ఎక్కక ముందే చుక్కలు..

ప్రయాణికులను వదిలేసి వెళుతున్న విమానాలు
తమ లాభం కోసం ఎయిర్‌లైన్స్‌ సంస్థల తీరు
వినియోగదారుల ఫోరంను ఆశ్రయించాలంటున్న నిపుణులు నగరానికి చెందిన 12 మంది ముంబయికి వెళ్లేందుకు కొద్దిరోజుల ముందే విమాన టికెట్లు బుక్‌ చేసుకున్నారు. ముంబయికి వెళ్లే రోజు సదరు ఎయిర్‌లైన్స్‌ సంస్థ నిర్దేశించిన సమయానికి శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు. అన్ని తనిఖీలు పూర్తి చేసుకున్న సదరు ప్రయాణికులకు 104వ గేట్‌ నుంచి విమానం ఎక్కాలంటూ బోర్డింగ్‌ పాసులు ఇచ్చారు. విమానం ఎక్కేందుకు సదరు గేటు వద్దకు వెళితే ఎయిర్‌లైన్స్‌ సంస్థ ప్రతినిధులు అడ్డుకొని మరో గేట్‌ నుంచి ఎక్కాలంటూ సూచించారు. అక్కడికి వెళ్లగా ఇక్కడ కాదు అక్కడే అంటూ పంపిచారు. ఇలా అటూ ఇటూ తిరగడంతో.. సదరు విమానం వెళ్లిపోయింది. ఎన్నో ప్రణాళికలతో ప్రయాణాన్ని ప్రారంభించిన ప్రయాణికులు విమానాశ్రయంలో ఆగిపోవడంతో లబోదిబోమన్నారు.

శంషాబాద్‌ గ్రామీణ, న్యూస్‌టుడే
కొన్ని విమానయాన సంస్థలు ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నాయి. బోర్డింగ్‌ పాసులు అందజేసిన తర్వాత కూడా పదుల సంఖ్యలో ప్రయాణికులను ఎక్కించుకోకుండా వారితో చెలగాటమాడుతున్నాయి. ముఖ్యంగా శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇలాంటి ఘటనలు రోజుకొకటి వెలుగుచూస్తున్నాయి. సామర్థ్యానికి మించి టికెట్లను అమ్ముకుంటున్న పలు ఎయిర్‌లైన్స్‌ సంస్థలు.. ప్రయాణికులందరు ఒకేసారి విమానాశ్రయానికి రావడంతో అతి తెలివిగా బోర్డింగ్‌ పాసులు జారీ చేసి.. ఆఖరి క్షణంలో అటూ ఇటూ తిప్పి బురిడీ కొట్టిస్తున్నాయి. దీంతో అత్యవసరంగా దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. టికెట్ల డబ్బులు వెనక్కి ఇవ్వాలని ప్రయాణికులు ఆందోళన చేసినా అరణ్య రోదనే అవుతుంది. సదరు విమాన సంస్థ ప్రతినిధులు ముఖం చాటేస్తుండడంతో చేసేది లేక కొందరు ప్రయాణికులు వెనుదిరిగి ఇంటికి, మరికొందరు అప్పటికప్పుడు ఎక్కువ ధరకు టికెట్లను తీసుకుని గమ్యస్థానాలకు వెళ్లిపోతున్నారు.

పరిహారం కోసం చట్టాలున్నాయి..
పౌరవిమానయాన శాఖ పర్యవేక్షణలో ప్రజా రవాణా సేవలందిస్తున్న ఎయిర్‌లైన్స్‌ సంస్థలు ఆర్థికపరమైన మోసాలకు పాల్పడితే చట్టాలు కఠినంగా ఉన్నాయి. బోర్డింగ్‌ పాసులు జారీ చేసిన ప్రయాణికులను దురుద్దేశంతో విమానాశ్రయంలో వదిలేసి విమానాలు వెళ్లిపోతే.. బాధితులు తగిన ఆధారాలతో వినియోగదారుల ఫోరంను ఆశ్రయించవచ్చు. ప్రయాణికుల విలువైన సమయం, పని, ఎదుర్కొన్న ఇబ్బందులు, చెల్లించిన డబ్బులు తదితర అంశాలను పరిగణలోకి ఎయిర్‌లైన్స్‌ సంస్థలకు భారీగా జరిమానా విధించే అవకాశం ఉంది. అయితే చాలా వరకు ప్రయాణికులు న్యాయస్థానాన్ని ఆశ్రయించకపోవడంతో ఎయిర్‌లైన్స్‌ సంస్థల ఆటలు సాగుతున్నాయి. బాధిత ప్రయాణికులు ఎక్కువగా మధ్య తరగతి వారే ఉంటున్నారు. ఇది సదరు ఎయిర్‌లైన్స్‌ సంస్థలకు కలిసివస్తోంది. ఉన్నత విద్యావంతులను, వ్యాపారులను వదిలేసి వెళితే వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉంటుంది. చట్టాలపై వారికి అవగాహన ఉంటుంది.

