కూటమి కొంపముంచిన చంద్రబాబు

కూటమి కొంపముంచిన చంద్రబాబు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ప్రజాకూటమి కొంపముంచుతున్నాడనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. తెలంగాణలో చంద్రబాబునాయుడు అడుగుపెట్టడం ఏమాత్రం ఇష్టంలేని విభిన్న సామాజికవర్గాలు, ఉద్యోగ, కార్మికవర్గాలు ప్రజాకూటమికి దూరమవుతున్నాయి. కాంగ్రెస్, సీపీఐ, టీజేఎస్‌కు ఎంతోకొంత అనుకూలంగా ఉన్నవారు కూడా ఒక్కొక్కరుగా గుడ్‌బై చెప్తున్నారు. పోలింగ్ ముగింట్లో కీలకంగా ఉన్నవారంతా దూరమవుతుండటంతో కూటమి నేతలే తలలుపట్టుకుంటున్నారు. టీఆర్‌ఎస్ పార్టీ తీరుపై కొంత అసంతృప్తితో ఉన్నవారిని ఒక్కతాటిపైకి తీసుకొచ్చేందుకు కూటమికట్టినవారు ఇప్పుడు రగిలిపోతున్నారు. అత్యంత కీలక సమయంలో చంద్రబాబును తెచ్చి నెత్తినరుద్దిన కాంగ్రెస్ అధిష్ఠానంపై మండిపడుతున్నారు. వివిధ ఉద్యోగ, సామాజిక, ప్రాంతీయవర్గాలు బాబుతో పొత్తుపెట్టుకోవడంతో ఉన్న ఓట్లు గోవిందా అని పెదవివిరుస్తున్నాయి. దీనికితోడు రోజురోజుకు కూటమిలో చంద్రబాబు పెత్తనం పెరుగడం అన్నివర్గాలవారిని కలవరానికి గురిచేస్తున్నది.
ఏ వలసాధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడి రాష్ట్రం తెచ్చుకున్నామో.. ఆ వలసాధిపత్యం కిందకు మళ్లీ జారిపోతున్నామని టీజేఎస్‌లో పనిచేసిన రచనారెడ్డి ఆరోపించారు. కూటమి ముసుగులో చంద్రబాబు హైదరాబాద్‌లో అడుగుపెట్డడం.. హైదరాబాద్‌ను, సైబరాబాద్‌ను నేనే నిర్మించా.. ఐటీ నాదే.. ఆఖరుకు తెలంగాణ ప్రజలు బతుకుతున్నది నా దయతోనే అన్నట్టు మాట్లాడటం తట్టుకోలేకపోతున్నారు. దీంతో చంద్రబాబు వెంట వెళ్లలేక.. కూటమిలో ఉండలేక.. ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు.

కీలకవర్గాలు దూరం
సామాజికంగా టీడీపీతో విభేదించేవర్గాలు ఇప్పుడు కాంగ్రెస్‌ను అంతేదూరంలో పెడుతున్నాయి. హైదరాబాద్ చుట్టుపక్కల నియోజకవర్గాల్లో ఈ తేడా స్పష్టంగా కనపడుతున్నది. ఇప్పటికే కొన్ని ప్రధాన వర్గాలు టీడీపీ ఉన్న కూటమికి మద్దతు ఇవ్వబోమని తీర్మానాలు చేశాయి. ఇటీవల కూకట్‌పల్లిలో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటుచేసి టీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్ కేశవరావుకు తమ లేఖ అందించారు. మూసాపేట, నిజాంపేటల్లో ఆంధ్రమూలాలున్న కొన్ని సామాజికవర్గాలు ఓపెన్‌గా టీఆర్‌ఎస్‌కు మద్దతు ప్రకటించాయి. ఈవిషయాన్ని స్వయంగా మంత్రి కేటీఆర్‌తోనే చెప్పాయి. ఇంతకాలం కాంగ్రెస్‌కు అండగా ఉన్న రాయలసీమలోని ఓ బలమైన సామాజికవర్గం కూడా చంద్రబాబు కారణంగా ఆ పార్టీకి దూరమవుతున్నది. ఆ సామాజికవర్గానికి చెందినవారు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ప్రెస్‌మీట్ పెట్టి మరీ తాము కూటమికి ఓటువేయడంలేదని చెప్పారు. టీఎన్జీవోలు, ఎన్జీవోలు, నాలుగోతరగతి ఉద్యోగులు సమావేశాలు పెట్టుకొని చంద్రబాబు ఉన్న కూటమికి ఓటేయవద్దని తీర్మానాలుచేశారు. అంగన్‌వాడీలు, ఆశావర్కర్లు చంద్రబాబు పేరువింటేనే మండిపడుతున్నారు.

