కోట్ల రూపాయలు చెల్లించి వైఎస్ వివేకా హత్య!

కోట్ల రూపాయలు చెల్లించి వైఎస్ వివేకా హత్య!

  • హత్య కేసులో వీడుతున్న ఒక్కో చిక్కుముడి
  • కిరాయి హంతకులతో హత్య చేయించినట్టు అనుమానం
  • ఇప్పటికే పలువురి అరెస్ట్

సంచలనం రేపిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఒక్కో చిక్కుముడీ వీడుతోంది. ఈ కేసు విచారణను సీరియస్ గా తీసుకున్న సిట్ దర్యాఫ్తు బృందం ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. వివేకాను కోట్ల రూపాయలు చెల్లించి, కిరాయి హంతకులతో హత్య చేయించిట్టు సిట్ అధికారులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 15న వివేకా హత్యకు గురికాగా, దీని వెనుక ఎవరున్నారు? వారు ఏమి ఆశించి ఈ పని చేశారన్న కోణంలో దర్యాఫ్తు శరవేగంగా సాగుతోంది.

ఈ కేసులో వివేకా సన్నిహితులు ఎర్ర గంగిరెడ్డి, పీఏ కృష్ణారెడ్డి, డ్రైవర్ ప్రసాద్ లతో పాటు పరమేశ్వర్ రెడ్డి, మరో ముగ్గురిని అరెస్ట్ చేసిన అధికారులు గడచిన ఐదు రోజులుగా విచారిస్తున్నారు. పరమేశ్వర్ రెడ్డి ప్రమేయంపై ఆధారాలు సేకరించిన పోలీసులు, సింహాద్రిపురం మండలం, దిద్దెకుంట గ్రామానికి చెందిన శేఖర్ రెడ్డి, వేల్పుల గ్రామానికి చెందిన రాగిపిండి సుధాకరరెడ్డిలకు కూడా హత్యలో ప్రమేయముందని అనుమానిస్తున్నారు.

నిన్న ఈ హత్యకు వినియోగించిన వేట కొడవలిని స్వాధీనం చేసుకున్న పోలీసులు దాన్ని ఇప్పటికే ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. వేట కొడవలిపై ఉన్న రక్తపు మరకలు, వేలిముద్రల విశ్లేషణ జరుగుతోంది. అది తేలితే, కేసులో దాదాపు కొలిక్కి వచ్చినట్టేనని సిట్ అధికారులు అంటున్నారు.
Tags: viveka anandh reddy, murder, updates ,CIT, parameswar reddy