కాబోయే సిఎం జ‌గ‌న్‌కు స్వామి ఆశీస్సులు

విశాఖ శ్రీ శార‌దా పీఠం స్వ‌రూపానందేంద్ర స‌ర‌స్వ‌తి మ‌హాస్వామి వారి ఆశీస్సుల‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్ కాబోయే ముఖ్య‌మంత్రి వై ఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి తీసుకున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌లో అఖండ విజ‌యం దిశ‌గా దూసుకుపోతున్న ఆయ‌న కొద్ది సేప‌టి కింద‌ట స్వ‌రూపానందేంద్ర స్వామివారికి ఫోన్ చేసి మాట్లాడారు. ఆయ‌న ఆశీస్సులు తీసుకున్నారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కుల ర‌హిత పాల‌న అందించాల‌ని, అర్హులైన అంద‌రు పేద ప్ర‌జ‌ల‌కు న్యాయం అందించాల‌ని ఈ సంద‌ర్భంగా స్వ‌రూపానందేంద్ర స్వామి ఆకాంక్షించారు. కులం ప్రాతిప‌దిక‌న కాకుండా అర్హ‌త ప్రాతిప‌దిక‌న ప్ర‌జ‌ల‌కు సేవ‌లు అందించి క‌ల‌కాలం వారి హృద‌యాల‌లో నిల‌చిపోవాల‌ని స్వామి వారు జ‌గ‌న్‌ను ఆశీర్వ‌దించారు. ఇప్ప‌టి వ‌ర‌కూ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌రిగిన కుల ప్రాతిప‌దిక పాల‌న‌ను అనుక్ష‌ణం గుర్తుంచుకోవాల‌ని ఆయ‌న సూచించారు. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్‌కు దిశానిర్దేశం చేస్తూ అలాంటి పాలన నుంచి ప్ర‌జ‌ల‌కు విముక్తి క‌లిగించాల‌ని కోరారు. చిర‌స్థాయిగా ప్ర‌జ‌ల‌లో నిలిచిపోయే మంచిప‌నులు చేయాల‌ని ఆయ‌న ఆకాంక్షించారు. అందుకు శార‌దాదేవి కాక్ష‌వీక్ష‌ణాలు ఎల్ల‌ప్పుడూ ఉంటాయ‌ని ఆయ‌న కాబోయే ముఖ్య‌మంత్రి వై ఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డిని ఆశీర్వ‌దించారు. త‌న ప్ర‌మాణ స్వీకారానికి హాజ‌రు కావాల‌ని స్వామివారిని వై ఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి కోరారు. ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వానికి వ‌చ్చి త‌న‌ను ఆశీర్వ‌దించాల‌ని ఆయ‌న చేసిన విన‌తిని స్వామివారు సానుకూలంగా తీసుకున్నారు.