కేంద్రం చూస్తూ వూరుకోదట

ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల ఏర్పాటుకు ప్రభుత్వం చేసిన ప్రతిపాదనపై అమరావతి వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి.ఈ నేపథ్యంలో మరోమారు తన అబిప్రాయాలు వ్యక్తం చేశారు రాజ్యసభ ఎంపీ, మాజీ కేంద్రమంత్రి వై.సుజనాచౌదరి. అమరావతి నుంచి రాజధాని తరలింపు పై పెద్దఎత్తున ఆందోళనలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణం అన్నారు. తమ భవిష్యత్తు ఏమిటని రైతులు భయపడుతున్నారని, రాజధాని మార్పును అందరూ వ్యతిరేకించాలన్నారు. రాజధాని తరలింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని 13 జిల్లాలను ఏ విధంగా అభివృద్ధి చేయాలనే దానిపై ఆలోచిస్తే మంచిదని జగన్ ప్రభుత్వానికి సలహా ఇచ్చారు. గత ఏడు నెలల్లో కొత్త పరిశ్రమలు రాకపోగా, ఉన్నవి తరలిపోయే పరిస్థితి నెలకొందని .. రాజధాని  తరలింపు నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి  పూర్తిగా దెబ్బతింటుందని వైఎస్ చౌదరి ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న పనులను బీజేపీ చూస్తూ ఊరుకోదన్నారు. అమరావతి లో జరుగుతున్న పరిణామాలను కేంద్రం పరిశీలిస్తోందని, అధికార ప్రకటన వెలువడిన తర్వాత సరైన సమయంలో కేంద్రం జోక్యం చేసుకుంటుందన్నారు. అమరావతికి భూములు ఇచ్చిన రైతులు ప్రభుత్వానికే ఇచ్చారని, వ్యక్తులకు కాదన్నారు. ఆ సమయంలో చంద్రబాబు సీఎంగా ఉన్నారని, పార్లమెంటు చట్టం ప్రకారం అమరావతికి కేంద్రం సాయం చేస్తోందన్నారు. దేశంలో పార్లమెంటే సుప్రీం అని.. దాని కాదని ఏ నిర్ణయం తీసుకున్నా అది కుదరదన్నారు. శనివారం ఢిల్లీలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. స్వంత ప్రభుత్వం నిర్ణయాల వల్ల వైసీపీ నేతలే సంతోషంగా లేరన్నారు. అధికారంలో ఎవరు ఉంటే వారికి అనుగుణంగా అధికారులు పనిచేయడం కుదరదన్నారు. హైకోర్ట్, సచివాలయం, రాజ్ భవన్ ఒకేచోట ఉండాలని విభజన చట్టం సెక్షన్ 6 చెబుతోందన్నారు వైఎస్ చౌదరి. పాలనపై దృష్టిపెట్టాలని జగన్ కు సూచించారు. రాజధానిని మారిస్తే ఊరుకోబోమని, ప్రజల తరఫున పోరాటం చేస్తామన్నారు. 13 జిల్లాలను అభివృద్ధిచేయాలని ఆలోచించడం మంచిదేనని, అయితే అమరావతిని విస్మరిస్తే కోర్టులు చూస్తూ ఊరుకోబోవన్నారు.  మనీబిల్లుగా సీఆర్డీయే తెస్తామంటే అయ్యే పనికాదన్నారు. సీఆర్టీయేని రద్దుచేయడం కుదరదన్నారు.