కాంగ్రెస్ పార్టీకి రెబెల్స్ సెగ..

కాంగ్రెస్ పార్టీకి రెబెల్స్ సెగ..

తెలంగాణలో ప్రజాకూటమి పేరుతో విపక్షాలతో కలిసి ముందుకు వెళుతున్న కాంగ్రెస్ పార్టీకి అసంతృప్తి సెగ తగులుతోంది. కుటమి ఒప్పందంలో భాగంగా మల్కాజిగిరి నియోజకవర్గం టికెట్ ను కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణ జనసమితి(టీజేఎస్) కేటాయించడంతో ఈ రోజు వివాదం చెలరేగింది. తమ నేత నందికంటి శ్రీధర్ ను కాదని బయటి పార్టీకి ఇవ్వడంపై కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

హైదరాబాద్ లోని గాంధీభవన్ ను ఈ రోజు ముట్టడించిన కార్యకర్తలు అధిష్ఠానం తీరును నిరసిస్తూ ధర్నాకు దిగారు. కోదండరాం డౌన్ డౌన్, టీజేఎస్ నశించాలి, మల్కాజిగిరి సీటును శ్రీధరన్నకే కేటాయించాలి అంటూ నినాదాలతో హోరెత్తించారు. దీంతో ఇక్కడకు భారీగా చేరుకున్న పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలను సముదాయిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీధర్ అనుచరుడు ఒకరు మాట్లాడుతూ.. మల్కాజిగిరిలో కాంగ్రెస్ పార్టీకి గట్టి పట్టుఉందని తెలిపారు. ఎన్నికల సమయంలో మరో కొత్త పార్టీకి నియోజకవర్గాన్ని అప్పగించడం టీఆర్ఎస్ కు మేలు చేస్తుందని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా పార్టీ హైకమాండ్ సరైన నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.