ఎన్టీఆర్‌కు ఆ రకంగా పెద్ద లోటే..

నందమూరి హరికృష్ణ మరణం ఆయన కుటుంబానికి ఎంత వేదన కలిగిస్తుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్‌కు తండ్రి మరణం పూడ్చలేని లోటే. హరికృష్ణ రెండో భార్య శాలిని తనయుడైన ఎన్టీఆర్.. చిన్నతనం నుంచి నందమూరి కుటుంబం ఆదరణకు నోచుకోలేకపోయిన మాట వాస్తవం. ఆ కుటుంబం అతడిని ఏనాడూ చేరదీసినట్లు కనిపించలేదు. హీరోగా నిలదొక్కుకుని ఒక స్థాయి అందుకున్నాకే కాస్త ఆ కుటుంబంలోకి రాగలిగాడతను. ఒకప్పుడు కళ్యాణ్ రామ్‌తో సైతం అతడికి మంచి సంబంధాలేమీ ఉండేవి కాదు.

ఇద్దరూ అన్నదమ్ముల్లా కాకుండా పరాయి వ్యక్తుల్లాగే ఉండేవారు. కానీ హరికృష్ణ వల్లో.. ఇంకో కారణంతోనో ఇద్దరూ ఒక్కటయ్యారు. తోడ బుట్టిన అన్నదమ్ముల్లాగే మెలిగారు. కొన్నేళ్లుగా ఇద్దరూ ఎంత ఆత్మీయంగా ఉంటున్నారో అందరూ చూస్తున్నారు.బాలకృష్ణ.. ఇతర నందమూరి కుటుంబ సభ్యులు తనను దూరం పెట్టినా తండ్రి, అన్నయ్యలకు బాగా దగ్గరయ్యాడు తారక్. హీరోగా ఎన్టీఆర్ తిరుగులేని ఇమేజ్ తెచ్చుకోవడంతో ఇప్పుడు అతడి ముందు మిగతా నందమూరి హీరోలు తక్కువగా కనిపిస్తున్నారు. బాలయ్యతో పోలిస్తే రెట్టింపు మార్కెట్‌ ఉంది తారక్‌కు. నందమూరి అభిమానాన్ని దాటి.. తనకంటూ ప్రత్యేకంగా అభిమాన గణాన్ని సంపాదించుకున్నాడతను. ఈ మధ్య కాలంలో ఇరత హీరోల అభిమానుల్లో నెగెటివిటీని తగ్గించుకుని అందరి వాడిగా మారే ప్రయత్నమూ చేశాడు.

ఎన్టీఆర్‌ భవిష్యత్తులో కచ్చితంగా రాజకీయాల్లోకి వస్తాడని.. ఈ నేపథ్యంలోనే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాడని విశ్లేషకులు భావిస్తున్నారు. నిజంగా అతడికి అలాంటి ఉద్దేశాలే ఉంటే.. తండ్రి అండ చాలా ఉపయోగపడేది. భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీలో కీలక పాత్ర పోషించాల్సి వచ్చినా.. లేక ఆ పార్టీనే టేకప్ చేయాల్సిన అవసరమే వస్తే.. హరి కీలకమయ్యేవారు. ఎన్టీఆర్ తనయుడిగా తెరవెనుక మంత్రాంగం నడపగలిగేవారు. ఐతే హరి మరణంతో ఇప్పుడు టీడీపీకి.. తారక్‌కు మధ్య లింక్ తెగింది. అంతమాత్రాన తారక్‌కు దారులు మూసుకుపోయినట్లు కాదు. కాకపోతే తండ్రి ఉంటే అతడికి ఉండే సపోర్టే వేరుగా ఉండేదన్నది మాత్రం వాస్తవం.