కేసీఆర్, జగన్, ‘మేఘా’ కృష్ణారెడ్డిలపై సంచలన వ్యాఖ్యలు చేసిన నటుడు శివాజీ

  • మేఘా కృష్ణారెడ్డి ఓ దేశద్రోహి
  • సీఎంలు, కాంట్రాక్టర్లు ప్రజాధనాన్ని దోచుకోవడం దేశద్రోహమే
  • అన్ని అక్రమాలను ఆధారాలతో సహా బయటపెడతా

మేఘా ఇంజినీరింగ్ సంస్థ అధినేత కృష్ణారెడ్డిపై సినీ నటుడు శివాజీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయనొక మిత్రద్రోహి అంటూ మండిపడ్డారు. ఆయన అక్రమాలకు సంబంధించిన నిజాలను ఆధారాలతో సహా బయటపెడతానని చెప్పారు. ఈ విషయాలను మీడియా ద్వారా బయటపెడదామని తాను అనుకున్నానని… అయితే వాటిని ప్రసారం చేసే దమ్ము దేశంలోని ఏ మీడియాకు లేదని తెలిపారు. ప్రాజెక్టుల పేరుతో ప్రజాధనాన్ని దోచుకుని, వాటిని ముఖ్యమంత్రులతో పంచుకోవడం దేశద్రోహమని అన్నారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్, రీటెండరింగ్ పేరుతో సీఎంలు, కాంట్రాక్టర్లు ప్రజాధనాన్ని దోచుకోవడం దారుణమని చెప్పారు. ప్రభుత్వాలు ఇచ్చే సబ్సిడీతో బస్సులను కొని, వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని జేబుల్లోకి వేసుకోవడం అతి పెద్ద నేరమని అన్నారు.

ఓఎన్జీసీలో 27 రిగ్గుల కాంట్రాక్టును దక్కించుకుని ప్రజాధనాన్ని లూఠీ చేసిన దేశద్రోహి గురించి చెప్పాలనుకుంటున్నానని… దేశానికి ముప్పుగా పరిణమించిన ఆ ద్రోహి మేఘా కృష్ణారెడ్డి అని శివాజీ మండిపడ్డారు. తన దృష్టిలో ఆయన చైనాకు మౌత్ పీస్ అని అన్నారు. ఆ వ్యక్తి కంపెనీ ఆదాయం కేవలం ఏడేళ్లలో రూ. 26 వేల కోట్లకు చేరుకుందంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చని చెప్పారు. ఓ మిత్రద్రోహి గురించి అందరికీ నిజాలు తెలియాలనే ఉద్దేశంతోనే… అతను చేస్తున్న దారుణాలు, దేశానికి చేస్తున్న నష్టాలను ఆధారాలతో మీ ముందు ఉంచబోతున్నానని సోషల్ మీడియా ద్వారా తెలిపారు.

Tags: KCR, TRS, Jagan, YSRCP, Sivaji, Tollywood, Megha Krishna Reddy