దూరమవుతున్న విద్యావంతులు
విద్యావంతులు, మేధావులు తమకు అనుకూలంగా ఉన్నారని కాంగ్రెస్ నిన్నమొన్నటి వరకు ఆశపెట్టుకున్నది. కానీ, ఇప్పుడు చంద్రబాబు పెత్తనం చూసిన విద్యావంతులు, మేధావులు ఇక తమవల్ల కాదని కూటమి పక్షాన మాట్లాడేందుకు నిరాకరిస్తున్నారు. కూటమిలో ఒక్క విద్యార్థికి కూడా పోటీచేసేందుకు అవకాశం ఇవ్వకపోవడంతో వీరు మొత్తం దూరమయ్యారు. చంద్రబాబు పథకాలను గుర్తించిన మేధావి వర్గం కూడా ఆనాటి అరాచకాలను గుర్తుచేసుకుంటూ సైలెంట్ అ య్యారు. వివిధ వర్గాల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ను తెలుసుకున్న కాంగ్రెస్ అధిష్టానం పత్రికా ప్రకటనల్లో చంద్రబాబు ఫొటో పెట్టేందుకు కూడా జంకుతున్నది. ప్రకటనల్లో బాబు ఫొటోను హైదరాబాద్, ఖమ్మం జిల్లాల్లో మినహా మరే జిల్లాలోనూ వాడటం లేదు. చంద్రబాబు వస్తే ఉన్న ఓట్లు కూడా పోతాయని నల్లగొండ కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బహిరంగంగానే చెప్తున్నారు. ఉత్తర తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి. ప్రజాకూటమి తరఫున ఇచ్చే పత్రికా ప్రకటనల్లో చంద్రబాబు బొమ్మపెట్టవద్దంటున్నారు. కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, ఉప్పల్, ఖమ్మంలో మాత్రమే బాబు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆయన కేవలం తన సామాజికవర్గం అభ్యర్థుల కోసమే పనిచేస్తున్నారు. ముఖ్యంగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన ఓ బలమైన సామాజికవర్గం ప్రజాకూటమికి దూరమైంది. వీరు టీఆర్‌ఎస్‌లోని తమ వర్గం నేతలను కలిసి మద్దతు ప్రకటించారు. మరోవైపు చంద్రబాబు తీరు రుచిచూసిన వామపక్షాల క్యాడర్ కూడా పెదవి విరుస్తున్నది. కూటమిలో టీజేఎస్ నేతలు గంజిలో ఈగల్లా మారారు. వారున్నారనే విషయం టీడీపీ, కాంగ్రెస్ నేతలు మరిచిపోయారు. కోదండరాంకు అండగా ఉండే రచనారెడ్డి, ఆదిత్యరెడ్డి, జ్యోత్స్న టికెట్ల అమ్మకంపై ఆరోపణలే చేశారు.

సీపీఐ, టీజేఎస్ ఔట్..!
పేరుకు నాలుగు పార్టీల కూటమి అయినా ఇప్పుడు టీడీపీ, కాంగ్రెస్ మాత్రమే కనిపిస్తున్నాయి. చంద్రబాబు కుట్రలకు బలైన సీపీఐ మూడుస్థానాలకే పరిమితమైంది. సీపీఐ పోటీచేస్తున్న సీట్లలో కూటమి తరఫున మిగిలిన నేతలెవ్వరూ ప్రచారం చేస్తలేరు. టీజేఎస్‌కు పెద్దపీట వేసామని చెప్తున్నా.. దానిని కూడా మూడు సీట్లకే పరిమితంచేశారు. దీంతో ఇప్పటివరకు కూటమిలో, టీజేఎస్‌తో ఉన్న మేధావులు, టీఆర్‌ఎస్‌ను వ్యతిరేకించినవారు ఇక కూటమిలో ఉండటం ఏమాత్రం మంచిదికాదని బయటకు వచ్చేశారు. కోదండరాం కూడా చంద్రబాబుతో ప్రచారం అంటేనే దూరమవుతున్నారు. హోటళ్లలో, ఉత్త మ్, చంద్రబాబు ఇండ్లల్లోనే భేటీ అయితే కోదండరాం అటువై పు కూడా వెళ్లడంలేదు. ఉద్యమకాలంలో రాజీనామా డ్రామాలాడిన రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య వంటివారిని గెలిపించాలని కోదండరాం కోరడంపై తెలంగాణవాదులు ఆగ్రహంగా ఉన్నారు.

కనీసం ప్రచారంలోనైనా కలుపుకోరా..?
ఎర్రజెండా, పచ్చజెండా, హస్తంగుర్తు, అగ్గిపెట్టే గుర్తులన్నీ కలిసి ఏర్పాటైన కూటమికి ప్రచారంలో విచిత్ర పరిస్థితి నెలకొంది. అసలు కూటమి అంటే కాంగ్రెస్, టీడీపీ మాత్రమేనన్నట్లుగా మారింది. హైదరాబాద్‌లో ప్రచారం నిర్వహించిన చంద్రబాబు ఎవరినీ కలువనీయలేదు. ప్రచారానికి రావాలని కనీసం పిలువలేదు. కూకట్‌పల్లిలో కాంగ్రెస్, సీపీఐ, టీజేఎస్ జెండాలు కూడా కనిపించకుండా జాగ్రత్తపడ్డారు. అక్కడక్కడా కాంగ్రెస్‌తో కలిసి ప్రచారం చేసినా.. కేవలం ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాత్రమే చంద్రబాబు వెంటఉన్నారు. రాహుల్‌గాంధీ సభలకు రెండుచోట్ల చంద్రబాబు వెళ్లినా.. కూటమి పార్టీల నేతలతో కరచాలనం కూడా చేయలేదు. టీడీపీ పోటీచేస్తున్న 13 స్థానాల్లో టీజేఎస్, సీపీఐ జెండాలు కనిపించడం లేదు. కోదండరాం, సీపీఐ నేతలు ప్రచారంలో కూడా పాల్గొనడంలేదు. టీజేఎస్, సీపీఐ పోటీచేసే స్థానాలకు టీడీపీ నేతలు కూడా వెళ్లడంలేదు.