YS Jagan Mohan Reddy, Panchayati Raj Department, volunteers recruitment, vijayawada

గ్రామ వాలంటీర్ల వ్యవస్థను ప్రారంభించిన సీఎం జగన్‌

  • స్థానిక స్వపరిపాలనలో నవశకానికి నాంది
  • స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా నూతన వ్యవస్థకు శ్రీకారం
  • 2,66,796 మంది వలంటీర్ల నియామకం

అమరావతి: బాపూజీ కన్న కలలను సాకారం చేసే దిశగా ఆంధ్రప్రదేశ్‌లో విప్లవాత్మక మార్పునకు గురువారం పునాది పడింది. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిలా పనిచేసే ‘వాలంటీర్ల’ వ్యవస్థను స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం లాంఛనంగా ప్రారంభించారు. విజయవాడలో ఏర్పాటు చేసిన వాలంటీర్ల ముఖాముఖి కార్యక్రమంలో సీఎం జగన్‌ పాల్గొని.. వాలంటీర్ల వ్యవస్థను ప్రారంభించారు. దీంతో ప్రజాసంకల్పయాత్రంలో వైఎస్‌ జగన్‌ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు గ్రామస్వరాజ్యం దిశగా ఏపీ ప్రభుత్వం మరో ముందుడుగు వేసింది. స్థానిక స్వపరిపాలనలో నవశకానికి నాంది పలికింది. దీనికి సీఎం శ్రీకారం చూట్టారు.

ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. వాలంటీర్లు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉంటారని అన్నారు. ‘గడిచిన 73 ఏడేళ్లలో ఇప్పటికీ కొన్ని గ్రామాలు ఇంకా స్వాతంత్య్రానికి దూరంగా ఉన్నాయి. అభివృద్ధి, ఉపాధిలేదన్న విషయాన్ని 3648 కి.మీ నా సుధీర్ఘ పాదయాత్రలో చూశాను. పేదలకు అండగా ఉన్నామన్న భరోసా ప్రభుత్వం ఇచ్చే విధంగా ఉండాలి. దానిలో భాగమే గ్రామ వాలెంటీర్ల వ్యవస్థ. లంచాలు, వివక్ష, కులాలు, మతాలు, రాజకీయాలు లేని వ్యవస్థను తీసుకురావాలి. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ మంచి జరగాలి. ప్రజల మనసులు గెలిచే విధంగా గ్రామ వాలెంటీర్లు పనిచేయాలి.

నా స్వరం మీనోటి వెంట రావాలి..
వ్యవస్థను పటిష్టంగా తీర్చిదిద్దాలన్నదే నా లక్ష్యం. అధికారంలోకి వచ్చిన మూడు నెలలు తిరగకముందే 4లక్షల ఉద్యోగాలు కల్పించిన చరిత్ర దేశంలో ఇప్పటి వరకూ లేదు. నేను విన్నాను నేను ఉన్నాను అని నా నోట వచ్చిన స్వరం.. ఇప్పటి నుంచి మీనోట కూడా కావాలి. గ్రామ వాలెంటీర్లు చేసే పనులు ఎంతో​ కీలకమైనవి. ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారులను గుర్తించడం, డోర్‌ డెలివరీ చేయడం. సెప్టెంబర్‌ 1న శ్రీకాకుళం నుంచి రేషన్‌ బియ్యం డోర్‌డెలివరీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. మేనిఫెస్టోలో మనం చెప్పిన ప్రతి పథకం పేదలకు చేరాలి. ప్రధానంగా నవరత్నాలు ప్రతి ఒక్కరికి అందాలి. రైతు భరోసా అక్టోబర్‌ 15న ప్రారంభిస్తాం. ప్రతి రైతుకు పెట్టుబడి సాయంగా రూ.12500 ఇవ్వాలని నిర్ణయించాం. లబ్ధిదారుల ఎంపికలో లంచాలు, వివక్ష ఉండకూడదు. ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఫలాలు అందారు. రాష్ట్రంలో ఇంటిస్థలం లేని వారు ఎవరూ ఉండకూడదు. ఉగాది నాటికి అందరికీ ఇంటి స్థలాలను చూపించాలి. దీనిలో వాలెంటీర్లు కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. మీలోనుంచే నేను లీడర్లను తయరుచేస్తాను’ అని అన్నారు.

2,66,796 మంది వాలంటీర్ల నియామకం
కేవలం 45 రోజుల వ్యవధిలో వివాదాలకు తావు లేకుండా గ్రామ, పట్టణ వార్డుల్లో 2,66,796 మంది వాలంటీర్ల నియామక ప్రక్రియను ప్రభుత్వం దిగ్విజయంగా పూర్తి చేసింది. గ్రామీణ ప్రాంతంలో ప్రతి 50 ఇళ్లకు. గిరిజన ప్రాంతాల్లో ప్రతి 35 ఇళ్లకు, పట్టణ ప్రాంతాల్లో ప్రతి 50–100 ఇళ్లకు ఒకరు చొప్పున వాలంటీర్లను నియమించిన విషయం తెలిసిందే. వీరంతా గురువారం నుంచే విధుల్లో చేరనున్నారు. విజయవాడలో సీఎం వైఎస్‌ జగన్‌ చేతుల మీదుగా ప్రారంభమయిన ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్లంతా వీక్షించేలా ప్రతి మండల కేంద్రంలో ప్రత్యేకంగా ఎల్‌సీడీలను ఏర్పాటు చేశారు.

సగం మంది మహిళలే.. 
వాలంటీర్ల నియామకంలో మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు 2.66 లక్షల మంది వలంటీర్లలో 1.33 లక్షల పోస్టులు మహిళలకే దక్కాయి. రిజర్వేషన్ల నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీలను ఎంపిక చేశారు.

Tags: YS Jagan Mohan Reddy, Panchayati Raj Department, volunteers recruitment, vijayawada