ntr biopic,balakrishna,sr ntr bio pic updates

 కధా నాయకుడి దెబ్బతో మహానాయకుడు వాయిదా

నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కిన బయోపిక్‌ మూవీ యన్‌.టి.ఆర్‌ కథానాయకుడు. క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడటంతో అదే స్థాయిలో ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ కూడా జరిగింది. ఎన్టీఆర్‌ సినిమాను దాదాపు రూ. 70 కోట్లకు అమ్మినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు తొలి రోజు నుంచి డివైడ్‌ టాక్‌ రావటంతో కలెక్షన్ల ఆశించిన స్థాయిలో రాలేదు. సంక్రాంతి సెలవులను కూడా యన్‌.టి.ఆర్‌ క్యాష్‌ చేసుకోలేకపోయింది.గత బుధవారం రిలీజ్‌ అయిన ఈ సినిమా తొలి వారాంతానికి ఇంకా రూ. 20 కోట్ల మార్క్‌ షేర్‌ కూడా సాధిం‍చలేదని ఇంటర్‌నేషనల్‌ బిజినెస్ టైమ్స్‌ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో యన్‌.టి.ఆర్‌ కథానాయకుడు బ్రేక్‌ ఈవెన్‌ సాధించటం సాధ‍్యమేనా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. పండుగ సెలవులు కూడా అయిపోవటంతో కలక్షన్లపై మరింత డ్రాప్‌ అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో యన్‌.టి.ఆర్‌ కథానాయకుడు భారీ డిజాస్టర్‌గా మిగిలే అవకాశలే ఎక్కువగా ఉన్నాయన్న టాక్‌ వినిపిస్తోంది. నవరస నటనా సార్వభౌముడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ బయోపిక్ ‘కథానాయకుడు’, ‘మహానాయకుడు’ పేరుతో రెండు భాగాలుగా తెరకెక్కిన సంగతి తెలిసిందే.
సంక్రాంతి కానుకగా తొలిభాగం ‘కథానాయకుడు’ జనవరి 9న విడులైంది. తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక అయిన ఎన్టీఆర్ బయోపిక్ కావడం, ఎన్టీఆర్ పాత్రలో ఆయన కుమారుడు బాలకృష్ణ నటించడంతో ఈ సినిమాపై విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే విడుదలైన తర్వాత అనుకున్న విధంగా ప్రేక్షకులను మెచ్చించలేకపోయింది ఈ చిత్రం. దీంతో నిరాశ చెందిన యూనిట్ రెండో భాగాన్ని కొద్దిరోజుల పాటు వాయిదా వేయాలని అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. తొలి భాగం ‘కథానాయకుడు’లో ఎన్టీఆర్ సినీ జీవితాన్ని, రెండో భాగం ‘మహానాయకుడు’లో రాజకీయ జీవితాన్ని చూపించారు. రెండో భాగాన్ని ఫిబ్రవరి 7న విడుదల చేయనున్నట్లు యూనిట్ గతంలోనే ప్రకటించింది. నిజానికి మొదటి భాగం కంటే రెండో భాగానికే ప్రేక్షకుల్లో ఎక్కువ వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉంది. ఎన్టీఆర్ రాజకీయ జీవితానికి సంబంధించి నిజాలను దాచిపెట్టి సినిమా తెరకెక్కించారని ఇప్పటికే ఎన్నో విమర్శలు వస్తున్నాయి. మరోవైపు తనను సినిమాలో విలన్‌గా చూపిస్తే కోర్టును ఆశ్రయిస్తానని మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్రావు మీడియాకెక్కారు. ఇటీవల అనేక యూట్యాూబ్ చానళ్లకు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ఎన్టీఆర్ గురించి అనేక వివాదాస్పద విషయాలు వెల్లడించారు. దీంతో ఎన్టీఆర్ గురించి నాదెండ్ల చెప్పిన సంగతులన్నీ ఈ సినిమాలో ఉంటాయో లేదోనని అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇన్ని సవాళ్ల మధ్య ‘మహానాయకుడు’ చెప్పిన రోజు విడుదలవుతుందో లేదో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి