ఉద్యోగ వంచన

వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాలు కల్పిస్తామంటూ నిరుద్యోగ యువతను కొన్ని ముఠాలు నిలువునా ముంచేస్తున్నాయి. తియ్యని మాటలతో వలేసి….నువ్వు ప్రభుత్వోద్యోగివి అయిపోయినట్టేనని అరచేతిలో స్వర్గం చూపిస్తున్నాయి. త్వరలో నువ్వు పనిచేయబోయేది ఈ కార్యాలయంలోనేనంటూ ఎన్నెన్నో ఆశలు కల్పిస్తున్నాయి. మేం చెప్పినంత డబ్బిస్తే…ఉద్యోగం నీకేనంటూ ఊరిస్తాయి. ఆ ఉచ్చులో చిక్కుకుని సొమ్ములు చెల్లించారో..ఆ మరుక్షణం నుంచే ఫోన్లు స్విచ్చాఫ్‌ చేసేసి…నెంబర్లు మార్చేసి పరారవుతారు. ఈ తరహా నేరాల బారిన పడి తాము మోసపోయామంటూ పోలీసులను ఆశ్రయిస్తున్న బాధితుల సంఖ్య ఆంధ్రప్రదేశ్‌లో రోజురోజుకు పెరుగుతోంది.
ఆశలు కల్పించి…ఉచ్చులోకి లాగి: అడ్డదారుల్లోనైనా సరే ప్రభుత్వోద్యోగం పొందొచ్చనే, పొందాలనే కొందరు నిరుద్యోగుల అత్యాశ, వారి అమాయకత్వం ఉద్యోగాల కల్పన పేరిట మోసగిస్తున్న ముఠాలకు అవకాశంగా మారుతోంది. వీరు తొలుత తమ ఉచ్చులో ఎవరు సులువుగా పడతారో గమనించి వారిలో లేనిపోని ఆశలు కల్పిస్తున్నారు. ఉన్నత స్థాయి వ్యక్తులు తమకు తెలుసని..వారి ద్వారే కార్యకలాపాల నడిపిస్తున్నామంటూ నమ్మబలికి డబ్బులు వసూలు చేస్తున్నారు. అలా తమ గుప్పిట్లో చిక్కుకున్న వారిని ఉపయోగించుకుని వారికి పరిచయస్తులు, స్నేహితులను తీసుకొస్తే కమీషన్‌ ఇప్పిస్తామని ఆశ చూపిస్తున్నారు. అదంతా నిజమేననుకుని ఒకరి ద్వారా మరొకరు డబ్బులు కట్టేస్తున్నారు. అంతకంటే ముందు ఈ ముఠాల సభ్యులు నిరుద్యోగులకు తమపై నమ్మకం కల్పించేందుకు వారిని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి విజయవాడ, గుంటూరుకు తరచూ రప్పించడం, సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల వద్దకు తీసుకెళ్లి…ఇప్పుడే ఫలానా అధికారితో మాట్లాడాను….డబ్బులు కట్టేస్తే రెండు, మూడు రోజుల్లో మీ పనైపోతుందంటూ మాయమాటలు చెబుతున్నారు. డబ్బు అందిపోయిన తర్వాత ఎవరికీ అందుబాటులో లేకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోతున్నారు.

మంత్రులు, అధికారుల సంతకాలూ ఫోర్జరీ
నిరుద్యోగులను నమ్మించేందుకు ఈ ముఠాలు పెద్ద ఎత్తున నకిలీ నియామక పత్రాలు, నకిలీ గుర్తింపు కార్డులు తయారు చేస్తున్నాయి. ఇవి మక్కీకి మక్కీ ప్రభుత్వ ఉద్యోగ పత్రాల మాదిరే ఉంటున్నాయి. మరికొన్ని ముఠాలైతే ఏకంగా మంత్రులు, అధికారుల సంతకాలనే ఫోర్జరీ చేస్తున్నాయి. వాటిని నిరుద్యోగులకు చూపించి నియామక ప్రక్రియలన్నీ పూర్తయిపోయాయని…సంబంధిత కార్యాలయం నుంచి ఒకటి, రెండు రోజుల్లో ఉద్యోగంలో చేరమని ఫోన్‌ వస్తుంది…సిద్ధంగా ఉండాలని చెప్పి వారికి కుచ్చుటోపి పెడుతున్నాయి. ఈ నకిలీ పత్రాలు, స్టాంపులు, సీళ్ల తయారీ పెద్ద ఎత్తున వ్యవస్థీకృతంగా సాగుతున్నా…ఆ దిశగా దర్యాప్తు సాగడం లేదు.

