కొండే అవినీతిమయం… ఇక కొండను తవ్వి నిరూపించాల్సింది ఏముంటుంది?: ఐవైఆర్ కృష్ణారావు

ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడుపై ఐఏఎస్ రిటైర్డ్ అధికారి ఐవైఆర్ కృష్ణారావు మరోసారి విమర్శనాస్త్రం సంధించారు. మీడియాలో చంద్రబాబు వ్యాఖ్యల పట్ల ఆయన స్పందించారు. “జగన్ కొండను తవ్వుతానంటున్నారు, ఎలుకే కాదు చీమ, దోమ కూడా దొరకవు” అంటూ చంద్రబాబు ఎద్దేవా చేయడం పట్ల ఐవైఆర్ కృష్ణారావు ట్వీట్ చేశారు. కొండే అవినీతిమయం అయినప్పుడు ఇంక కొండను తవ్వి ప్రత్యేకంగా నిరూపించాల్సింది ఏముంటుందని పేర్కొన్నారు.

గతకొంతకాలంగా ఐవైఆర్ చంద్రబాబును టార్గెట్ గా చేసుకుని అనేక వాగ్బాణాలు సంధిస్తున్న సంగతి తెలిసిందే. గతంలోగా 2014 నుంచి 2016 వరకు నవ్యాంధ్ర సీఎస్ గా వ్యవహరించిన ఐవైఆర్ ఆ తర్వాత ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులయ్యారు. అయితే, ఐవైఆర్ కొన్ని సోషల్ మీడియా పోస్టులతో ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారడంతో ఆయనపై వేటు వేశారు.