ఎన్నికల ఎఫెక్ట్.. ప్రైవేట్ బస్సుల్లో టికెట్ల ధరలు చుక్కల్లో!

ఎన్నికల ఎఫెక్ట్.. ప్రైవేట్ బస్సుల్లో టికెట్ల ధరలు చుక్కల్లో!

ఓటు వేసేందుకు తమ సొంత ఊర్లకు తరలివెళ్లేందుకు ఏపీ, తెలంగాణ వాసులు సిద్ధమయ్యారు. ముఖ్యంగా, హైదరాబాద్ లో నివసిస్తున్న ఏపీకి చెందిన ఓటర్లు తమ ఊర్లకు బయలుదేరుతున్నారు. రైళ్లు, ఆర్టీసీ బస్సుల్లో ఇప్పటికే రిజర్వేషన్లు దొరకట్లేదు. వెయిటింగ్ లిస్ట్ లో కూడా అవకాశం దక్కని పరిస్థితి.

ఇక, ప్రైవేట్ బస్సుల విషయానికొస్తే, వాళ్లు చెప్పిందే ‘టికెట్ ధర’ అన్నట్టుగా ఉంది. అయినా, పట్టించుకోని ప్రయాణికులు ప్రైవేట్ బస్సులను ఆశ్రయిస్తున్నారు. దీంతో మామూలు టికెట్ ధర కంటే రెండు, మూడు రెట్లు అధికంగా ప్రైవేట్ బస్సుల వాళ్లు గుంజుతున్నారు. సాధారణ రోజుల్లో నడిపే బస్సుల సంఖ్య చాలట్లేదని, ఇంకా ఎక్కువ సంఖ్యలోనే బస్సులు నడుపుతామని ఓ ప్రైవేట్ ట్రావెల్స్ వ్యక్తి చెప్పారు.

ఇదిలా ఉండగా, ఏపీలోని కొన్ని నియోజక వర్గాలకు చెందిన నాయకులు నేరుగా హైదరాబాద్ కు బస్సులు పంపే ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. తమ నియోజకవర్గం ఓటర్లను ఒకే చోటుకు చేర్చి, అక్కడి నుంచి సొంత వాహనాల్లో తరలించే పనిలో కొంతమంది నాయకులు ఉన్నట్టు సమాచారం.