ఐటీ ఎగుమతులు లక్ష కోట్లు

హైదరాబాద్‌కే పరిమితమైన ఐటీరంగాన్ని రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు విస్తరిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు. ద్వితీయ శ్రేణి నగరాలన్నింటిలో ఐటీహబ్‌లు ఏర్పాటుచేయాలన్న సీఎం కేసీఆర్ దిశానిర్దేశం మేరకు ముందుకు సాగుతున్నామని వివరించారు. ప్రపంచానికి అవసరమైన అన్ని ఉత్పత్తులను తయారుచేయగల సత్తా మనకుందని చెప్పారు. రాష్ట్రం ఏర్పడేనాటికి తెలంగాణ ప్రాంతం నుంచి ఐటీ ఎగుమతులు రూ.56వేల కోట్ల వరకు ఉంటే.. ఈ సంవత్సరం దాదాపు లక్ష కోట్లకు చేరుకున్నాయని తెలిపారు. వచ్చే ఏడాది అనుకున్న లక్ష్యం మేరకు లక్షా25వేల కోట్లకు చేరుకుంటామని విశ్వాసం వ్యక్తంచేశారు. నిజామాబాద్ నగరంలో రూ.50 కోట్లతో నిర్మించనున్న ఐటీ హబ్ భవనానికి బుధవారం నిర్వహించిన భూమిపూజ, శంకుస్థాపన కార్యక్రమాల్లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. అనంతరం పాలిటెక్నిక్ కాలేజీ మైదానంలో ఏర్పాటుచేసిన భారీ బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ.. సాంకేతిక, శాస్త్ర పరిజ్ఞానం ఫలాలను సామాన్యులకు, ద్వితీయ శ్రేణి పట్టణాలకు, మారుమూల ప్రాంతాలకు తీసుకువెళ్లాలన్న సీఎం కేసీఆర్ సూచనమేరకు నిజామాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్ తదితర నగరాల్లో స్థానికంగానే ఐటీ ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంతో ముందుకు పోతున్నామని చెప్పారు. రాబోయే సంవత్సరంలో వెయ్యికి తగ్గకుండా ఉద్యోగాలు నిజామాబాద్ ఐటీ హబ్‌లో కల్పిస్తామని చెప్పారు.

తెలంగాణ కోటి ఎకరాల మాగాణం కావాలి
తెలంగాణ ఉద్యమానికి ప్రాతిపదికైన నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తున్నదని మంత్రి కేటీఆర్ వివరించారు. దాశరథి ఇదే నిజామాబాద్ జిల్లా జైలుగోడల మీద నా తెలంగాణ కోటి రతనాల వీణ.. అని బొగ్గుతో రాశారు. మన ముఖ్యమంత్రి కేసీఆర్.. నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణ కూడా కావాలనే సంకల్పంతో ఉన్నారు. గోదావరి, కృష్ణానదిలో మనకు హక్కుగా రావాల్సిన ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టేందుకు కృషిచేస్తున్నారు. ఆ నీటిని కాళేశ్వరం, పాలమూరు, సీతారామ ప్రాజెక్టు, ఇతర ప్రాజెక్టుల ద్వారా బీడు భూములకు మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పారు. ఆడకూతుళ్ల కష్టం తెలిసిన మనసున్న సీఎం కాబట్టి.. ఈరోజు ఏ ఆడబిడ్డ నీటి కోసం బిందెలు పట్టుకొని రోడ్లమీదకు రావొద్దని మిషన్ భగీరథ కార్యక్రమాన్ని చేపట్టారని అన్నారు.
కొలువుల హామీ నెరవేరుస్తాం
లక్ష ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీ మేరకు పెద్ద ఎత్తున నియామకాలు చేపడుతున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇప్పటికే టీఎస్‌పీఎస్సీ ద్వారా 46వేలు, సింగరేణి, పోలీస్‌శాఖ, ఆర్టీసీ, పంచాయతీరాజ్.. మొత్తంగా లక్షా 12వేలు కాదు.. అనుకున్నదానికంటే ఇంకో పదిపన్నెండు వేల ఉద్యోగాలు ఎక్కువగానే ఇచ్చే సంకల్పంతో ముందుకు పోతున్నామని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన టీఎస్‌ఐపాస్ విప్లవాత్మకమైన పారిశ్రామిక విధానమని కేటీఆర్ చెప్పారు. దీనిద్వారా గడిచిన మూడేండ్లలోనే రాష్ర్టానికి లక్షా23వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. ఫలితంగా ప్రైవేట్‌రంగంలో కొత్తగా 5.50 లక్షల ఉద్యోగాలు సృష్టించగలిగామని చెప్పారు. ఈ క్రమంలోనే నిజామాబాద్‌లో ఐటీహబ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు.