నాయకులు, అధికారులతో ఫోటోలు..
పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నత స్థాయి అధికారులు, రాజకీయ నాయకులు వివిధ ప్రజా, బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు వారితో సన్నిహితంగా ఉన్నట్లు ఫోటోలు దిగుతున్న ఈ ముఠాల సభ్యులు…నిరుద్యోగులు తమ వలలో చిక్కుకునేలా చేసేందుకు వాటిని వినియోగిస్తున్నారు. ఫలానా ప్రజాప్రతినిధితో నాకు బాగా చనువు…ఇవిగో సాక్ష్యాలూ..డబ్బులిస్తే ఉద్యోగం ఇప్పించే బాధ్యత నాది అంటూ నమ్మిస్తున్నారు. వీరి చేతిలో మోసపోయిన బాధితులు ఎవరైనా ఎదురుతిరిగితే ఆ చిత్రాలను చూపించి వారిని బెదిరిస్తున్న సందర్భాలూ అనేకం ఉంటున్నాయి. తమ డబ్బులు కోసం ఎవరైనా గట్టిగా అడిగితే కొందరు మోసగాళ్లు..బాధితులను చంపేస్తామని భయపెట్టిస్తుండగా… ఇంకొందరైతే తాను ఆత్మహత్య చేసుకుని తన చావుకు నీవే కారణమని లేఖ రాసి పోలీసు కేసుపెడతానని తిరగబడుతున్నారు.

‘పొరుగు’ నియామకాలనే అదునుగా చేసుకుని
పొరుగు సేవల పద్ధతిలో వివిధ ప్రభుత్వ శాఖల్లో జరుగుతున్న నియామకాలను కొందరు తమ మోసాలకు అవకాశంగా మలచుకుంటున్నారు. ఇదిగో ఫలానా పోస్టుకు సంబంధించి నియామకం జరుగుతోందంటూ మోసానికి తెరలేపుతున్నారు. ఇటీవల సర్వశిక్షాభియాన్‌లో ఇలాంటి పోస్టులుకు నిరుద్యోగుల నుంచి పోటీ తీవ్రంగా ఉండటంతో దళారులు రంగప్రవేశం చేసి ఒక్కో పోస్టుకు రూ.1.50 లక్షల నుంచి రూ.3 లక్షల వరకూ వసూలు చేశారు. మరికొన్ని చోట్ల అటెండర్‌, డేటా ఎంట్రీ ఆపరేటర్‌ ఉద్యోగాలిస్తామని డబ్బులు వసూలు చేశారు. తొలుత ఉద్యోగంలో చేరితే ఏడాదిలోనే రెగ్యులర్‌ అయిపోతుందంటూ మాయమాటలతో వంచిస్తున్నారు. ఆర్టీసీ, తితిదే, రైల్వే, ఆర్మీ తదితర విభాగాల్లో ఉద్యోగాలు కల్పిస్తామంటూ మోసాలు అధికంగా జరుగుతున్నాయి.

ఉద్యోగ మోసాలు…ఇవే తార్కాణాలు
* పర్యాటక శాఖలో ఉద్యోగం కల్పించమని ఆ శాఖా మంత్రి భూమా అఖిలప్రియ జారీ చేసినట్లు ఓ వ్యక్తి ఏకంగా నకిలీ పత్రాన్నే తయారు చేశాడు. కొన్ని నెలల కిందట సచివాలయంలో ఈ ఘటన జరిగింది.
* కడప జిల్లాకు చెందిన ఓ యువకుడికి రవాణాశాఖలో జూనియర్‌ సహాయకుడిగా ఉద్యోగం కల్పించాలని పేర్కొంటూ ఆర్టీసీ ఎండీ ఓఎస్డీ నాగేశ్వరరావు ఫోర్జరీ సంతకంతో కూడిన నియామక పత్రం ఒకటి కొన్ని నెలల కిందట సచివాలయంలోని రవాణా శాఖ పేషీకి చేరింది.
* ‘‘ఇంటర్‌ వరకూ చదివిన నేను వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నా. గుంటూరు జిల్లా యర్రబాలెంకు చెందిన ఓ వ్యక్తి సచివాలయంలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ.2 లక్షలు తీసుకున్నాడు. ఆ తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానంలో అవకాశముందని చెప్పి 15 సవర్ల బంగారం తీసుకెళ్లాడు. తితిదే అధికారులు ఫోన్‌ చేస్తారని..అప్పుడెళ్లి విధుల్లో చేరాలంటూ చెప్పాడు. నెలలు గడుస్తున్నా నాకు ఉద్యోగమూ రాలేదు. డబ్బులు, బంగారం తిరిగివ్వలేదు’’

