ఓటుకు నోటు … జేసీ దివాకర్‌రెడ్డి వ్యాఖ్యలపై ఈసీ సీరియస్

Share This
  • జేసీ దివాకర్‌రెడ్డికి ఎన్నికల సంఘం షాక్
  • ఓటుకు నోటుపై వ్యాఖ్యలు చేసిన జేసీ దివాకర్‌రెడ్డి
  • ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్లు నిర్ధారణ
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో రూ.10వేల కోట్లకు పైగానే ఖర్చు అయిందని కొద్దిరోజుల క్రితం సంచలనం వ్యాఖ్యలు చేసిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డికి ఎన్నికల సంఘం  షాకిచ్చింది.  ఓటుకు నోటు వ్యాఖ్యలపై వైసీపీ, సీపీఐ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. దాన్ని పరిశీలించిన ఈసీ అధికారులు దివాకర్‌రెడ్డి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని నిర్ధారించారు. దీంతో ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు నివేదిక సమర్పించాలని స్థానిక అధికారులకు అనంతపురం జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీచేశారు. ఎన్నికల సంఘం చర్యలపై జేసీ వర్గం నుంచి ఇంకా ఎలాంటి స్పందన లేదు.

కొద్దిరోజుల క్రితం ఉండవల్లిలో మీడియాతో మాట్లాడుతూ   ఏపీ ఎన్నికల్లో అన్ని పార్టీలు కలిసి రూ.10వేల కోట్లు ఖర్చు చేశాయని, ప్రతి నియోజకవర్గంలోనూ ఖర్చు రూ.50కోట్లు దాటిపోయిందని జేసీ వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో ఒక్కో అభ్యర్థి ఖర్చు రూ.25కోట్లు దాటిపోయిందన్నారు.  ఒక్కో నాయకుడు ఓటును రూ.2వేల నుంచి రూ.5వేల వరకు ఖర్చుపెట్టి కొనుకున్నాడని, ఎన్నికల్లో ఖర్చు పెట్టిన సొమ్మంతా అవినీతి ద్వారా అవినీతితోనే సంపాదించియిందని  ఆరోపించారు.   జేసీ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి. ఆయన వ్యాఖ్యలపై వైసీపీ సహా కొన్ని పార్టీలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి.