కన్నడనాట బీజేపీకి భంగపాటు.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ విజయభేరి!

కర్ణాటకలో గత నెల 31న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ బోల్తా పడింది. కాంగ్రెస్ విజయ దుందుభి మోగించింది. ఆగస్టు 31న రాష్ట్రంలోని 29 మునిసిపల్ కౌన్సిళ్లు, 3 నగర కార్పొరేషన్లు, 50 మునిసిపాలిటీలు, 20 పట్టణ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. సోమవారం ఫలితాలు వెల్లడించారు. కాంగ్రెస్‌ 982 వార్డులను కైవసం చేసుకోగా, బీజేపీ 929 స్థానాల్లో గెలిచి రెండో స్థానానికి పరిమితమైంది. 375 వార్డులతో జేడీఎస్ మూడో స్థానంలో నిలిచింది.

కాంగ్రెస్ గెలుపుతో బీజేపీ నేతలు డీలా పడ్డారు. ఫలితాలు ఆశించినట్టుగా లేవని బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప పేర్కొన్నారు. మరోవైపు, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, జేడీఎస్ వేర్వేరుగా పోటీ చేశాయి. అయినప్పటికీ కాంగ్రెస్‌కు అత్యధిక స్థానాలు రావడంతో బీజేపీలో కలవరం మొదలైంది. మున్ముందు లోక్‌సభ ఎన్నికలు ఉండడంతో ఇదే సీన్ ఎక్కడ రిపీటవుతుందోనని భయపడుతున్నారు. ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి.
Tags: latest kannada ,local political ,news,congress,bjp,election