cm kcr ap cm ys jagan meeting pics

ఏపీ, తెలంగాణ సీఎంల కీలక భేటీ ప్రారంభం (Gallery)

రాష్ట్ర విభజన సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, తెలంగాణ సీఎం కేసీఆర్ శుక్రవారం మరోసారి సమావేశమయ్యారు. కేసీఆర్‌ క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్‌లో ఈ సమావేశం జరుగుతోంది. సీఎం జగన్‌తో పాటు మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, కురసాల కన్నబాబు, బుగ్గన రాజేంద్రనాథ్‌, పేర్ని నాని, అనిల్‌కుమార్‌ యాదవ్‌ చర్చల్లో పాల్గొంటున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం.. ప్రభుత్వ సలహాదారులు, ఉన్నతాధికారులు అజేయ కల్లం, సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రేమ్‌చంద్రారెడ్డి, ఆదిత్యనాథ్‌దాస్‌, ఎస్‌ఎస్‌ రావత్‌ సమావేశానికి వచ్చారు.

తెలంగాణ తరపున కేసీఆర్‌తో పాటు మంత్రులు ఈటల రాజేందర్, ఎస్ నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సీనియర్ ఎంపీ కె కేశవరావు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషి, జెన్‌కో-ట్రాన్స్‌కో సీఎండీ డి. ప్రభాకరరావు, సలహాదారుడు టంకశాల అశోక్, ముఖ్య కార్యదర్శి ఎస్.నర్సింగ్ రావు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణరావు, నీటి పారుదల శాఖ ఇఎన్సీ మురళీధర్ చర్చలకు హాజరయ్యారు. సాయంత్రం వరకు సమావేశం జరగనుంది.

రెండు రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదాల పరిష్కారం, గోదావరి జలాల సంపూర్ణ వినియోగం, విద్యుత్‌ ఉద్యోగుల విభజన, విద్యుత్‌ పంపకాలకు సంబంధించి రెండు రాష్ట్రాలు పరస్పరం చెల్లించుకోవాల్సిన బిల్లుల బకాయిలు, రాష్ట్ర విభజన చట్టంలోని షెడ్యూల్డ్‌–9, 10లో పేర్కొన్న ప్రభుత్వరంగ సంస్థల విభజన తదితర అపరిష్కృత అంశాలపై ఇద్దరు సీఎంలు ఈ సమావేశంలో చర్చించనున్నారు.
వైఎస్‌ జగన్‌కు కేసీఆర్‌ స్వాగతం
తన మంత్రివర్గ సహచరులు, అధికారులతో కలిసి ఈ ఉదయం 11: 15 గంటలకు ప్రగతి భవన్ చేరుకున్న సీఎం వైఎస్‌ జగన్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన మంత్రివర్గ సహచరులు, అధికారులతో కలిసి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జగన్‌కు తెలంగాణ అధికారులను కేసీఆర్ పరిచయం చేశారు. జగన్‌ను తన ఛాంబర్‌కు తీసుకెళ్లి కాసేపు మాట్లాడారు. 11.30 గంటలకు ఇధ్దరు ముఖ్యమంత్రులు సమావేశ మందిరానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభ ఉపన్యాసం చేస్తూ సీఎం జగన్‌కు, ఏపీ బృందానికి స్వాగతం పలికారు.

This slideshow requires JavaScript.