కరీంనగర్ ఎంపీగా వినోద్...?

కరీంనగర్ ఎంపీగా వినోద్…?

తెలంగాణలో ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు వెళితే తాము మునిగిపోతామని కొందరు వ్యాఖ్యానించారని, అయితే కేసీఆర్ పై నమ్మకంతో తెలంగాణ ప్రజలు అఖండ విజయాన్ని కట్టబెట్టారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రధాని మోదీ, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ, బీజేపీ చీఫ్ అమిత్ షా, ఏపీ సీఎం చంద్రబాబు ప్రచారం చేసినా ప్రజలు వారిని పట్టించుకోలేదన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్ కు 47 శాతం ఓట్లు వేశారని అన్నారు. సిరిసిల్ల పర్యటన సందర్భంగా నిర్వహించిన సభలో కేటీఆర్ మాట్లాడారు.కేసీఆర్ తీసుకొచ్చిన రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలను ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు చూస్తున్నారని కేటీఆర్ అన్నారు. ఇది తెలంగాణ ప్రభుత్వానికే గర్వకారణమని వ్యాఖ్యానించారు.

దేశంలోని 11 రాష్ట్రాలు మిషన్ భగీరథ పథకాన్ని అభినందించాయని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిచేసి కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పారు. గ్రామ పంచాయతీల్లో ఏకగ్రీవం కోసం కృషి చేయాలని పార్టీ నేతలు, కార్యకర్తలకు సూచించారు.ఏకగ్రీవం అయ్యే పంచాయతీలకు ప్రభుత్వం ఇచ్చే రూ.10 లక్షలకు తోడు మరో రూ.15 లక్షలను నజరానాగా అందిస్తామని ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో రాజీపడిన నాయకులకు నామినేటెడ్ పదవులు ఇస్తామని కేటీఆర్ తెలిపారు. కరీంనగర్ పార్లమెంటు స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్థిగా మరోసారి బోయినపల్లి వినోద్ కుమార్ పోటీ చేస్తున్నారని కేటీఆర్ ప్రకటించారు. ఆయన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.