సాంకేతిక లోపం తలెత్తితే..
దేశీయ, అంతర్జాతీయ విమానాలు టేకాఫ్‌ అవుతున్న సమయంలో సాంకేతిక లోపం తలెత్తితే ఇక నరకమే… మరమ్మతులకు గురైన విమానాలు గంటకు మించి ఆలస్యమైతే వెంటనే ఎయిర్‌లైన్స్‌ యాజమాన్యాలు ప్రయాణికులకు అన్ని సౌకర్యాలతో బస ఏర్పాటు చేయాలి. అయితే చాలావరకు మూడు నాలుగు గంటలు ఆలస్యమైనా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. అంతర్జాతీయ విమానాలు ఆగిపోతే.. ప్రయాణికుల ఇబ్బందులు వర్ణనాతీతం. ఒక్కోసారి 12 గంటల వరకు విమానం టేకాఫ్‌ ఆలస్యమయ్యే పరిస్థితి ఉంటుంది. సహనం కోల్పోయి ఆందోళనకు దిగితేనే ఎయిర్‌లైన్స్‌ ప్రతినిధులు స్పందించి అరకొర వసతులు కల్పించి చేతులు దులుపుకొంటున్నారు.

సామర్థ్యానికి మించి సేవలు
శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిత్యం 480కు పైగా విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఏడాదికి 12 మిలియన్ల ప్రయాణికులకు సేవలందించే సామర్థ్యం ఎయిర్‌పోర్టుకు ఉంది. కానీ ఏడాదికి 17మిలియన్ల ప్రయాణికులకు పైగా సేవలందిస్తోంది. దీంతో విమానాశ్రయం రాత్రీపగలు ప్రయాణికులతో కిటకిటలాడుతుండడంతో ఎవరి గోల వారిదే అన్న చందంగా మారింది. 9 దేశీయ ఎయిర్‌లైన్స్‌ సంస్థలు, 21 అంతర్జాతీయ ఎయిర్‌లైన్స్‌ సంస్థలు శంషాబాద్‌ నుంచి 61 గమ్యస్థానాలకు నిత్యం విమాన సర్వీసులను నడిపిస్తున్నాయి.

ఆఫర్ల పేరుతో..
ఇటీవల పలు ఎయిర్‌లైన్స్‌ సంస్థలు తమ సేవలను ప్రారంభించాయి. దీంతో పోటీ పెరిగింది. ప్రయాణికులను ఆకర్షించేందుకు పోటాపోటీగా ఆఫర్లు ప్రకటించి అతి తక్కువ ధరకు టికెట్లను విక్రయిస్తున్నాయి. గోవా, ముంబయి, దిల్లీ, బెంగళూరు, చెన్నై తదితర నగరాలకు వెళ్లేందుకు రెండు నెలల ముందే టికెట్లు బుక్‌ చేసుకుంటే 20 నుంచి 40 శాతం వరకు డిస్కౌంట్‌ అంటూ ఆఫర్లు గుప్పిస్తున్నాయి. దీంతో మధ్యతరగతి కుటుంబాలు సైతం విమానం ఎక్కేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఫలితంగా గత రెండేళ్లలో విమాన ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగింది. ఆఫర్‌పై టికెట్లు బుక్‌ చేసుకున్న ప్రయాణికులు ఎయిర్‌పోర్టుకు వస్తే.. ఆ రోజు ఉన్న డిమాండ్‌ దృష్ట్యా ఎయిర్‌లైన్స్‌ సంస్థలు ఎక్కువ ధరకు టికెట్లు అమ్మేసుకొని.. ఆఫర్‌పై టికెట్టు కొన్న వారిని వదిలేసి వెళుతున్నాయి.

వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేయండి
– టి.విజయ్‌భాస్కర్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా న్యాయసేవాధికార సంస్థ ప్రతినిధి
విమానయాన సంస్థల చేతుల్లో మోసపోయిన బాధిత ప్రయాణికులు వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేస్తే తప్పక పరిహారం పొందే అవకాశం ఉంది. మొదట ప్రయాణికులు సదరు సంస్థకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలని, స్పందించని పక్షంలో రిజిస్టర్‌ పోస్టు ద్వారా ఫిర్యాదు పంపించాలి. ఆ తర్వాత వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేయాలి. రూ.25 లక్షల వరకు నష్టపోతే ఆయా జిల్లాల్లోని జిల్లా వినియోగదారుల ఫోరంలో, అంతకుమించి దాటితే ఖైరతాబాద్‌లోని ఏరువాక భవన్‌లో ఉన్న రాష్ట్ర వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేయాలి. ప్రయాణికుల మానసిక వేదన, వృథా అయిన సమయం, చెల్లించిన రుసుములు పరిగణనలోకి తీసుకుని భారీగా సదరు సంస్థల నుంచి పరిహారం అందేలా ఫోరం చర్యలు చేపడుతుంది. ఫిర్యాదు చేయకపోతే ఇలాంటి ఘటనలు నిత్యం జరుగుతూనే ఉంటాయి.