-శేషగిరిరావు, కొల్లిపర మండలం, గుంటూరు జిల్లా
* బీటెక్‌ పూర్తి చేసి ఉద్యోగాన్వేషణలో ఉన్న గుంటూరు జిల్లా హాఫ్‌పేటకు చెందిన జాన్‌బాబుకు…అతని స్నేహితుడి ద్వారా నెల్లూరుకు చెందిన ఖాదర్‌ అలీ బాషా పరిచయమయ్యాడు. సచివాలయంలో రెవెన్యూశాఖలో జూనియర్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించాడు. పలుమార్లు అక్కడకు తీసుకెళ్లి సిబ్బందితో పరిచయమున్నట్లు మాట్లాడేవాడు. పక్కనే ఉన్న టేబుల్‌, కుర్చీ చూపించి ఇదే నీ సీటంటూ నమ్మబలికాడు. అలా దశలవారీగా రూ.19.50 లక్షలు తీసుకున్నాడు. నెలలు గడుస్తున్నా ఉద్యోగమివ్వలేదు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.
* తన తమ్ముడికి ఉద్యోగం కోసం విజయవాడకు చెందిన షేక్‌ మహ్మద్‌ ఇమ్రాన్‌ ఓ ఉద్యోగ కల్పన వెబ్‌సైట్‌లో నమోదు చేసిన వివరాలు ఆధారంగా..కోల్‌కతాకు చెందిన అమూల్య అనే వ్యక్తి ఇమ్రాన్‌ను ఫోన్‌లో సంప్రదించాడు. తాను రైల్వేలో టీసీ, కమర్షియల్‌ క్లర్క్‌ ఉద్యోగాలిప్పిస్తానని చెప్పి పరిచయం పెంచుకున్నాడు. దీంతో ఇమ్రాన్‌ తన తమ్ముడి కోసం రూ.6 లక్షలు కట్టగా…అమూల్య అందులో నుంచి రూ.30 వేలు తీసి కమీషన్‌గా ఇచ్చాడు. ఇంకా ఎవరినైనా ఇలాగే తీసుకొస్తే రూ.30 వేలు-రూ.40 వేలు ఇస్తానని చెప్పాడు. ఇమ్రాన్‌తో పాటు గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన ఓ విశ్రాంత సైనికోద్యోగి కూడా పదుల సంఖ్యలో నిరుద్యోగులతో అమూల్యకు డబ్బులు కట్టించారు. ఈ ముఠా ఇటీవల పోలీసులకు చిక్కింది.

* భారత రక్షణ రంగంలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి శ్రీకాకుళం జిల్లాకు చెందిన పైడి మోహన్‌బాబు తన దగ్గర రూ.6 లక్షలు తీసుకున్నారని విజయనగరం జిల్లా బొండపల్లి మండలం మద్దూరు గ్రామానికి చెందిన బాలి తారకేశు ఆ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు నిర్వహించిన పోలీసులు రెండు రోజుల కిందట మోహన్‌బాబును అరెస్టు చేశారు.

* ప్రభుత్వోద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగులను నమ్మించి రూ.కోటిన్నరకు పైగా వసూలు చేసిన అంతర్‌ జిల్లాల మోసగాడు రాళ్లబండి మాణ్యి రాంబాబు శర్మ ఇటీవల పోలీసులకు చిక్కాడు. న్యాయశాఖలో, పురపాలక శాఖలో, దేవాదాయ శాఖలో ఉద్యోగాలు కల్పిస్తానంటూ మోసాలకు పాల్పడ్డాడు.