్యోతి’ పత్రిక సంచలన కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. ఏపీపీఎస్సీలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగిని, ఓ ఉద్యోగి సోదరుడు, మరో ఏపీపీఎస్సీ అధికారి కుటుంబంలో ఏకంగా ముగ్గురికి ఉద్యోగాలు వచ్చాయని సదరు పత్రిక తెలిపింది. దీంతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఇది భారీ కుంభకోణమని వ్యాఖ్యానించారు.

    లక్షలాది నిరుద్యోగులను వైసీపీ ప్రభుత్వం దగా చేసిందని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో దురుద్దేశపూర్వకంగానే ఆంధ్రజ్యోతి పత్రిక ఈ కథనాన్ని రాసిందని వైసీపీ శ్రేణులు, మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ సచివాలయం పరీక్షల్లో టాప్ ర్యాంకు సాధించిన పలువురు సామాన్యులను ప్రస్తావిస్తున్నారు. పనిలోపనిగా ఏబీఎన్ ఛానెల్, ఆంధ్రజ్యోతి పత్రిక యజమాని వేమూరి రాధాకృష్ణపై తిట్లవర్షం కూడా కురిపిస్తున్నారు. గ్రామ సచివాలయం భర్తీ ప్రక్రియ మొత్తాన్ని అపహాస్యం చేసేందుకే ఆంధ్రజ్యోతి పత్రిక ఇలాంటి కథనాలను అచ్చేసిందని విమర్శిస్తున్నారు.