కాళేశ్వరం జలభాండం

కనుచూపు మేర నీళ్లు! ప్రాణహిత కలిసే కాళేశ్వరం వద్ద మేడిగడ్డ బరాజ్‌లో.. అక్కడి నీటిని కన్నెపల్లి పంప్‌హౌస్‌ద్వారా ఎత్తిపోస్తుండటంతో అన్నారం బరాజ్‌లో.. గోదావరి పరవళ్లు! వెరసి.. కాళేశ్వరం ప్రాజెక్టులోని రెండు బరాజ్‌లు జలభాండాగారాలను తలపిస్తున్నాయి. ప్రాణహిత నుంచి గోదావరిలోకి ఇన్‌ఫ్లో నిలకడగా ఉన్నది. కాళేశ్వరం వద్ద సోమవారం కూడా సుమారు 12 వేల క్యూసెక్కుల నీరు ప్రవహించినట్లు సాగునీటిశాఖ ఇంజినీర్లు వెల్లడించారు. ఫలితంగా మేడిగడ్డ బరాజ్‌లో క్రమేణా నీటినిల్వ పెరుగుతూ సోమవారానికి 6.70 టీఎంసీలకు చేరింది. మేడిగడ్డ బరాజ్ ఎఫ్‌ఆర్‌ఎల్ 100 మీటర్లు. ప్రస్తుతం 96.4 మీటర్ల వద్ద నీటిమట్టం ఉన్నది. ఈ నీటిని కన్నెపల్లి పంపుహౌస్‌లోని 1, 3, 4, 5, 6వ నంబర్ మోటర్లు ఏకధాటిగా గ్రావిటీ కెనాల్‌లోకి ఎత్తిపోస్తున్నాయి. ఈ నీరు కన్నెపల్లి- అన్నారం గ్రావిటీ కాల్వద్వారా 13.34 కిలోమీటర్ల దూరం ప్రవహించి.. అన్నారం బరాజ్‌లో కలుస్తుండటంతో బ్యాక్‌వాటర్ అన్నారం పంప్‌హౌస్ సమీపానికి ఎదురెక్కింది. సోమవారం నాటికి అన్నారం బరాజ్‌లో నీటి నిల్వ 4.59 టీఎంసీలకు పెరిగింది. ఫలితంగా.. ఫ్లడ్ రివర్ లెవల్ (ఎఫ్‌ఆర్‌ఎల్) 119 మీటర్లకుగాను సోమవారానికి నీటిమట్టం 115.60 మీటర్లకు చేరింది.
న్నారం పంప్‌హౌస్ వద్దకు జలాలు
అన్నారం బరాజ్ బ్యాక్‌వాటర్ గుంజపడుగు పంపుహౌస్ అప్రోచ్ కెనాల్ వద్దకు చేరిందని ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు తెలిపారు. మంగళవారం సాయంత్రానికి అన్నారం బరాజ్‌లో నీటినిల్వ 5.59 టీఎంసీలకు చేరే అవకాశం ఉన్నది. అన్నారం నీటినిల్వ సామర్థ్యం 10.87 టీఎంసీలు. ఇక్కడి పంప్‌హౌస్‌నుంచి నీటిని ఎత్తిపోయాలంటే బరాజ్‌లో నీటినిల్వ 6.70 టీఎంసీలకు చేరాలి. కన్నెపల్లి పంపుహౌస్ నుంచి వస్తున్న నీటితో బుధవారం రాత్రి వరకు బరాజ్‌లో నీటినిల్వ 6.70 టీఎంసీలు దాటవచ్చని సాగునీటిశాఖ ఇంజినీర్లు భావిస్తున్నారు. ఆ వెంటనే ఇక్కడి పంపుహౌస్‌లోని మోటర్లతో ఎత్తిపోతలకు చురుకుగా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఇప్పటికే నాలుగు మోటర్ల వెట్న్‌క్రు ప్రాథమిక పరీక్షలు నిర్వహించినట్టు ఈఎన్సీ వెంకటేశ్వర్లు తెలిపారు. మూడు లేదా నాలుగురోజుల్లో అన్నారం పంపుహౌస్ నుంచి గోదావరి జలాల ఎత్తిపోత ప్రారంభం కానుందని చెప్పారు.