కేరళ కోసం: ఏ హీరో విరాళం ఎంతంటే?

కేరళలో వరద బీభత్సం కొనసాగుతోంది. 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. వందలాది మంది నిరాశ్రయులయ్యారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. భారీ వర్షాలు, వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన తమ రాష్ట్రాన్ని ఆదుకునేందుకు విరాళాలు అందించాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ పిలుపునిచ్చిన నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖుల స్పందించారు. సాయం చేసేందుకు ముందుకొచ్చారు. మాలీవుడ్‌తోపాటు కోలీవుడ్‌, టాలీవుడ్ ప్రముఖులు కూడా కేరళ వాసులకు అండగా నిలిచారు. తమకు తోచిన మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా ఇచ్చారు. ఎవరెవరు ఎంతిచ్చారంటే..

* మాలీవుడ్‌

-స్టార్‌ హీరోలు మోహన్‌లాల్, మమ్ముట్టి రూ.25 లక్షలు చొప్పున సాయం చేశారు. అసోసియేషన్‌ ఆఫ్‌ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్‌ (AMMA) రెండు విడతల్లో రూ.50 లక్షలు ఇచ్చింది.

-యువ నటుడు తొవినో థామస్‌ మరో అడుగు ముందుకు వేశారు. ఇరింజలక్కుడలోని తన ఇంటిలో బాధితులకు ఆశ్రయం కల్పించారు. అంతేకాదు వరదలు తగ్గే వరకు బాధితులకు అత్యవసర సరకులు సరఫరా చేస్తానని చెప్పారు.

* టాలీవుడ్

– హీరో అల్లు అర్జున్‌ రూ.25 లక్షలు కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. ‘‘కేరళ ప్రజలు నాపై చూపిన అమితమైన ప్రేమ, అభిమానం.. నా హృదయంలో వారికి ప్రత్యేక స్థానాన్ని ఏర్పరిచింది. వారి కోసం నా వంతుగా సాయం చేయాలి అనుకుంటున్నా’’ అని రూ.25 లక్షలు ఇస్తున్నట్లు ట్వీట్‌ చేశారు.

– హీరో విజయ్‌ దేవరకొండ కూడా తన వంతుగా సాయం చేసేందుకు ముందుకొచ్చారు. రూ.5 లక్షలు విరాళం ఇచ్చారు. అంతేకాదు కేరళ వాసులకు సాయపడేందుకు ముందుకు రావాలని యువతకు పిలుపునిచ్చారు.

– ‘గీత గోవిందం’ సినిమా వసూళ్లను కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా అందిస్తామని చిత్ర నిర్మాత బన్నీ వాసు తెలిపారు.

* కోలీవుడ్

– తమిళ స్టార్‌ హీరోలు కమల్‌ హాసన్‌, సూర్య-కార్తి, విజయ్‌ సేతుపతి రూ.25 లక్షలు చొప్పున విరాళం ఇచ్చారు.‌ సూర్య ప్రత్యేకంగా ‘AMMA’ ఫండ్‌కు రూ.10 లక్షలు విరాళంగా అందించారు.

– హీరో సిద్ధార్థ్‌ సోషల్‌మీడియా ఛాలెంజ్‌ ప్రారంభించారు. కేరళ కోసం విరాళాలు అందించాలని కోరారు. తన వంతుగా రూ.10 లక్షలు విరాళం అందిస్తున్నట్లు చెప్పారు.‌ 2015లో తమిళనాడులో వరదలు సంభవించినప్పుడూ సిద్ధార్థ్‌ చాలా ముఖ్య పాత్ర పోషించారు.

– హీరో ధనుష్‌ రూ.15 లక్షలు, విశాల్‌, శివకార్తికేయన్‌ రూ.10 లక్షలు చొప్పున కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం ఇచ్చారు. సన్‌ టీవీ నెట్‌వర్క్‌ కోటి రూపాయలు విరాళంగా ప్రకటించింది.