కన్నడ సినీ ప్రముఖుల ఇళ్లపై ఐటీ దాడులు

కన్నడ సినీ ప్రముఖుల ఇళ్లపై ఐటీ దాడులు

కన్నడ సినీ ప్రముఖు ఇళ్లలో ఐటీ దాడులు జరుగుతున్నాయి. గురువారం ఉదయం 6 గంటల నుంచి ఐటీ అధికారులు బెంగళూరు సహా పలుచోట్ల సోదాలు జరుపుతున్నారు. ప్రముఖ నటుడు పునీత్ రాజ్‌కుమార్, ఆయన సోదరుడు శివరాజ్‌కుమార్, నటుడు సుదీప్.. కేజీఎఫ్ మూవీ హీరో యశ్, నిర్మాత విజయ్‌ కిరంగదూర్‌.. నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్ ఇళ్లలో ఈ తనిఖీలు చేస్తున్నారు. కర్ణాటకవ్యాప్తంగా సినీ ప్రముఖులకు చెందిన ఇళ్లు, కార్యాలయాలు మొత్తం 60 చోట్ల ఐటీ సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఐటీ అధికారుల సడెన్ రైడ్లతో శాండల్‌వుడ్ సినీ ప్రముఖులు షాక్ తిన్నారు.

ఐటి అధికారుల దాడుల్లో ఏం దొరికాయి.. ఎలాంటి డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారనది తెలియాల్సి ఉంది. అధికారులు కూడా ఈ సోదాలపై ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. తనిఖీలు ఇంకా కొనసాగుతున్నట్లు సమాచారం. ఐటీ అధికారులు దాడులు చేస్తున్న సినీ ప్రముఖులంతా భారీ బడ్జెట్ సినిమాలు తీసిన హీరోలు, నిర్మాతలే. కేజీఎఫ్ ఈ మధ్యే బంపర్ హిట్ కొట్టింది. కలెక్షన్లలో కూడా దుమ్ము దులిపింది. ఇక నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్ కూడా కన్నడ, తమిళ, హిందీ చిత్ర పరిశ్రమల్లో ఎక్కువగా సినిమాలు తీశారు. అలాగే ఎన్నో హిట్ సినిమాలకు డిస్ట్రిబ్యూటర్‌గా ఉన్నారు.