ఉద్దేశ పూర్వకంగానే జగన్‌పై హత్యాయత్నం

ఉద్దేశ పూర్వకంగానే జగన్‌పై హత్యాయత్నం

ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగెస్‌ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిపై గత ఏడాది అక్టోబర్‌ 25న విశాఖ విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం ఉద్దేశ పూర్వకంగా జరిగిందేనని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) తేల్చి చెప్పింది. ఆ దాడి గురి తప్పకపోయుంటే మరణం సంభవించి ఉండేదని, అందుకే జగన్‌పై జరిగిన దాడిని రాష్ట్ర పోలీసులు హత్యాయత్నంగా పరిగణిస్తూ, ఆ మేరకు ఐపీసీ సెక్షన్‌ 307 కింద కేసు నమోదు చేశారని వివరించింది.

విమానాశ్రయంలో చట్ట విరుద్ధంగా, ఉద్దేశ పూర్వకంగా ఏదైనా ఉపకరణాన్ని, ఆయుధాన్ని ఉపయోగించి హింసకు పాల్పడటం ద్వారా ఎవరైనా తీవ్రంగా గాయపడినా, మరణించినా అది పౌర విమానయాన చట్టం ప్రకారం చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిర్వచన పరిధిలోకి వస్తుంది. జగన్‌పై జరిగిన దాడి ఘటనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర పారిశ్రామిక భద్రత దళం (సీఐఎస్‌ఎఫ్‌), ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఐబీ), ఎన్‌ఐఏలు ఇచ్చిన సమాచారాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, విశ్లేషించిన తర్వాతే ఇది పౌర విమానయాన చట్టం కింద చట్ట వ్యతిరేక కార్యకలాపాల పరిధిలోకి వస్తుందని కేంద్ర ప్రభుత్వం ప్రాథమిక అభిప్రాయానికి వచ్చిందని ఎన్‌ఐఏ వివరించింది. ఇందుకు అనుగుణంగానే ఈ ఘటనపై దర్యాప్తును తమకు అప్పగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసిందని పేర్కొంది.

రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్‌ దాఖలుకు గడువు
జగన్‌పై జరిగిన హత్యాయత్నం ఘటనపై దర్యాప్తును ఎన్‌ఐఏకు అప్పగిస్తూ కేంద్ర హోం శాఖ జారీ చేసిన ఉత్తర్వును సవాలు చేస్తూ రాష్ట్ర హోం శాఖ ముఖ్య కార్యదర్శి ఏఆర్‌ అనురాధ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై ఇటీవల విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్‌ గుడిసేవ శ్యాంప్రసాద్‌ పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వం, ఎన్‌ఐఏలను ఆదేశించారు. తాజాగా ఈ వ్యాజ్యం బుధవారం విచారణకు రాగా, అటు ఎన్‌ఐఏ, ఇటు కేంద్ర ప్రభుత్వం తరఫున ఎన్‌ఐఏ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ దాఖలు చేసిన కౌంటర్‌ను అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌ (ఏఎస్‌జీ) బొప్పుడి కృష్ణమోహన్‌ న్యాయమూర్తి ముందు ఉంచారు.

ఈ కౌంటర్‌కు తిరుగు సమాధానం ఇస్తూ అఫిడవిట్‌ దాఖలు చేసేందుకు ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) డి.రమేశ్‌ గడువు కోరారు. ఇందుకు న్యాయమూర్తి అంగీకరిస్తూ విచారణను ఫిబ్రవరి 12కి వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే సమయంలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి స్పందిస్తూ, ఈ వ్యాజ్యంలో తమనూ ప్రతివాదిగా చేర్చుకోవాలని కోరుతూ పిటిషన్‌ దాఖలు చేశామని, దానిని అనుమతించాలని కోర్టును కోరారు. దీనిపై ఎస్‌జీపీ రమేశ్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తూ కౌంటర్‌ దాఖలు చేస్తామని చెప్పగా, న్యాయమూర్తి అంగీకరించారు.

క్షేత్ర స్థాయి దర్యాప్తు ఆధారంగా చార్జిషీట్‌
‘ఈ విషయంలో కేంద్రం చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకుంది. ఎన్‌ఐఏ చట్టంలోని సెక్షన్‌ 6(5) కింద ఉన్న అధికారాన్ని ఉపయోగించి ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధం, చట్ట విరుద్ధం ఎంత మాత్రం కాదు. ఎన్‌ఐఏ చట్టంలోని సెక్షన్‌ 6 (6) ప్రకారం ఈ కేసు దర్యాప్తునకు సంబంధించిన రికార్డులు, డాక్యుమెంట్లన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర పోలీసులు ఎన్‌ఐఏకు అందజేయాలి. అయితే ఈ కేసులో మేం పలుమార్లు అభ్యర్థించినా, ఎన్‌ఐఏ ఆదేశించినా కూడా రాష్ట్ర పోలీసులు ఇప్పటి వరకు రికార్డులు, డాక్యుమెంట్లను తమకు సమర్పించలేదంది. దీంతో క్షేత్ర స్థాయి దర్యాప్తు ఆధారంగా దర్యాప్తు అధికారి ఈ నెల 23న ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేశారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేయండి’ అని ఎన్‌ఐఏ హైకోర్టును అభ్యర్థించింది.