గుంటూరు జిల్లాలో దారుణం… టీడీపీ వర్గీయులను కారుతో ఢీకొట్టిన వైసీపీ వైర్గీయులు

  • ముగ్గురు యువకుల దుర్మరణం!
  • గుంటూరు జిల్లా వినుకొండలో కలకలం రేపిన హత్యలు
  • సిమెంటు రోడ్డు కాంట్రాక్టు విషయంలో గొడవ
  • పోలీసులు ఫిర్యాదు చేసేందుకు వెళ్తుండగా వెంబడించి మరీ దారుణం

గుంటూరు జిల్లా వినుకొండలో దారుణం జరిగింది. సిమెంటు రోడ్డు విషయంలో వైసీపీ-టీడీపీ మధ్య మొదలైన ఘర్షణలో చివరికి టీడీపీ వర్గీయులుగా చెబుతున్న ముగ్గురు యువకులు దారుణ హత్యకు గురయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

వినుకొండ మండలం అందుగుల కొత్తపాలెంలో సిమెంటు రోడ్డు వేయాలన్న ప్రతిపాదన ఉంది. ఈ కాంట్రాక్టును దక్కించుకునేందుకు టీడీపీ వర్గీయులుగా చెబుతున్న చల్లా వెంకటకృష్ణ (26), గురజాల సోమయ్య (30), మేడబోయిన మల్లికార్జున్‌ (28) ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే, గ్రామంలో సిమెంటు రోడ్డు వేయాలన్న ప్రతిపాదనను అదే గ్రామానికి చెందిన వైసీపీ మద్దతుదారులైన ఎనుగంటి రామకోటయ్య అనుచరులు అడ్డుకున్నారు. దీంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.

సిమెంటు రోడ్డు వేయడాన్ని అడ్డుకుంటున్న వైసీపీ వర్గీయులపై పోలీసులు ఫిర్యాదు చేసేందుకు గురువారం సాయంత్రం వెంకటకృష్ణ, సోమయ్య, మల్లికార్జున్‌‌లు ముగ్గూరు కలిసి ఒకే బైక్‌పై వినుకొండ బయలుదేరారు. విషయం తెలుసుకున్న వైసీపీ వర్గీయులు కారుతో వారిని వెంబడించారు. పసుపులేరు బ్రిడ్జపై యువకుల బైక్‌ను బలంగా ఢీకొట్టారు. దీంతో ముగ్గురూ కింద పడ్డారు.

అదే సమయంలో గుంటూరు నుంచి కర్నూలు వైపు వెళ్తున్న లారీ వీరిని ఢీకొట్టడంతో సోమయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్ర గాయాలపాలైన వెంకటకృష్ణ, మల్లికార్జునరావు వినుకొండ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. వీరి మృతితో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బైక్‌ను ఢీకొట్టిన సమయంలో కారులో ఆరుగురు ఉన్నట్టు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.