ఎన్నికల ప్రచారానికి చిరంజీవి.. స్పష్టం చేసిన రఘువీరా

సినిమా షూటింగుతో బిజీగా ఉన్న చిరంజీవి రాజకీయాలకు దాదాపు దూరంగానే ఉంటున్నారు. అయితే, రానున్న ఎన్నికల్లో ప్రచారానికి చిరంజీవి వస్తారని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేస్తారని చెప్పారు. సినిమా షూటింగ్ లో బిజీగా ఉండటం వల్లే పార్టీ సమావేశాలకు చిరంజీవి హాజరుకావడం లేదని తెలిపారు. ఏపీలో సింగిల్ గానే పోటీ చేస్తామని… 175 స్థానాల్లో కాంగ్రెస్ కు బలమైన అభ్యర్థులు ఉన్నారని చెప్పారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ కింగ్ మేకర్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.

వైసీపీకి దమ్ముంటే కేసీఆర్ తో కలసి ఎన్నికల్లో పోటీ చేయాలని రఘువీరా సవాల్ విసిరారు. తమ అధినేత రాహల్ ను ఎదుర్కొనే సత్తా ప్రధాని మోదీకి లేదని అన్నారు. ఇప్పుడు ప్రియాంకగాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడంతో మోదీ భయం మరింత ఎక్కువైందని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. వైయస్ లాంటి బలమైన నేత ప్రస్తుతం ఏ పార్టీలో లేరని చెప్పారు. జనసేనకు సంబంధించి ఇంతవరకు ఎలాంటి స్పష్టత లేదని అన్నారు.