గెలుపు ఎవరిదో.. నలభై రోజుల నిరీక్షణమే!

గెలుపు ఎవరిదో.. నలభై రోజుల నిరీక్షణమే!

Share This

ముగిసిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు
ఫలితాల కోసం 40 రోజుల నిరీక్షణ
విజయం తమదేనంటున్న టీడీపీ, వైసీపీ
ఆంధ్రప్రదేశ్ కు అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. వచ్చే ఐదేళ్లూ తమను ఎవరు పరిపాలించాలన్న తీర్పును ఓటర్లు ఈవీఎంలలో నిక్ష్తిప్తం చేసేశారు. కొన్ని చోట్ల ఘర్షణలు జరిగినప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో రీపోలింగ్ జరగాల్సివున్నప్పటికీ, ఇప్పటికే ఈవీఎంలలో అభ్యర్థుల భవితవ్యం నిక్షిప్తమైంది. రీపోలింగ్ చూపించే ప్రభావం నామమాత్రమే.

తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రస్తుత సీఎం నారా చంద్రబాబునాయుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారం తమదేనని నొక్కి చెప్పేశారు. ఈ ఎన్నికల్లో తొలిసారిగా పోటీలోకి దిగిన జనసేన అధినేత పవన్ కల్యాణ్, తానే కింగ్ మేకర్ ను అవుతానన్న ధీమాలో ఉండగా, పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మాత్రం తమకు అధికారం దక్కుతుందన్న ఆశ లేదని, ఇదే సమయంలో తాము నిర్ణయాత్మక పాత్రను పోషిస్తామన్న నమ్మకం ఉందని చెప్పేశారు.

ఇదిలావుండగా, ఎన్నికలు ముగిసిన తరువాత అధినేతలు, పోటీలో నిలిచిన అభ్యర్థులు సుదీర్ఘ కాలం నిరీక్షించాల్సిన పరిస్థితి. తొలి దశలోనే ఎన్నికలు ముగిసిపోయాయి కాబట్టి, మే 23 వరకూ ఫలితాల కోసం అందరూ వేచివుండాలి. గతంలో ఎన్నడూ లేనన్ని రోజులు ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్ లలో ఉండనున్నాయి. స్ట్రాంగ్ రూముల వద్ద భారీ స్థాయిలో కేంద్ర భద్రతతో పాటు ప్రధానంగా పోటీ పడుతున్న తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల ఏజంట్లూ కాపలా కాయనున్నారు. అంటే దాదాపు 40 రోజుల తరువాత మాత్రమే ఈవీఎంలలో ఎవరి గెలుపు రాసివుందో తెలుస్తుంది.

దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ ఎన్నికలను పలు దఫాలుగా నిర్వహిస్తున్నారు. అన్ని దశలూ ముగిసేవరకూ ఫలితాలు వెల్లడించడానికి వీల్లేదు. అంటే, ఈ 40 రోజులూ అభ్యర్థుల్లో తమ భవిష్యత్తు ఏంటన్న టెన్షన్ కొనసాగుతుందని అర్థం.