కర్నూలు సచివాలయ ఉద్యోగుల ఎంపిక జాబితా సిద్ధం: 25 నుంచి సర్టిఫికెట్ల పరిశీలన … 

 కర్నూలు(అర్బన్‌) : సచివాలయ ఉద్యోగుల ఎంపిక జాబితా దాదాపు సిద్ధమైంది. అధికారులు సోమవారం రాత్రి వరకు ఈ ప్రక్రియపై కుస్తీ పడుతూనే ఉన్నారు.   ఆర్డర్‌ ఆఫ్‌ ప్రిఫరెన్స్‌పై తేలకపోవడం, పలు శాఖల్లో రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌పై స్పష్టత లేని కారణంగా ఆయా శాఖల్లో ఎంపికైన అభ్యర్థులకు కాల్‌ లెటర్స్‌ పంపడంలో జాప్యం చోటు చేసుకుంటోంది. సోమవారం సాయంత్రానికి విలేజ్‌ ఫిషరీస్‌ అసిస్టెంట్‌ పోస్టులకు ఎంపికైన జాబితాను మాత్రం పూర్తి చేసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేశారు. మిగిలిన పోస్టులకు సంబంధించి మంగళవారం ఉదయానికల్లా అప్‌లోడ్‌ చేసే అవకాశం ఉంది. ఆయా శాఖలకు సంబంధించి జాబితాలు అప్‌లోడ్‌ చేసిన వెంటనే ఎంపికైన అభ్యర్థులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరు కావాల్సి ఉంటుంది. వీలైనంత త్వరగా మెరిట్, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్, రోస్టర్‌ ప్రకారం జాబితాలను సిద్ధం చేయాలని ఆయా ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు ప్రయత్నం చేస్తున్నా, ‘ ఆర్డర్‌ ఆఫ్‌ ప్రిఫరెన్స్‌’ పై తేలకపోవడం వల్ల జాప్యం జరుగుతూనే ఉంది.

25 నుంచి సర్టిఫికెట్ల పరిశీలన …
అన్ని పోస్టులకు సంబంధించి ఎంపిక జాబితాలను పూర్తి చేసి 25, 26, 27వ తేదీల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను చేపట్టేందుకు జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో సంబంధిత అధికారులు చర్యలు చేపడుతున్నారు. అన్ని పోస్టులకు సంబంధించి జెడ్పీ ప్రాంగంణంలోని కార్యాలయాల్లోనే సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ జరగనుంది.