ఎన్‌ఆర్‌సీ విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదు: కేంద్ర హోంమంత్రి అమిత్‌షా స్పష్టీకరణ

ఎన్‌ఆర్‌సీ విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదు: కేంద్ర హోంమంత్రి అమిత్‌షా స్పష్టీకరణ

  • తృణమూల్‌ కాంగ్రెస్‌ బెంగాలీలను తప్పుదోవ పట్టిస్తోంది
  • అక్రమ వలసదారుల్ని అనుమతించేది లేదు
  • శరణార్థులకు మాత్రం పూర్తి రక్షణ

దేశ భద్రతను దృష్టిలో పెట్టుకుని జాతీయ పౌరసత్వ రిజిస్టర్‌ (నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజన్స్‌-ఎన్‌ఆర్‌సీ)ని పకడ్బందీగా అమలుచేసి తీరుతామని కేంద్రహోం మంత్రి అమిత్‌షా ప్రకటించారు. అక్రమ వలసదారులకు అడ్డుకట్ట వేసే విషయంలో ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేయమని స్పష్టం చేశారు.

ఈ విషయంలో పశ్చిమబెంగాల్‌లోని తృణమూల్‌ ప్రభుత్వం అక్కడి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తోందని ధ్వజమెత్తారు. నిజమైన భారతీయుల జాబితాతో తయారైందే పౌరసత్వ రిజిస్టర్‌. 1951 జనాభా లెక్కల సందర్భంగా రూపొందించిన ఈ రిజిస్టర్‌ను ఆ తర్వాత అప్‌డేట్‌ చేయలేదు. ఇటీవల ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన అస్సాంలో భారతీయ పౌరసత్వ రిజిస్టర్‌ ఆప్‌డేషన్‌తో కేంద్రం ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది.

ఈ రిజిస్టర్‌లో అక్కడి నివాసితుల్లో దాదాపు 19 లక్షల మందికి స్థానం దక్కలేదు. ఈ సందర్భంగా కొన్ని విమర్శలు వెల్లువెత్తాయి. ఎన్నికలు ముందుండడంతో ముఖ్యంగా తృణమూల్‌ కాంగ్రెస్‌ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇటీవల ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సమస్యను అమిత్‌షా దృష్టికి తీసుకువెళ్తూ తమ రాష్ట్రంలో ఎన్‌ఆర్‌సీని అమలు చేయాల్సిన అవసరం లేదని లేఖ కూడా రాశారు.

ఈనేపథ్యంలో అమిత్‌షా మాట్లాడుతూ అక్రమ వలసదారులను ఓటు బ్యాంకుగా మార్చుకోవడం వల్లే తృణమూల్‌ ప్రభుత్వం ఎన్‌ఆర్‌సీ అమలును వ్యతిరేకిస్తోందని విమర్శించారు. ఆ పార్టీ చెబుతున్నట్లు శరణార్థులకు ఎటువంటి భయం అక్కర్లేదన్నారు. హిందు, బౌద్ధ, సిక్కు, జైన మతాలకు చెందిన శరణార్థులు దేశం విడిచి వెళ్లాల్సిన అవసరం లేదని, వారికి ప్రభుత్వం పూర్తి రక్షణ కల్పిస్తుందని స్పష్టం చేశారు.