4-Telugu Desam Party Telangana chief L Ramana

ఎల్.రమణ త్యాగం వెనుక…

తెలంగాణ ఎన్నికలు జరుగుతున్న వేళ ఎల్.రమణ పోటీకి దూరంగా ఉండటం చర్చనీయాంశమైంది. ఎల్.రమణ సొంత నియోజకవర్గం జగిత్యాల. అక్కడ కాంగ్రెస్ తాజామాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఉన్నారు. జీవన్ రెడ్డి కూడా సీనియర్ నేతే కావడంతో ఆయన స్థానాన్ని తాను అడగకుండా రమణ వదిలేయడం రాజకీయాల్లో మంచి సంప్రదాయంగా అభివర్ణిస్తున్నారు. మహాకూటమితో అధికారంలోకి వస్తామన్న ఆత్మవిశ్వాసం మెండుగా ఉన్నా రమణ మాత్రం ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. అనుకూల ఫలితాలు వస్తాయన్న తరుణంలోనూ ఆయన తన రాజకీయ జీవితానికి తానే ఫుల్ స్టాప్ పెట్టుకున్నారా? కేవలం పార్టీ సేవకే పరిమితమవుతారా…? ఇది తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్. రమణ పై పార్టీలోనే తెలుగు తమ్ముళ్లు చర్చించుకుంటున్న తీరు. ఎల్. రమణ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా ఈ ఎన్నికలకు దూరంగా ఉండటానికి కారణాల కోసం ఆయననే అడిగే ప్రయత్నం కొందరు చేసినా చిరునవ్వే సమాధానం ఇవ్వడం విశేషం.ఎల్.రమణ…తెలుగుదేశం పార్టీలో అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తి. పార్టీనే నమ్ముకుని ఉండటంతో ఆయనకు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తెలంగాణ పార్టీ అధ్యక్ష పదవిని కట్టబెట్టారు. పెద్దగా మాటకారి కాదు. ఛరిష్మాలేదు. కేవలం పార్టీ పట్ల నిబద్ధతే రమణకు ఆ పదవి తెచ్చిపెట్టింది.

24 ఏళ్ల రాజకీయ ప్రస్థానం రమణది. పాతికేళ్ల నుంచి జగిత్యాలలో జీవన రెడ్డితోనే తలపడుతున్నారు రమణ. ఇరవై అయిదేళ్లు ప్రత్యర్థులుగా ఉన్న చోట సాధారణంగా ఆ సీటు పై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నేస్తారు. కానీ రమణ ఆశించలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యేగా, ఎంపీగా బాధ్యతలు నిర్వహించిన రమణ మహాకూటమి లో కీలక పాత్ర పోషిస్తున్నారు. రమణ కోరుకుంటే నిజానికి జగిత్యాల కాకపోయినా మరోచోట ఛాన్స్ లభించేది. కానీ ఆశావహులు ఎక్కువగా ఉండటం, పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ గెలవగలిగిన స్థానాలను కూడా టీడీపీ దూరం చేసుకుంది. ఇదంతా చంద్రబాబు ఆదేశాలతోనే జరిగిందనడంలో ఏమాత్రం సందేహం లేదు.రమణ 1981లో కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగంలో చురుగ్గా పనిచేశారు. అయతే లక్ష్మీపార్వతి అండదండలతో ఆయన టీడీపీలో చేరి 1994లో జగిత్యాల టిక్కెట్ ను దక్కించుకున్నారు. మొదటి సారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

1994, 2009లో విజయం సాధించారు. 2004, 2014 ఎన్నికల్లో జగిత్యాల నుంచి జీవన్ రెడ్డి గెలుపొందారు. 1996లో కరీంనగర్ ఎంపీగా కూడా గెలుపొందారు. ఈసారి మహాకూటమి ఏర్పాటు కావడంతో ఆ బాధ్యతలతో రమణ బిజీగా ఉన్నారని చెబుతున్నారు. అప్పటి నుంచి రమణ పార్టీకార్యక్రమాలకే పరిమితమయ్యారు. కోరుట్ల స్థానం నుంచి పోటీ చేస్తారని ఒక దశలో ప్రచారం జరిగింది. అయితే రమణ దూరంగా ఉండటానికి కారణం చంద్రబాబు సలహాయే కారణమని చెబుతున్నారు. మొత్తం మీద రమణ ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా అనేకమంది టీడీపీ ఆశావహులకు అడ్డుకట్ట వేయగలిగారు. ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పోటీ చేయకపోవడం బహుశ రమణ ఒక్కరే కావచ్చేమో. ప్రస్తుతం రమణ మహాకూటమి అభ్యర్థుల ప్రచారంలో ఉన్నారు.