కాంగ్రెస్‌కి 22, జేడీఎస్‌కి 12.. కర్ణాటక మంత్రివర్గ కూర్పునకు కుదిరిన ఒప్పందం.. 24న బలపరీక్ష

సీఎంగా రేపు జేడీఎస్‌ నేత కుమారస్వామి ప్రమాణ స్వీకారం
డిప్యూటీ సీఎంగా కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర
కాంగ్రెస్‌కు స్పీకర్, జేడీఎస్‌కు డిప్యూటీ స్పీకర్‌ పదవులు
కర్ణాటక ముఖ్యమంత్రిగా రేపు జేడీఎస్‌ నేత కుమారస్వామి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాంగ్రెస్‌-జేడీఎస్‌ మధ్య మంత్రివర్గ కూర్పునకు ఈ రోజు ఒప్పందం కుదిరింది. మొత్తం 34 మంత్రి పదవుల్లో కాంగ్రెస్‌కు 22 మంత్రి పదవులు జేడీఎస్‌కు ముఖ్యమంత్రి పదవితో కలిపి 12 పదవులు దక్కాయి. డిప్యూటీ సీఎంగా కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర ప్రమాణ స్వీకారం చేస్తారు.

ఒప్పందంలో భాగంగా కాంగ్రెస్‌కు స్పీకర్, జేడీఎస్‌కు డిప్యూటీ స్పీకర్‌ పదవులు దక్కాయి. స్పీకర్‌గా కాంగ్రెస్‌ నేత కేఆర్‌ రమేశ్‌ కుమార్‌ను ఈ నెల 25న ఎన్నుకోనున్నారు. బల నిరూపణ తరువాతే మంత్రి పదవుల అంశంలో శాఖల కేటాయింపుల ప్రక్రియ ఉంటుందని కాంగ్రెస్‌ నేత కేసీ వేణుగోపాల్‌ తెలిపారు. కాగా, కుమారస్వామి ఈ నెల 24న బలపరీక్ష ఎదుర్కోనున్నారు.