ఇందూరు బిడ్డలు.. అద్భుత ఆవిష్కరణలు
ఇందూరు బిడ్డలు ఐటీ రంగంలో అద్భుత ఆవిష్కరణలు చేశారని మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. నిజామాబాద్‌కు చెందిన రాజురెడ్డి 30 ఏండ్లకిత్రం హైదరాబాద్‌లో ఒక సంస్థను హైదరాబాద్‌లో ఏర్పాటుచేశారని, దానిని జపాన్ సంస్థ ఇటాచీ టేకోవర్ చేసిందని తెలిపారు. ఈ రోజు రాజురెడ్డి కీలకమైన బాధ్యతలో ఉన్నారని చెప్పారు. నిజామాబాద్ మరో ముద్దుబిడ్డ సామా ఫణీంద్ర రెడ్‌బస్ డాట్ ఇన్ అనే సంస్థను ఏర్పాటు చేశారని, ఆ కంపెనీ ఈ రోజు వందల కోట్లకు చేరుకున్నదని తెలిపారు. ప్రస్తుతం ఫణీంద్ర రూపాయి జీతాన్ని కూడా ఆశించకుండా తెలంగాణ ఇన్నోవేషన్ సెల్‌కు సీఈవోగా ఉన్నారని వివరించారు. వాహనాల లైసెన్స్, ఆర్సీ, ఇన్సురెన్స్‌లు ఒకే చోట ఉండేలా రాడికల్ ట్రైబ్ అనే సంస్థ రూపొందించిన యాప్‌ను 20 లక్షలమంది డౌన్‌లోడ్ చేసుకున్న విషయాన్ని మంత్రి ప్రస్తావించారు. ఇవన్నీ కిందిస్థాయి ప్రజల సమస్యల్లోంచి వచ్చినవేనని చెప్పారు. ప్రపంచానికి అవసరమయ్యే పరిజ్ఞానాన్ని, ఉత్పత్తులను తయారుచేసే సత్తా మనకు కూడా ఉందని అన్నారు. ఈ ఉద్దేశంతోనే ప్రభుత్వం నిజామాబాద్‌లో ఐటీహబ్ ఏర్పాటుచేస్తున్నదని చెప్పారు. నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లిలో విమానాశ్రయ ఏర్పాటుకు ఇప్పటికే ప్రతిపాదనలు పంపామని కేటీఆర్ వెల్లడించారు. పట్టణంలో ఒక మల్టీపర్పస్ స్పోర్ట్స్ స్టేడియం ఏర్పాటుచేయాలని ఎంపీ కవిత కోరారని, త్వరలోనే నిర్మించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

అభివృద్ధి, సంక్షేమం.. ప్రభుత్వానికి రెండుకళ్లు
సంక్షేమం, అభివృద్ధి జోడెద్దులుగా ముందుకుపోతుంటే కొందరికి నచ్చడం లేదని మంత్రి కేటీఆర్ అన్నారు. కేసీఆర్‌ను గద్దెదించేవరకు నిదురపోమంటున్నారు. ఇంకొకరు కేసీఆర్‌ను గద్దెదించేంత వరకు గడ్డం తీయనని చెప్తున్నారు. ఆయన గడ్డం పెంచుకొని సన్యాసులలో కలిసిపోవాల్సిందే తప్ప మనకు పోయేది ఏంలేదు అంటూ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని ఉద్దేశించి విమర్శించారు. అన్నివర్గాల వారి సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేస్తున్నందుకు కేసీఆర్‌ను గద్దె దించాలంటున్నారా? అని కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు. రాష్ర్టాన్ని 55 ఏండ్లు పాలించినవారు ఈ పనులన్నీ చేసి ఉంటే తమకు ఈ రోజు ఈ అవకాశం వచ్చేదా? అని నిలదీశారు. అరవై ఏండ్ల దారిద్య్రం నాలుగేండ్లలో పోదని చెప్పారు. మీ అధిష్ఠానాలు, మీ బాసులు ఢిల్లీలోనో, అమరావతిలో ఉండొచ్చు.. మా టీఆర్‌ఎస్‌కు బాసులు ఢిల్లీలో లేరు.. నిజామాబాద్ గల్లీలోనే ఉన్నరు అని అన్నారు. అద్భుతంగా కేసీఆర్ నాయకత్వంలో ముందుకుపోతున్న ప్రభుత్వానికి ఏకపక్షమైన తీర్పునిచ్చి టీఆర్‌ఎస్ పార్టీని మళ్లీ గెలిపించాలని ప్రజలను కేటీఆర్ కోరారు. ఈ సభలో నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత, స్థానిక అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా, మిషన్ భగీరథ వైస్‌చైర్మన్, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, బోధన్ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్‌ఆమీర్, జెడ్పీ చైర్మన్ దఫేదార్ రాజు, నగర మేయర్ ఆకుల సుజాత, ఎమ్మెల్సీలు వీజీగౌడ్, రాజేశ్వర్, డీసీసీబీ చైర్మన్ గంగాధర్‌రావుపట్వారీ తదితరులు పాల్గొన్నారు.